top of page

షాడో ఎమ్మెల్యేల ‘అధికార’ షో!

Writer: DV RAMANADV RAMANA

గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అన్ని స్థాయిల్లోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడిరది. దానికి భిన్నంగా స్వచ్ఛమైన పాలన అందిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం. వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి ఇచ్చిన హామీలను నమ్మి అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు మనలోనే కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మ కాన్ని పోగొట్టి చెడ్డపేరు తెస్తున్నారు. ఇవి ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు.. సాక్షాత్తు పాలక ఎన్డీయే కూటమి సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లగక్కిన అసంతృప్తి ఇది. మూడు రోజుల క్రితం జరిగిన కేబినెట్‌ మీటింగులో మంత్రులందరి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల, వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, నియోజకవర్గాల్లో ప్రదర్శిస్తున్న అధికార దర్పం ప్రభుత్వంపై పెట్టు కున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా ఉన్నాయని, మంత్రులే తమ పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకులు అదుపు తప్ప కుండా కంట్రోల్‌ చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకుండా చంద్రబాబు ఎందుకు అలా మాట్లాడారన్న చర్చ మొదలైంది. అయితే ముఖ్యమంత్రి ఆవేదనలో అర్థం ఉంది. రాష్ట్రంలో పాలనావ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు అహరహం చేస్తున్న కృషి కొద్దిమంది దుందుడుకు చర్యల కారణంగా వృథా అయిపోతోంది. రాష్ట్రంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేల చర్యలే చంద్రబాబు అసంతృప్తికి కారణమవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం అన్నమయ్య జిల్లాలో ఒక మంత్రిగారి సతీమణి తనకు కూడా ఎస్కార్ట్‌ వాహనం ఇవ్వాలని, ప్రొటోకాల్‌ పాటించాలంటూ పోలీసులపై చిందులు తొక్కడం ఎంతగా వైరల్‌ అయ్యిందో తెలిసిందే. అదే కోవలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా ఆరు గంటలకు పైగా చేసిన ధర్నా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను అప్పజెబితే పోలీసులు కేసు నమోదు చేయలేదన్నది అస్మిత్‌ ఆరోపణ. పోలీసులపై ఆయన చేసిన ఆరోపణలు, ధర్నా అంతిమంగా ప్రభుత్వానికే ఇబ్బందికరంగా పరిణమించాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు షోడో ఎమ్మెల్యేగా అధికార దర్పం ప్రదర్శిస్తుం డటం, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా సీఎం దృష్టికి వెళ్లాయి. నియోజకవర్గ పరిధిలో రామ చంద్రరావు కొంత భూమిని ఒక కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. తన భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత అదే కుటుంబానికి చెందిన మరో నాలుగు ఎకరాల భూమిని కూడా తక్కువ రేటుకు అంటే రూ.30 లక్షలకే తనకు ఆమ్మేయాలని ఆ కుటుంబం ఒత్తిడి ప్రారంభించారు. తాము చెప్పిన ధరకు అమ్మకపోతే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామచంద్రరావు బెదిరించారంటూ ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకోవడంతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీకాళ హస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మీడియా ప్రతినిధులనే బెదిరించడం వివాదంగా మారింది. ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ టీడీపీ అనుకూల మీడియాగా పేరొందిన ప్రధాన పత్రికలోనే వార్తా కథనం ప్రచురి తమైంది. ఆ వార్త రాసిన విలేకరిని ఎమ్మెల్యే సుధీర్‌ ఫోన్‌లో తీవ్రంగా బెదిరించడం మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. దాంతో చంద్రబాబు కల్పించుకుని ఎమ్మెల్యేను వివరణ కోరాల్సి వచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ జన్మదినోత్సవం సందర్భంగా ఆ నియోజకవర్గంలోని పోలీసు అధికారులందరూ కేకు తీసుకెళ్లి ఆమె చేత కట్‌ చేయించి వేడుకలు జరిపించడం కలకలం రేపింది. ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజును పోలీసులు జరపడమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో వెంకాయమ్మ తన భర్త కంటే ఎక్కువ అధికారాలు చెలాయిస్తూ నియోజకవర్గంలో పెత్తనాలు చేస్తుంటారన్న ఆరోపణలు బాగానే ఉన్నాయి. ఈ ఉదంతం విమర్శలపాలు కావడంతో వెంకాయమ్మ బర్త్‌డే పార్టీలో పాల్గొన్న పోలీసు అధికారులందరికీ పల్నాడు జిల్లా ఎస్పీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన గొట్టిపాటి లక్ష్మి తమ పార్టీయే అధికారంలో ఉన్నందున తానే ఎమ్మెల్యే అన్నట్లు చెలరేగిపోతున్నారు. డాక్టరు కూడా అయిన ఈమెగారు దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారు. నేరుగా సూపరింటెండెంట్‌ కుర్చీలో కూర్చుని మిగిలిన వైద్యులను నిలబెట్టి ఆస్పత్రి పనితీరుపై సమీక్ష చేయడం వివాదంగా మారింది. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు ఈమె స్వయానా మేనకోడలు కావడం విశేషం. అదే రీతిలో చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు కుమారుడు అక్కడి సీహెచ్‌సీకి వెళ్లి సూపరింటెండెంట్‌ కుర్చీలో కూర్చుని అధికార దర్పం ప్రదర్శించారన్న ఆరో పణలు కూడా వచ్చాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉన్న ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే జరుగుతున్న పరిణామా లపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరిద్దరి వ్యవహారశైలి వల్ల మొత్తం ప్రభుత్వానికి డ్యామేజ్‌ జరుగు తుందని, చేస్తున్న మంచి అంతా మట్టికొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. అటువంటి ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకోవడంతో పాటు తమ బంధువులను అదుపు చేసుకోవాలని, లేనిపక్షంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారని అంటున్నారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం లీక్‌ అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. టీడీపీ వర్గాల్లో ఇప్పుడివే చర్చనీయాంశంగా మారాయి.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page