top of page

శంకరయ్యా.. నీ గంగ ఇక్కడ పొంగుతుంది చూడు!

Writer: NVS PRASADNVS PRASAD
  • సెప్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయిన రిజర్వ్‌ సైట్‌

  • మహాలక్ష్మినగర్‌ కాలనీ వెనుకభాగంలో ఉండలేకపోతున్న ప్రజలు

  • గత కొన్నాళ్లుగా సొంతిళ్లు ఖాళీ చేస్తున్న వైనం

  • రోగాలతో కునారిల్లుతున్న కాలనీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర పరిధిలో ఎన్నడూ లేనంత స్థాయిలో కాలువల్లో పూడికలను తీశారు. దీనిని ఎవరూ కాదనలేరు. ప్రతీ ఏడాది వర్షాకాలం ముందు పూడికల తీత సాధారణమే అయినప్పటికీ ఇంత పకడ్బంధీగా నగరంలో పూడికతీత పనులు జరిగిన సందర్భం మరొకటి లేదు. అకాల వర్షాల కారణంగా పూడికల తొలగింతకు అడ్డంకులు ఏర్పడినా ఎక్కడా తగ్గకుండా ఇప్పటికీ కాలువల్లో పూడికలు తీస్తునే ఉన్నారు. ఇది కచ్చితంగా హర్షించదగ్గ అంశమే. పూడికలు తీసిన కాలువల మీద పలకలు సరిగా వేయలేదని ఫిర్యాదులు వస్తే, దానికి కూడా స్పందించి రెండు రోజులుగా పలకలు సరిచేస్తున్నారు. దీన్నీ స్వాగతించాల్సిందే. ప్రజాప్రభుత్వమంటే ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే కదా!. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్న సమస్య వీటికి పూర్తిగా భిన్నమైనది. నగరంలో కాలువలున్న చోట పూడికలు తొలగించారు, పలకలు సరిచేశారు బాగానే ఉంది. అసలు కాలువే లేనిచోట మురుగునీరు పొంగిప్రవహిస్తుంటే ఏంచేయాలి? అది కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంస్థల నుంచి వస్తున్న వర్థాలవైతే ఎవరికి చెప్పుకోవాలి. కాలువల్లో ప్రవహించాల్సిన వ్యర్థాలు ప్రభుత్వ స్థలంలోనే స్టోరేజ్‌ అయితే ఏమని చెప్పుకోవాలి? సరిగ్గా ఈ సమస్యను ప్రస్తావించడమే ఈ కథనం సారాంశం. స్థానిక మహిళా డిగ్రీ కళాశాల వెనుక మహాలక్ష్మీనగర్‌ కాలనీ దక్షిణ భాగంలో ఉన్నవారు గత కొద్ది నెలలుగా సొంతిళ్లను సైతం వదిలేసి వేరే చోటకు అద్దెకు పోతున్నారు. ఉన్నవారు రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దీనికి కారణం ఏంటని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మహాలక్ష్మీనగర్‌ కాలనీ ఉమెన్స్‌ కాలేజీ వెనుక ఉన్న రిజర్వ్‌ సైట్‌లో పెద్ద ఎత్తున మురుగునీరు గత కొన్నేళ్లుగా నిల్వ ఉండిపోతోంది. ఈమధ్య కాలంలో ఈ మురుగుకు తోడు ఎండ లేకపోవడం, అకాల వర్షాల వల్ల పూర్తిగా దోమలు పునరుత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతం తయారైంది. తమ రిజర్వ్‌ సైట్‌ను పరిరక్షించుకునేందుకు మున్సిపల్‌ యంత్రాంగం దీని చుట్టూ ప్రహరీ అయితే కట్టిందిగానీ, ఈ సైట్‌ లోపలికి ఎటువంటి వ్యర్థాలు వదలకూడదన్న జాగ్రత్త మాత్రం తీసుకోలేదు. ప్రైవేటు వ్యక్తులు తమ ఇంటి వాడకం నీరు, లేవెట్రీ వ్యర్థాలను బయటకు విడిచిపెడితే మున్సిపల్‌ యంత్రాంగం చర్యలు తీసుకునేదేమో? కానీ ఉమెన్స్‌ కాలేజీ వెనుక వికలాంగుల హాస్టల్స్‌ ఉన్నాయి. ఇందులో 200కు పైబడి విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్‌కు మెయింటినెన్స్‌ లేకపోవడం, ఈ బిల్డింగ్‌కు, డ్రైనేజీ వ్యవస్థకు లింక్‌ లేకపోవడంతో దాదాపు 15 నుంచి 20 సెంట్ల మధ్య ఉన్న మున్సిపల్‌ రిజర్వ్‌ సైట్‌లోకి హాస్టళ్ల వ్యర్థాలన్నీ వదిలేస్తున్నారు. చివరకు మరుగుదొడ్ల కనెక్షన్‌ కూడా రిజర్వ్‌ సైట్‌లోకే ఉండటం క్షమించరాని అంశం. ఇదే విషయం మీద దివ్యాంగుల శాఖ ఏడీకి గతంలో ఫిర్యాదులు వచ్చినా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాలతో ఈ రిజర్వ్‌ సైట్‌ నిండిపోవడం చూస్తే ఆ పరిసర ప్రాంతాల్లో మనుషులు ఎలావుంటారో వేరేగా చెప్పనక్కర్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు లేని కాలనీలకు రోడ్లు వస్తున్నాయని, ఆ పక్కనే కాలువలు వేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ దివ్యాంగుల సంక్షేమ శాఖ వద్ద కూడా సొమ్ములున్నాయన్న విషయం మర్చిపోకూడదు. ఇటు మున్సిపాలిటీ, అటు దివ్యాంగుల సంక్షేమ శాఖ, రిజర్వు సైటూ మూడూ ప్రభుత్వానివే కావచ్చు. కానీ జనం ప్రాణాలు మాత్రం ప్రభుత్వానివి ఎప్పటికీ కాలేవు. ఈ ప్రాంతం నుంచి బయటపడలేనివారు ఇప్పటికీ రోగాలతో మూలుగుతున్నారు. వీలైతే స్వయంగా ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి వచ్చి తమ గోడును, మున్సిపాలిటీ రిజర్వ్‌ స్థలాన్నీ చూసి వెళ్లాలని స్థానికులు కోరుతున్నారు.

 
 
 

Commenti


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page