top of page

శ్రీకాకుళంనగరంలో కలకలం

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Jul 13
  • 1 min read
  • మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం

  • దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఘటన

  • కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. రంగంలోకి క్లూస్ టీం

  • వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన వెలుగుచూసింది. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కార్యాలయ ఆవరణ పరిసర ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో, గమనించిన స్థానికులు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పాడుబడిన భవనంలో పరిశీలించగా.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. దీనిపై అధికారులు వెంటనే నగర టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భవన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అక్కడకు ఎలా వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు శని, ఆదివారాలు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు ఉండటంతో, శుక్రవారం సాయంత్రం నుంచే కార్యాలయంలో అధికారులు గానీ, సిబ్బంది గానీ అందుబాటులో లేరు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, పురుగులు పట్టిన స్థితిలో ఉండటాన్ని బట్టి చూస్తే.. ఈ ఘటన సుమారు వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం నగరంలో ఇటివల నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page