ప్రజాప్రతినిధుల పేరు చెప్పి నామినేషన్ వర్క్‌లతో దోపిడీ
పనులన్నీ ఆ ఏఈ బినామీకే
బదిలీపై వెళ్లిపోతూ మెజర్మెంట్లు, బిల్లులు రెడీ చేసిన అధికారి
మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థిత

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు సుదీర్ఘ కాలంగా పాలకవర్గం లేకపోవడంతో ఇక్కడ పని చేస్తున్న అధికారులదే ఇష్టారాజ్యమైపోయింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏం జరుగుతుందో అటు కలెక్టర్‌కుగాని, ఇటు కమిషనర్లుగా పని చేస్తున్నవారికి గాని ఏమాత్రం తెలీదు. ఇక్కడ ఇంజినీర్లుగా పని చేస్తున్నవారే చక్రం తిప్పుతుండగా, కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా వార్డుల్లో చెత్తలు ఎత్తిస్తే సరిపోతుందన్న భావనతో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఏడేళ్ల పాటు ఇక్కడ ఏఈగా పని చేసి, ఒక్కడే కార్పొరేషన్ కార్యాలయంలో చక్రం తిప్పి, రెండు నెలల క్రితం విశాఖపట్నం బదిలీపై వెళ్లిపోయిన ఏఈ సంతోష్ తన బినామీలకే కార్పొరేషన్‌లో పనులన్నీ కట్టబెట్టి వాటి బిల్లులు పూర్తిచేసి తన వాటాను పట్టుకొని విశాఖపట్నం వెళ్లిపోయారు. స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న పాత హౌసింగ్‌బోర్డు కాలనీలోని పార్కులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రమంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్కును స్థానికులు ఉపయోగించుకునే విధంగా మారుస్తామని రొటీన్‌గా మీడియాకు ఒక మాట చెప్పారు. కేంద్రమంత్రి చెప్పారు కాబట్టి, పాత హౌసింగ్‌బోర్డు ప్రజలకు అవసరం కాబట్టి ఈ పార్కును సుందరీకరించడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలూ లేవు. కాకపోతే కేంద్రమంత్రి చెప్పారని అర్జంటుగా రూ.10 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించేశారు ఏఈ సంతోష్. అయితే ఇటువంటి లెక్కాపత్రం లేని పనుల్లో ఎక్కువ సొమ్ములు మిగులుతాయని ఏఈకి తెలుసు కాబట్టి ఎప్పట్లాగే తన బినామీ కాంట్రాక్టర్ అరసవల్లికి చెందిన మహేష్‌కు ఈ పనులు అప్పగించారు. రూ.10 లక్షలు పనులు ఒకేసారి చేపట్టాలంటే టెండర్లు పిలవాలి కాబట్టి, దీన్ని రెండు పనులుగా విభజించి చెరో రూ.5 లక్షలు పనులుగా చూపించి, రెండిరటినీ నామినేషన్ పద్ధతిలో మహేష్‌కు అప్పగించేశారు. పోనీ ఈ బినామీ కాంట్రాక్టరైనా పార్కు పనులు సవ్యంగా చేశాడా? అంటే.. అదీ లేదు. పిల్లలు ఆడుకోడానికి మట్టి వేయాల్సిన చోట రోడ్డు పనులకు వినియోగించే గ్రావెల్‌ను వేసి పార్కును చదును చేసేశాడు. ఇక బ్యూటిఫికేషన్ పేరుతో పార్కులోకి వెళ్లే రహదారికి అరిగిపోయిన టైర్లను తెచ్చి, వాటికి అనాపరక రంగులు వేయించి బ్యూటిఫికేషన్ అని చూపించేశాడు. ఈ పనులు చూసిన ఇంజినీరింగ్ అధికారి ఎవరైనా బిల్లులు చెల్లించడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ మహేష్‌కు సలహా ఇచ్చిందే ఏఈ సంతోష్ కాబట్టి, ఎంచక్కా దీని మెజర్మెంట్ పూర్తిచేసి బిల్లులు ఇచ్చేశారని తెలుస్తుంది. అయితే ఈ పార్కులో మట్టికి బదులు రాళ్లతో కూడిన గ్రావెల్ వేశారని బయటకు రావడంతో మేం తిన్నాం, నువ్వూ తినంటూ మరో రూ.8 లక్షలకు ఎస్టిమేషన్ పెంచి ఇప్పుడు దాని మీద మట్టి వేసే పనిని మరో కాంట్రాక్టర్ దీర్ఘాశి తిరుమలరావుకు అప్పగించారు. మహేష్ మొదట్నుంచీ.. అంటే ఏఈ సంతోష్ ఇక్కడకు బదిలీపై వచ్చిన దగ్గర్నుంచి కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులకు ముద్దుబిడ్డగానే చెలామణీ అవుతున్నాడు. మహేష్, గణేష్, సంతోష్‌ల త్రయం మున్సిపాలిటీలో ఎక్కువ పనులు గత ఏడేళ్లలో చేపట్టినట్లు తెలుస్తుంది. కొత్తగా కార్గిల్‌పార్క్ పనులను కూడా మహేష్, గణేష్ కలిసి చేపట్టారు. మధ్యలో పాత హౌసింగ్‌బోర్డు కాలనీ పార్కు మాదిరిగానే దీర్ఘాశి తిరుమలరావును కూడా చేర్చారు. రూ.40 లక్షలు నిధులు సుడా నుంచి రావడంతో తూతూ మంత్రంగా ఇక్కడ పనులు పూర్తిచేశారని కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు చెబుతున్నారు. వాస్తవానికి నామినేషన్ పద్ధతిలో పనులు ఇవ్వాలంటే అది అత్యవసరమై ఉండాలి. ఇక్కడ కేంద్రమంత్రి చెప్పారు కాబట్టి అత్యవసరంగానే దాన్ని చూపించి డొల్ల పనులు చేపడుతున్నారు. ఆ మాటకొస్తే అచ్చెన్నాయుడు మళ్లీ మంత్రి అయిన తర్వాత, ఇదే కేంద్రమంత్రి అనేక పనులు చేపట్టాలని సూచించారు. వాటిని పక్కన పెట్టి కేవలం మట్టి మశానంతో పూర్తిచేసి నాలుగు రోజులకు కొట్టుకుపోయే పనులను మాత్రమే కార్పొరేషన్‌లో చేస్తున్నారు. మున్సిపాలిటీకి స్పెషలాఫీసరు కలెక్టర్ కావడంతో కలెక్టర్ బంగ్లాలో గతంలో రూ.కోటికి పైగా పనులు మహేష్‌తోనే ఏఈ సంతోష్ చేయించారు. కలెక్టర్, జేసీ బంగ్లాల్లో రిపేరు వర్క్‌లను మున్సిపాలిటీ నుంచి చేయిస్తున్నారని సంబంధిత అధికారులకు తెలుసు గానీ, ఈ పేరుతో ఎంత సొమ్ము నొక్కేస్తున్నారన్న విషయం కలెక్టర్, జేసీలకు తెలియదు. మున్సిపల్ కార్యాలయంలో మాత్రం కలెక్టర్ ఆదేశాల మేరకే చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. పార్కుల్లో మొక్కలు పెరగాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా మట్టి మాత్రమే ఉండాలి. గ్రావెల్ వేస్తే కచ్చితంగా బిల్లులు ఆపాలి. అరసవల్లికి చెందిన కాంట్రాక్టర్ మహేష్ ఏఈ సంతోష్ ఇచ్చిన పనిని అంతే సంతోషంగా వేరే వ్యక్తులకు అప్పగించి పైసా పెట్టుబడి లేకుండా సొమ్ములు చేసుకుంటున్నారు. 150 అడుగుల పొడవు, 100 మీటర్ల వెడల్పు ఉన్న ఒక పార్కులో కంకర, పాత టైర్లు వేయడానికి రూ.10 లక్షలు ఎందుకిచ్చారో, ఇప్పుడు మరో కాంట్రాక్టర్ ద్వారా రూ.8 లక్షల ఖర్చుకు ఎందుకు సిద్ధపడుతున్నారో కనీసం కమిషనర్‌కు తెలిసినా సంతోషం.
Comentários