top of page

శంకర్‌తోనే పయనం!.. షరతులు వర్తిస్తాయ్‌!

Writer: ADMINADMIN
  • `సమావేశంలో తీర్మానించుకున్న గుండ అనుచరవర్గం

  • `అక్కడ లభించే గుర్తింపుపైనే తర్జనభర్జనలు

  • `నిర్ధిష్ట హామీ కోసమే ఎదురుచూపులు

  • `గౌరవానికి భంగం ఉండదని ఎంపీ రాము హామీ

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి దంపతులు క్రియాశీల రాజకీయాలకు సెలవు చెప్పడంతో ఇన్నాళ్లూ వారితో ఉన్న క్యాడర్‌ ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్‌కు మద్దతు పని చేయడానికి సిద్ధపడిరది. కాకపోతే షరతులు వర్తిస్తాయ్‌.. అనే ట్యాగ్‌లైన్‌ మాత్రం తగిలించారు. గుండ లక్ష్మీదేవికి టికెట్‌ వస్తుందని చివరి నిమిషం వరకు ఆమె వర్గం నాయకులు ఎదురుచూశారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు అభ్యర్థి మార్పు సాధ్యం కాదని తేల్చేయడం.. తామిక ఈ రాజకీయాలు చేయలేమంటూ గుండ దంపతులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడంతో ఎటువైపు తూగాలో నిర్ణయించుకోవడం కోసం బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం గొండు శంకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించినందున ఆయన గెలుపు కోసం పని చేయాలని మెజార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. కాకపోతే ఇప్పటికే శంకర్‌తో కొనసాగుతున్న క్యాడర్‌తో సయోధ్య చేసుకోవడం, గుండ లక్ష్మీదేవి వర్గంగా వచ్చినవారిని గౌరవించుకునే విషయాల్లో ఒక స్పష్టత కావాలని వీరు కోరుతున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో రెండేళ్ల నుంచే గొండు శంకర్‌ శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే మద్దతు తెలిపి శంకర్‌ వెనుక ఇన్నాళ్లూ నడిచారు. కానీ నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, కార్యదర్శి చిట్టి నాగభూషణంతో పాటు గారలో కైబాడి రాజు, జల్లు రాజీవ్‌ లాంటి కొందరు నాయకులు, వారి అనుచరగణం లక్ష్మీదేవితోనే చివరి వరకు కొనసాగారు. గుండ లక్ష్మీదేవే నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉన్నందున ఆమెతో ఇన్నాళ్లూ నడిచిన చాలామంది గొండు శంకర్‌కు టికెట్‌ ప్రకటించిన తర్వాత పార్టీ లైన్‌ మీరకూడదన్న ఉద్దేశంతో శంకర్‌ వెనుక ప్రచారానికి వెళ్లారు. అయితే చంద్రబాబు లక్ష్మీదేవి వైపు మొగ్గు చూపుతారన్న ఒకే ఒక్క ఆశతో మొదట్నుంచి గుండ కుటుంబానికి భక్తులుగా ఉన్న కొందరు ఆమెతోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పలాసలో ప్రజాగళం సభలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబు అభ్యర్థి మార్పు ఉండదన్న నిర్ణయం ప్రకటించాక లక్ష్మీదేవికి టికెట్‌ రాకపోతే గొండు శంకర్‌తో వెళ్తామని మరికొందరు అంతకు ముందే లక్ష్మీదేవికి చెప్పేశారు. దీనికి తోడు అప్పలసూర్యనారాయణ కూడా మొదట్నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోమని, అలా అని పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేమని అంతర్గతంగా ఇండికేషన్లు ఇస్తుండటంతో శంకర్‌ వెనుక రూరల్‌, గార మండలాల క్యాడర్‌ పెద్ద సంఖ్యలో మెర్జ్‌ అయిపోయింది. దీనికి తోడు ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిపి గొండు శంకర్‌ ప్రచారంలో పాల్గొంటుండటం వల్ల ఎంపీతో టచ్‌లో ఉన్న నాగావళి కృష్ణ వంటి నాయకులు టీడీపీ ప్రచారానికి వెళ్లారు. ఇక చివరిగా చంద్రబాబు కాదనడం, గుండ దంపతులు క్రియశీల రాజకీయాలకు సెలవంటూ ప్రకటించడంతో వారితో ఉన్న క్యాడర్‌ ఇప్పుడు తెలుగుదేశం కోసమే శంకర్‌కు పని చేయాలని నిర్ణయించుకుంది.

సయోధ్య దిశగా..

కాకపోతే ఇప్పటికే గొండు శంకర్‌ వెంట ఆయన వర్గం టీడీపీ నాయకులు తిరుగుతున్నందున తమ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న వీరిలో ఉత్పన్నమైంది. ఇదే విషయంపై బుధవారం జరిగిన సమావేశంలో తర్జనభర్జనలు పడ్డారు. చివరికి గుండ లక్ష్మీదేవి వద్ద ఎటువంటి ప్రాధాన్యత దక్కిందో, శంకర్‌ కూడా అదే ప్రాధాన్యతనిస్తే ఆయనతో వెళ్లడానికి అభ్యంతరం లేదని సమావేశంలో తీర్మానించుకున్నారు. వాస్తవానికి ఈ రాజకీయాల్లో ఇమడలేమని లక్ష్మీదేవి దంపతులు ప్రకటించిన వెంటనే మంగళవారం రాత్రి ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో లక్ష్మీదేవి వర్గానికి చెందిన మాదారపు వెంకటేష్‌, సింతు సుధాకర్‌, సవలాపురపు రమణ మాదిగల నేతృత్వంలో కొందరు భేటీ అయ్యారు. తాము తెలుగుదేశం పార్టీని కాదని బయటకు వెళ్లే రకం కాదని కాకపోతే తమ ప్రాధాన్యత ఏమిటో చెబితే శంకర్‌ కోసం పని చేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీనికి ఎంపీ హామీ ఇవ్వడంతో బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈమేరకు వీరంతా ఒక నిర్ణయం తీసుకొని హామీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమేరకు ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌లతో గురు లేదా శుక్రవారాల్లో సమావేశం కానున్నారు. ప్రస్తుతం లక్ష్మీదేవి వర్గం నుంచి వస్తున్న నాయకులను గొండు శంకర్‌ యధావిధిగా అకామిడేట్‌ చేయడంలో పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు. ఇంతవరకు తనతో తిరుగుతున్నవారికి పదవులు ఇస్తానని శంకర్‌ ఎటువంటి ఆశ చూపలేదు. శంకర్‌ను భుజాన మోస్తున్నవారంతా ఆయన్ను వ్యక్తిగతంగా ఇష్టపడో లేక గుండ కుటుంబాన్ని వ్యతిరేతతోనే పనిచేస్తున్నవారే. ఇక నగరంలో గొండు శంకర్‌తో నలుగురు డివిజన్‌ ఇన్‌ఛార్జీలు మొదట్నుంచి తిరుగుతున్నారు. మిగిలినవారు లక్ష్మీదేవితో ఉండటమో ే తటస్థంగా వ్యవహరించడమో చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కలిసొచ్చే అంశమేమిటంటే.. శంకర్‌తో మొదట్నుంచి ఉన్న డివిజన్‌ ఇన్‌ఛార్జీల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. కాబట్టి నగరంలో అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జీల నియామకంలో సమస్య తలెత్తే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే ఒకటి రెండు చోట్ల ఇబ్బంది ఎదురైనా, దాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సిన బాధ్యత శంకర్‌దే.

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page