top of page

శాస్త్రవేత్తే కాదు.. దేశభక్తుడు కూడా

Writer: DV RAMANADV RAMANA

భారతరత్న, సర్‌ సి.వి.రామన్‌ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి సాధించినవాడిగా అందరికీ తెలుసు. కానీ, ఒక మహోన్నతమైన వ్యక్తిగా జాతీయవాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్ది మందికే తెలుసు. ప్రాయోగిక విజ్ఞానం కేవలం తమకే సాధ్యమని యూరోప్‌ దేశాలు విర్రవీగు తున్న దశలో బ్రిటీష్‌ ఇండియాలోని ఒక భారతీయుడు, ఏ అవకాశాలు లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టినవాడు, నెలకు పది రూపాయల జీతంతో జీవితం వెళ్లబోస్తున్న ఒక కాలేజి ట్యూటర్‌ సుపుత్రుడు విదేశాలలో పెద్ద పెద్ద చదువులు చదవకుండానే, పెద్ద పెద్ద ప్రయోగశాలలు చూడకుండానే తనకు తానుగా ఒక కాకలుతీరిన శాస్త్రజ్ఞుడిగా తయారై, నోబెల్‌ బహుమతి సాధించి, దేశంలో అనేక పరిశోధనా సంస్థలు స్థాపించి, సర్వస్వం దేశానికి అర్పించగలగడం కేవలం చంద్రశేఖర్‌ వెంకటరామన్‌ వంటి అద్భుత వ్యక్తులకు మాత్రమే సాధ్యపడుతుంది. వైజ్ఞానిక పరిశోధనా రంగంలో రాజకీయాల జోక్యం ఏ మాత్రం సహించని సర్‌ సి.వి.రామన్‌ బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిటూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డెరెక్టర్‌ పదవి తనకు తానే వదులుకున్నాడు. హాలెండ్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ పదవి ఇస్తామని ఆహ్వానిస్తే సున్నితంగా తిరస్క రించాడు. కారణం.. తన సేవలు జీవితాంతం తన దేశానికే అర్పించాలని దృఢంగా నిశ్చయించు కున్నాడు కాబట్టి. అలాంటి మరో అతి సున్నితమైన కారణం వల్లనే లండన్‌ రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌కు రాజీనామా చేశాడు. వీటన్నిటికంటే మరెంతో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే ఆయన ఏ మాత్రం తొణకకుండా, బెణకకుండా వద్దన్నాడు. ఆ రోజుల్లో వారి కుటుంబం విశాఖపట్నానికి చేరింది. రామన్‌ చదువుకునే పాఠశాల సముద్రతీరాన ఉండేది. తరగతి గదిలోంచి చూస్తే, లేచి పడే సముద్ర కెరటాలు కనిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత చాలా కాలానికి తన ముప్ఫైవ యేట ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో యూని వర్సిటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌ వెళుతున్నప్పుడు మధ్యధరా సముద్రపు నీటి రంగు మళ్లీ అతనిని మేల్కొలిపింది. డెక్‌ మీద నిలబడి ఆకాశాన్ని, చుక్కల్ని, నీలి సముద్రాన్ని తదేకంగా పరిశీలిస్తూ, వెంట తెచ్చుకున్న చిన్న చిన్న పరికరాలతో సముద్రపు నీటి నమూనాలు పైకి లాగి, ప్రయోగాలు జరిపి చూశాడు. అప్పటి ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్‌ రేలై ` నీలాకాశపు ప్రతి బింబం సముద్రంపై పడడం వల్ల సముద్రం నీలంగా ఉంది అని అన్నాడు. కానీ, అది సత్య దూరమని రామన్‌ నిరూపించగలిగాడు. సముద్రం స్వతహాగా నీలంగా ఉందని, రామన్‌ ఆ ప్రయాణంలో నిర్ధారించుకున్నాడు. ఆ విషయంపైనే విస్తృతంగా పరిశోధనలు జరపాలని నిర్ణయిం చుకున్నాడు కూడా. అంతేకాదు, ఆ పని చేసి చూపించాడు. కేవలం ఆరేళ్ల కాలంలో.. అంటే 1927లో ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను ప్రపంచానికి ప్రకటించాడు. రెండు, మూడేళ్లు ప్రపంచ వ్యాప్తంగా రామన్‌ ఎఫెక్ట్‌ మీద చర్చలు జరిగాయి. విశ్లేషణలూ, పరిశీలనలు జరిగాయి. విచిత్రం ఏమిటంటే 1930లో నోబెల్‌ బహుమతులు ప్రకటించడానికి కొన్ని నెలల ముందే సి.వి.రామన్‌ స్టాక్‌హోమ్‌ వెళ్లిరావడానికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాడు. అదొక పిచ్చిపనిగా అనిపిస్తుంది గానీ, ఆయన ఆత్మవిశ్వాసం అలాంటిది! తెల్లవాళ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట ఒక నల్లవాడికి అందునా దక్షిణ భారతీయుడికి నోబెల్‌ రావడం అయ్యేపని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయన తన అచంచల ఆత్మ విశ్వాసాన్ని నమ్ముకుని ఉండడం సామాన్య విషయమా? తన పద్దెని మిదోయేట లండన్‌ నుంచి వెలువడే ‘ద ఫిలసాఫికల్‌ మేగజైన్‌’ (1906)లో పరిశోధన పత్రాలు ప్రచురించాడు. అప్పటికి ఆయన పీజీ (ఎంఏ) విద్యార్థి. తనకు ఇష్టమైన భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ, వెలుగు కిరణాల్ని కొలుస్తూ ఉండేవాడు. ప్రొఫెసర్‌ ఆర్‌ఎన్‌ జోన్స్‌ రామన్‌ ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ` నేచర్‌, ఫిలసాఫికల్‌ మేగజైన్‌ వంటి పత్రికలకు రామన్‌తో వ్యాసాలు రాయించి పంపిస్తూ ఉండేవాడు. ఉద్యోగం చేయడం తప్పనిసరైన పరిస్థితి. బ్రిటీష్‌ గవర్నమెంట్‌ వారి ఫెనాన్స్‌ సర్వీసులో చేరాడు. నోబెల్‌ బహుమతికి అర్హత సంపాదించగలిగే స్థాయి పరిశోధనలు కొన్నేళ్లలోనే అక్కడ చేయగలిగాడు. అందుకే భారత ప్రభుత్వం ‘భారతరత్న’ తో గౌరవించుకున్న తొలి శాస్త్రవేత్త కూడా ఆయనే అయ్యారు!

 
 
 

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page