top of page

శబ్ధం.. సౌండు కొత్తే కానీ వినసొంపుగా లేదు

Writer: ADMINADMIN

 ‘శబ్దం’మూవీ రివ్యూ




ఓవైపు విలన్‌-క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూనే.. అప్పుడప్పుడూ హీరోగానూ మంచి మంచి సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు తెలుగువాడైన తమిళ హీరో ఆది పినిశెట్టి. తన కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘వైశాలి’ సినిమాను రూపొందించిన అరివళగన్‌ తో అతను మళ్లీ ఒకటిన్నర దశాబ్దం తర్వాత కలిసి చేసిన సినిమా.. శబ్దం. ఇంట్రెస్టింగ్‌ ట్రైలర్‌ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: కేరళలోని మున్నార్‌ లో ఒక మెడికల్‌ కాలేజీలో ఒక జంట అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. వీరి స్నేహితురాలైన మరో అమ్మాయి కూడా కనిపించకుండా పోతుంది. దీంతో ఆత్మలు ఉన్నాయనే ప్రచారంతో ఆ కాలేజీ పేరు దెబ్బ తింటున్న స్థితిలో యాజమాన్యం.. ఆత్మల గురించి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరిపే ఘోస్ట్‌ ఇన్వెస్టిగేటర్‌ వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)ను కాలేజీకి రప్పిస్తుంది. కాలేజీలో ఆత్మలేవీ లేవని అతడితో నిర్ధారింపజేయాలన్నది కాలేజీ పెద్దల ప్లాన్‌. ఐతే వ్యోమ కళాశాలలో అనుమానాస్పద విషయాలను గమనిస్తాడు. కనిపించకుండా పోయిన మూడో అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీలో ఆత్మలున్నాయనే అతడి అనుమానం బలపడుతుంది. దీంతో తనదైన శైలిలో ఆత్మల ఉనికిని కనిపెట్టడానికి ప్రణాళిక రచిస్తాడు. మరి అతను అనుకున్నట్లే అక్కడ ఆత్మలున్నాయా.. ఉంటే ఎన్ని ఉన్నాయి.. వాటి గతమేంటి.. ఈ మరణాల వెనుక మిస్టరీ ఏంటి.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: ఇండియన్‌ ఫిలిం హిస్టరీలో ఎన్నో హార్రర్‌ సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో ఈరం (తెలుగులో వైశాలి) చాలా స్పెషల్‌. ఆత్మ ఒక వాహకాన్ని ఎంచుకుని దాని ద్వారా తన ఉనికిని చాటుకోవడం.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనే పాయింటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడమే కాక.. ఆ ఐడియాను ఎగ్జిక్యూట్‌ చేసిన తీరు అబ్బురపరిచింది. ఈ చిత్రంతో దర్శకుడిగా తన ఆగమనాన్ని శంకర్‌ శిష్యుడైన అరివళగన్‌ ఘనంగా చాటిచెప్పాడు. ఆ తర్వాత కూడా అతను కొన్ని వైవిధ్యమైన సినిమాలు తీశాడు. ఇప్పుడతను ‘వైశాలి’లో హీరోగా నటించిన ఆది పినిశెట్టినే పెట్టి తీసిన సినిమా.. శబ్దం. ఆది-అరివళగన్‌ కాంబో అనగానే ‘వైశాలి’ గుర్తొచ్చినట్లే.. ఈ సినిమా కాన్సెప్ట్‌ చూసినా ‘వైశాలి’ని గుర్తు తెస్తుంది. అక్కడ వాహకం ‘నీరు’ అయితే.. ఇక్కడ ‘శబ్దం’ సోర్స్‌ అయింది. ఐతే అక్కడ ‘నీరు’ మ్యాజిక్‌ చేసినట్లుగా.. ఇక్కడ ‘శబ్దం’ మాత్రం ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్‌ చేయలేకపోయింది. ఇందులో కూడా ఐడియా ఎగ్జైటింగ్‌ గా అనిపించినా.. దాన్ని ఎగ్జిక్యూట్‌ చేసిన తీరు మాత్రం అనుకున్నంత ఆసక్తికరంగా అనిపించదు. కన్విన్సింగ్‌ గా అనిపించని.. అసహజంగా అనిపించే సన్నివేశాల వల్ల ‘శబ్దం’ ఇంపాక్ట్‌ తగ్గిపోయింది. కాన్సెప్ట్‌.. కొన్ని క్రేజీ సీన్ల కోసం ‘శబ్దం’ను ఒకసారి ట్రై చేయొచ్చు కానీ.. ‘వైశాలి’ లాంటి ప్రత్యేకమైన అనుభూతి మాత్రం ఇది అందించదు.

ఎప్పుడూ చూడని ఒక ఐడియాను తెర మీద తొలిసారి చూసినపుడు కలిగే అనుభూతే వేరు. ‘వైశాలి’ సినిమాలో కథానాయిక ఆత్మ నీటిని వాహకంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్‌.. అలాంటి అనుభూతినే కలిగించింది. ఐతే ఐతే ‘శబ్దం’ సినిమా చూస్తుంటే ‘వైశాలి’ ఐడియాను రిపీట్‌ చేస్తున్న ఫీలింగ్‌ కలగడం వల్ల అందులో ఉన్న సర్ప్రైజ్‌ ఫ్యాక్టర్‌ ఇక్కడ కొరవడిరది. ‘వైశాలి’ అనే సినిమా లేకపోయి ఉంటే.. శబ్దాన్ని వాహకంగా చేసుకుని ఆత్మలు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనే పాయింట్‌ చాలా క్రేజీగా అనిపించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే అవకాశం ఉండేది. ‘వైశాలి’తో పోలిక సంగతి పక్కన పెడితే.. ‘సౌండ్‌’ కాన్సెప్ట్‌ కొంతమేర ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఘోస్ట్‌ ఇన్వెస్టిగేటర్‌ గా హీరో పాత్ర పరిచయం.. అనుమానాస్పద మరణాలను ఛేదించే దిశగా తనకు ఎదురయ్యే టాస్క్‌.. దాన్ని ఛేదించే క్రమంలో హీరో వేసే ఎత్తుగడలు.. ఇవన్నీ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మున్నార్‌ నేపథ్యాన్ని ఎంచుకుని ఒక వైవిద్యమైన థ్రిల్లర్‌ చూస్తున్న మూడ్‌ సెట్‌ చేయడంలో కూడా దర్శకుడు విజయవంతం అయ్యాడు. కాలేజీ లైబ్రరీలోని ఆత్మలను హీరో కనిపెట్టే ఎపిసోడ్‌ ‘శబ్ధం’లో స్టాండౌట్‌ గా నిలుస్తుంది. తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తూ.. షాక్‌ కు గురి చేసే ఈ ఎపిసోడ్‌ తర్వాత.. ఆత్మల వెనుక మిస్టరీకి సంబంధించిన స్టోరీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం.

ఐతే ‘శబ్దం’ సినిమాకు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ పెద్ద మైనస్‌ అయింది. ఆత్మల వెనుక కథ శిరోభారంగా అనిపిస్తుందే తప్ప.. అందులో ఎమోషన్‌ రాబట్టలేకపోయాడు దర్శకుడు. సౌండుతో ముడిపెట్టి మ్యూజిక్‌ థెరపీ.. స్కామ్‌.. అంటూ దర్శకుడు ఏదేదో చూపించాడు కానీ.. అదంతా కూడా చాలా అసహజంగా అనిపిస్తుంది. ఇటు ఎమోషన్‌ వర్కవుట్‌ కాక.. అటు కాన్సెప్ట్‌ కన్విన్సింగ్‌ గా అనిపించక ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ అంతా మిస్‌ ఫైర్‌ అయిపోయింది. ఏవేవో థియరీల గురించి దర్శకుడు చెప్పాలని చూశాడు కానీ.. అవి కన్విన్సింగ్‌ గా.. అర్థవంతంగా.. ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్‌ చేయలేకపోయాడు. ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలైన దగ్గర్నుంచి గాడి తప్పే ‘శబ్దం’.. ఆ తర్వాత ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయలేకపోయింది. కథలో ట్విస్టులకు లోటు లేకపోయినా.. అవి వావ్‌ అనిపించేలా మాత్రం లేవు. సౌండ్‌ కాన్సెప్ట్‌ పక్కన పెడితే.. ఆత్మల వల్ల సమస్య మొదలవడం.. తర్వాత ఆ ఆత్మల కథ తెలియడం.. చివరికి అవి ప్రతీకారాన్ని పూర్తి చేయడం.. ఇందులో ఇలా ఔట్‌ లైన్‌ మాత్రం సగటు హార్రర్‌ చిత్రాల టెంప్లేట్లోనే నడుస్తుంది. ఓవరాల్‌ గా చెప్పాలంటే.. ‘శబ్దం’లో కాన్సెప్ట్‌ ఇంట్రెస్టింగ్‌ గానే అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్లు బాగున్నాయి. కానీ పూర్తి సినిమాగా ఇది సంతృప్తినివ్వలేకపోయింది.

నటీనటులు: ఘోస్ట్‌ ఇన్వెస్టిగేటర్‌ అనే భిన్నమైన క్యారెక్టర్లో ఆది పినిశెట్టి సులువుగా ఒదిగిపోయాడు. ఆది సినిమాలు.. తన పాత్రల్లో వెరైటీ ఉంటుందనే నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడు. ఆది పెర్ఫామెన్స్‌ నీట్‌ గా సాగింది. తన నటనకు వంక పెట్టడానికి లేదు. హీరోయిన్‌ లక్ష్మి మేనన్‌ కూడా బాగా చేసింది. తన పాత్రకు కథలో మంచి ప్రాధాన్యమే ఉంది. నిన్నటితరం హీరోయిన్‌ అత్యంత కీలకమైన పాత్రలో రాణించింది. లైలాను నాన్సి పాత్రలో చూడడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించొచ్చు. నెగెటివ్‌ షేడ్స్‌ ను ఆమె బాగానే ప్రదర్శించగలిగింది. ఆమెకు జోడీగా నటించిన ఆర్టిస్ట్‌ కూడా బాగా చేశాడు. రెడిన్‌ కింగ్స్‌ లీ కామెడీ అక్కడక్కడా నవ్వులు పంచింది. ఎం.ఎస్‌.భాస్కర్‌.. మిగతా ఆర్టిస్టులు అంతా ఓకే.

సాంకేతిక వర్గం: తమన్‌ సంగీతం ఈ సినిమాకు అతి పెద్ద బలం. ‘శబ్దం’ కాన్సెప్టే సౌండుతో ముడిపడిరది కావడంతో.. ప్రతి సన్నివేశంలోనూ సంగీతం పాత్ర చాలా కీలకంగా మారింది. శబ్దాన్ని ఇందులో ఒక పాత్రలాగా చూడొచ్చు. ఆ పాత్రతో మాగ్జిమం ఇంపాక్ట్‌ చూపించడంలో తమన్‌ నేపథ్య సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. పాటలకు ఇందులో ప్రాధాన్యం లేదు. అరుణ్‌ పద్మనాభన్‌ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. మున్నార్‌ నేపథ్యంలో విజువల్స్‌ ద్వారా ఒక మూడ్‌ క్రియేట్‌ చేయడంలో కెమెరామన్‌ కృషి ప్రశంసనీయం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ అరివళగన్‌.. తన నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనాన్ని అందించాడు. అతను ఎంతో పరిశోధన చేసి ఈ కథ రాశాడని అర్థమవుతుంది. ఐతే ఎంత కష్టపడ్డప్పటికీ.. తెరపైన కన్విన్సింగ్‌ గా ఐడియాలను ప్రెజెంట్‌ చేస్తేనే ఫలితం ఉంటుంది. కానీ అరివళగన్‌ ఈ పనిని పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. కథ ఆరంభం.. ఎత్తుగడ బాగానే ఉన్నా.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ దగ్గర దర్శకుడు తేలిపోయాడు. ముఖ్యమైన సన్నివేశాలను కన్విన్సింగ్‌ గా.. లాజికల్‌ గా తీయలేకపోయాడు. కొత్తగా ఏదో చేయాలనే అరివళగన్‌ తపన అభినందనీయమే కానీ.. ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పించేలా మాత్రం లేదు.

నటీనటులు: ఆది పినిశెట్టి-లక్ష్మి మేనన్‌-సిమ్రన్‌-లైలా-ఎం.ఎస్‌.భాస్కర్‌-రెడిన్‌ కింగ్స్‌ లీ తదితరులు

సంగీతం: తమన్‌

ఛాయాగ్రహణం: అరుణ్‌ పద్మనాభన్‌

నిర్మాతలు: శివ- భానుప్రియ శివ

రచన-దర్శకత్వం: అరివళగన్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page