శుక్రవారం నుంచి దబిడిదిబిడే
- BAGADI NARAYANARAO
- Jun 3
- 3 min read
20 రోజులుగా సమ్మెలో ఇంజినీరింగ్ సిబ్బంది
మున్సిపల్ మంత్రితో అర్థాంతరంగా ఆగిన చర్చలు
వంటావార్పు నుంచి అన్నీ బంద్ వరకు అడుగులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం లాంటి ఎటుకూ చెందని కార్పొరేషన్‌లో ఉద్యోగాలంటే పారిశుధ్య విభాగమనే అనుకుంటారు. అదేదో పోలీస్ సినిమాలో సాయికుమార్ అన్నట్టు కనపడని నాలుగో సింహం ఒకటుంటుంది. దాన్ని మనం గుర్తించం. ఉదయాన్నే లేచి కుళాయిల నుంచి నీరొస్తుందంటే.. పంపింగ్ దగ్గర్నుంచి లిఫ్టింగ్ వరకు, ఆ తర్వాత సరఫరా వరకు పని చేసే సిబ్బంది ఉంటారు. చీకటి పడగానే లైట్లు వెలగాలంటే నిచ్చెనెక్కడానికి సిబ్బంది ఉంటారు. వారిని మనం గుర్తించం. ఇలా చెప్పుకుంటూపోతే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధిలో చాలామంది పని చేస్తుంటారు. వీరికి రూ.13వేలు నుంచి రూ.15వేలు మధ్యలో జీతం ఉంటుందంటే నమ్ముతామా? కొంచెం కష్టమే. కానీ అది వాస్తవం. మరికొద్ది రోజుల్లో రిటైరైపోయే ఈ ఇంజినీరింగ్ సిబ్బందికి ఇదే జీతం అందుతుండబట్టే గత 20 రోజులుగా వీరు సమ్మెబాట పట్టారు. జీతంలో కట్టయిన పీఎఫ్ తప్ప ఎటువంటి బెనిఫిట్స్ వీరికి రావు. విధి నిర్వహణలో చనిపోయినా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రాదు. అందుకే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. 19వ రోజు అంటే సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సంఘ నాయకులతో చర్చలకు కూర్చున్నా అది ఫలవంతం కాకపోవడంతో శుక్రవారం నుంచి సమ్మెలో ఉన్న సిబ్బంది పూర్తిస్థాయి ఇబ్బందులకు గురి చేయడానికి దిగుతున్నారు. అంటే.. ఉదయం నీరు నుంచి రాత్రి వరకు మున్సిపల్ సేవలన్నీ బంద్ కానున్నాయిమాట.
పురపాలక సంఘాల్లో అత్యవసర సేవలు అందించే ఇంజినీరింగ్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేల మంది 20 రోజులుగా సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి అర్థాంతరంగా వెళ్లిపోయారు. దీంతో చర్చలు మరో దఫా వాయిదా పడ్డాయి. చర్చలు విఫలం కావడంతో యూనియన్ నాయకులు సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కార్మికులు సమ్మెలో ఉన్నా నీటిసరఫరాలో అంతరాయం లేకుండా, వీధిదీపాలు మరమ్మతులను కమిషనర్ సూచనలతో చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఇంజినీరింగ్ వర్కర్ల సమ్మెను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించకుంటే రానున్న రోజుల్లో సమ్మె ఉధృతం చేయడంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో అన్ని సేవలను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంచినీటి సరఫరాను నిలుపుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై యూనియన్ నాయకులు కమిషనర్‌కు అల్టిమేటం ఇచ్చారు. చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడడంతో సమ్మెను కొనసాగిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం ఏర్పాటుచేసి నిరసన చేపడుతున్నారు.
వైకాపా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తూ అమల్లోకి తీసుకువచ్చిన ఆప్‌కాస్‌ను రద్దుచేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించింది. దీంతో మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లు ఆప్‌కాస్‌ను రద్దు చేస్తే కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత వేతనాల చెల్లింపులో వ్యత్యాసాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించడానికి చొరవ చూపలేదు. దీంతో సమ్మెలోకి దిగారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అత్యవసర సేవలైన నీటి సరఫరా, వీధిదీపాలు, పార్కుల నిర్వహణ, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితర టెక్నికల్, నాన్‌టెక్నికల్ విభాగాల్లో 150 మంది పని చేస్తున్నారు. వీరంతా గత రెండు దశాబ్ధాలుగా ఉన్నారు. వీరితో పాటే పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు రూ.24,500ను దఫదఫాలుగా పెంచారు. ఇందుకోసం పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి కనీస వేతనాలు సాధించుకోగలిగారు. అదే పద్ధతిలో మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లలో టెక్నికల్ వర్కర్లకు రూ. 29,200, నాన్ టెక్నికల్ వర్కర్లకు రూ.24,500 చెల్లించాలన్న ప్రధాన డిమాండ్‌తో సమ్మె చేస్తున్నారు. ఇప్పటి వరకు టెక్నికల్‌కు రూ.18వేలు చెల్లిస్తుండగా, అన్ని కటింగ్‌లు పోనూ చేతికి రూ.16,050 అందుతుంది. నాన్ టెక్నికల్ కేటగిరీలో పని చేస్తున్న వర్కర్లకు రూ.15వేలు వేతనం చెల్లిస్తుండగా, వీరికి కటింగ్‌లు పోనూ రూ.13,050 అందుతుంది. దీంతో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నారు. 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదు. సీనియారిటీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్‌ను ప్రధానంగా వినిపిస్తున్నారు. దీంతో 15 ఏళ్లు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్‌ను యూనియన్ ద్వారా వినిపిస్తున్నారు. దీంతో పాటుగా విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ను వినిపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి రూ.5లక్షలు పరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేసి హెచ్‌ఆర్ పాలసీ అమలుచేయాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీతో పాటు కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్నిరకాల సెలవులు వర్తింపజేయాలని సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం సమ్మెపై స్పందించకపోతే రాన్ను రోజుల్లో అన్ని రకాల సేవలను పూర్తిగా నిలిపేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
Comments