top of page

శంకరా.. నిన్ను ‘చల్ల’గా ముంచేస్తున్నా‘రబ్బాయా’!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • రైల్వే పనుల పేరుతో గార నుంచి ఇసుక అక్రమ తరలింపు

  • అడ్డుకున్నవారితో చేతులు కలిపి సొమ్ములు పంచుకుంటున్న వైనం

  • జిల్లా అవసరాల కోసం తెచ్చుకున్న అనుమతులు

  • రూ.50వేలకు ఒక లారీ చొప్పున విశాఖకు తరలింపు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)


గతంలో రెవెన్యూ, మైన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన ఇసుకను ‘చల్ల’గా తరలించుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయుడు పాత్ర ఉండటంతో ఎమ్మెల్యే గొండు శంకర్‌కు ఈ విషయం తెలియపర్చాలని స్థానికులు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడంలేదు. నిత్యం కార్యాలయంలో జనం కిటకిటలాడుతుండటంతో ఇసుక వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాలేకపోతున్నారు. కానీ తన నియోజకవర్గంలో అక్రమంగా తట్టెడు ఇసుక ఎత్తడానికి వీళ్లేదని చెబుతున్న ఎమ్మెల్యే దృష్టిలో లేకుండానే దొంగలు దొంగలు కలిసి ఇసుకను పంచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు.

గార మండలం బూరవెల్లి, అంబళ్లవలస గ్రామంలో 500 మెట్రిక్‌ టన్నుల ఇసుకను విశాఖకు చెందిన శాంతి కన్‌స్ట్రక్షన్‌కు తరలించుకోవడానికి అనుమతి ఉందని, జూలై 25న కలెక్టర్‌ ఆర్డర్‌ ఇచ్చారని ఇసుకను బిల్లులు లేకుండా తరలించుకుపోతున్నారు. ఆర్డర్‌ జూలైలో ఇస్తే ఇసుక తరలించే ప్రక్రియను ఈ నెల 2 నుంచి ఎందుకు ప్రారంభించారో చెప్పడంలేదు. వాల్తేరు డివిజన్‌లో పూండీ, నౌపడా, కోటబొమ్మాళి, తిలారు, దూసి, పొందూరు స్టేషన్లలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం భవనాల నిర్మాణానికి ఇసుకను వినియోగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈస్ట్‌కోస్టు రైల్వే ఆసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖ మేరకు శాంతి కన్‌స్ట్రక్షన్‌కు 500 మెట్రిక్‌ టన్నుల ఇసుకను కేటాయించినట్టు కలెక్టర్‌ ఉత్తర్వులను చూపించి అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతున్నవారు తరలించుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో లారీకి రూ.50వేలు వసూలు

బూరవెల్లి, అంబళ్లవలస, జోగిపంతులుపేట గ్రామంలో అధికారులు సీజ్‌ చేసిన ఇసుకను రైల్వే కాంట్రాక్టు పేరుతో ‘చల్ల’గా ఒక ఆర్డర్‌ తెచ్చి ఇసుకను తరలించడానికి ప్రయత్నాలు చేయగా, స్థానికులు వ్యతిరేకించడంతో మొదట్లో వెనక్కి తగ్గారు. గ్రామ పెద్దలు, ట్రాక్టర్‌ యజమానుల జోక్యంతో ఇసుకను తరలించడానికి తీసుకువచ్చిన లారీలు, జేసీబీలను వెనక్కి పంపించారు. రాష్ట్రంలో డిమాండ్‌ కారణంగా ఇసుక ధర పెరగడంతో సీజ్‌ చేసిన ఇసుకను తరలించడానికి అప్పటికే గ్రామ పెద్ద అయిన నాయుడు ఒక స్కెచ్‌ వేసుకున్నారు. ఈయన సూచన మేరకు ‘చల్ల’గా ఇసుక తరలించడానికి లైన్‌ క్లియరైపోయింది. ఒక్కో లారీకి రూ.50వేలు వసూలుచేసి పంపిస్తున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులను సంప్రదించగా కలెక్టర్‌ ఉత్తర్వులు ఉన్నందున డబ్బులు చెల్లించకుండా ఇసుక తరలిస్తున్నారని మండల రెవెన్యూ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. అసలు ఎన్ని మెట్రిక్‌ టన్నులకు అనుమతి ఉంది, నిజంగా రైల్వే నిర్మాణాలకు ఇక్కడి నుంచే ఇసుక పట్టుకెళ్తున్నారా, ఎంత క్వాంటిటీ ఇప్పటి వరకు తరలించారన్న లెక్క మాత్రం లేదు. ఒకే ఒక్క ఆర్డరు చూపించి అన్ని చోట్ల నుంచి ఇసుకను తరలించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్క జోగిపంతులు పేటలోనే సీజ్‌ చేసిన వంద లారీలు ఇసుక ఉందని స్థానికులు చెబుతున్నారు.

క్విడ్‌ ప్రో కో పద్ధతిలో ఇసుకను ‘చల్ల’గా

రెండు నెలల క్రితం నుంచి రైల్వే కాంట్రాక్టర్‌ పేరుతో ఇసుక తరలింపునకు వచ్చిన ఆర్డర్‌ను పట్టుకొని తిరిగినా స్థానికులు వ్యతిరేకించడంతో స్థానికంగా ఉన్న నాయుడుతో కలిసి క్విడ్‌ ప్రో కో పద్ధతిలో ఇసుకను ‘చల్ల’గా తరలించేస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ తరలింపు అక్రమమని, ఈ ఆర్డర్‌ కాపీ చెల్లదని అడ్డుకున్న నాయుడుకు ఇప్పుడు వాటాలు అందడంతో మంగళవారం బిల్లులు ఇవ్వకుండానే లారీలను పంపించేశారు. బుధవారం 20 టన్నుల లారీకి రూ. 6,800 చొప్పున బిల్లు ఇచ్చి రూ.50 వేలు వసూలు చేశారని వినికిడి. పలాస, పూండీ వైపు రూటు చూపిస్తూ విశాఖపట్నం వైపు లారీలు పంపిస్తున్నారు. కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులు మేరకు కేవలం జిల్లాలోని పూండీ, నౌపడ, తిలారు, కోటబొమ్మాళి, దూసి, పొందూరుకు మాత్రమే ఇసుకను తరలించాలి. ఇక్కడ లోడ్‌ చేస్తున్న 20 టన్నుల ఇసుక లారీలను విశాఖపట్నంకు తరలిస్తున్నారు. పూండీ, పలాసలకు ఒకటి, అర లారీలు పంపించి బిల్స్‌ ఇస్తున్నారు. విశాఖపట్నం వెళ్లే లారీలకు బిల్స్‌ ఇవ్వకుండా నేరుగా రూ.50వేలు తీసుకొని పంపించేస్తున్నారు.

2014 టీడీపీ హయాంలో బైరి, కరజాడలో సీజ్‌ చేసిన ఇసుకను ఎన్‌ఈసీ కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌ ఆర్డర్‌ తెచ్చి ఇసుకను బహిరంగ మార్కెట్లో ఈయనే ‘చల్ల’గా అమ్ముకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక రెవెన్యూ, మైన్స్‌, పోలీసులు ఉన్నారు. వ్యవహారం అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి వెళ్లడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇసుక తరలించే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడూ అదే మాదిరిగా రైల్వే కాంట్రాక్టర్‌ పేరుతో ఒక ఆర్డర్‌ తెచ్చి సీజ్‌ చేసిన ఇసుకను విశాఖటప్నంకు తరలించుకుపోతున్నారని టీడీపీ నాయకులే చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారం ఎమ్మెల్యే దృష్టిలో లేదు. గడిచిన ఎన్నికల్లో గొండు శంకర్‌ గెలుపు కోసం పని చేసినందున వీరి మీద ఎమ్మెల్యేకు చెప్పడానికి కొందరు సంకోచిస్తుంటే, మరికొందరు చెబుతామని ప్రయత్నిస్తుంటే, ఆఫీసులో ఖాళీ లేకపోవడంతో చెప్పలేక కొందరు వెనక్కు వచ్చేశారు.

Komentar


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page