సచివాలయ ఉద్యోగుల మెడపై వేటుకత్తి
- BAGADI NARAYANARAO

- Apr 7
- 2 min read
IVRS ఫీడ్‌బ్యాక్ ద్వారా తొలగింపు
ఆరేళ్లు దాటినా ప్రమోషన్లు లేవు
నిత్యం ఆకస్మిక తనిఖీలతో ఉక్కిరిబిక్కిరి

సచివాలయం డిజిటల్ సహాకుడితో మాట్లడుతున్న కలెక్టర్ (ఫైల్ ఫోటో)
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సచివాలయం ఉద్యోగుల మెడపై వేటు కత్తి వేలాడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగిందన్న విమర్శలు పక్కన పెడితే, రాష్ట్రంలో IVRS కాల్స్‌కు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో సుమారు 200 మందిని సస్పెండ్ చేయగా, అందులో జిల్లాలో ఆరుగురు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. ఇది కాకుండా షోకాజ్ నోటీసులు, మెమోలు అందుకున్నవారు జిల్లాలో సుమారు 500 మంది వరకు ఉన్నారు. దీంతో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన సచివాలయ ఉద్యోగులను పొమ్మనలేక కూటమి ప్రభుత్వం పొగబెడుతుందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం వారి జాబ్‌చార్ట్‌ను మార్చడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది.
వైకాపా హయాంలో సచివాలయ ఉద్యోగులు కేవలం వారికి అప్పగించిన పనిని సచివాలయం పరిధిలో మాత్రమే నిర్వహించడానికి వెసులుబాటు ఉండేది. కూటమి ప్రభుత్వం సచివాలయాలను, అందులో ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన క్లస్టర్లుగా విభజించి విధులు అప్పగించింది. అంతకు ముందు ఒకే పనిని వాలంటీర్లతో కలిసి సచివాలయ ఉద్యోగులు నిర్వహించేవారు. వాలంటీర్లను తొలగించి, ఉద్యోగులను రేషనలైజేషన్ చేసిన తర్వాత పని విధానంలో సమూలమైన మార్పులను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు. 2500 మంది జనాభాకు ఒక సచివాలయం, అందుకు సరిపడా సిబ్బంది ఉండటం తప్పేమీ కాదు. కాకపోతే గతంలో అంతకంటే తక్కువ జనాభాకు వాలంటీర్లతో కలిపి సేవలందించిన వీరు ఇప్ప్పుడు జనాభా పెరిగేసరికి వర్క్‌లోడ్ పెరిగినట్టు ఫీలవుతున్నారు. అయితే ఇక్కడ సమస్య అది కాదు.
సచివాలయాల ఉద్యోగుల పనితీరుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం, సచివాలయాల పరిధిలో అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కలెక్టర్, జేసీతో పాటు డీఆర్‌వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, డీఎస్‌వో, డీఆర్‌డీఏ పీడీ, జడ్పీ సీఈఓ, డీపీవో, డీఎల్‌పీవో, డీఎల్‌డీవో, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఈవో పీఆర్‌డీ, డిప్యూటీ ఎంపీడీవో, ఎంఈవో, మండల ఇంజినీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్లు.. ఇలా అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలు కచ్చితంగా సచివాలయాలను పరిశీలిస్తున్నారు.. కలెక్టర్, జేసీ నెలలో కనీసం రెండు, మిగతా అధికారులు నెలలో నాలుగు, మండల అధికారులు వారి పరిధిలోని అన్ని సచివాలయాలు తనిఖీలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎందుకంటే.. ఒక సచివాలయంలో అన్ని శాఖల ఉద్యోగులు పదిమంది వరకు ఉంటున్నారు.
మరోవైపు IVRS కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువ తీసుకున్నట్టు ఫీడ్‌బ్యాక్ వస్తే సదరు ఉద్యోగి వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేస్తున్నట్టు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో అందించే సేవలకు అదనపు రుసుము తీసుకున్నట్టు IVRS కాల్స్‌కు రియాక్ట్ అయి బటన్ నొక్కితే ఆర్‌టీజీఎస్ ద్వారా ఉన్నతాధికారులకు వారి నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు అదనపు రుసుము తీసుకున్న ఉద్యోగి వివరాలు వెళుతున్నాయి. ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వ్యక్తిని అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. అదనంగా డబ్బులు తీసుకోలేదని వాంగ్మూలం ఇచ్చినా ఉద్యోగుల వివరణ తీసుకోకుండా సస్పెండ్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదనపు రుసుము తీసుకున్నట్టు ఎందుకు IVRS కు తప్ప్పుడు సమాచారం ఇచ్చావని బటన్ నొక్కిన వ్యక్తిని అధికారులు ప్రశ్నిస్తే, డ్రైవింగ్‌లో ఉన్నప్ప్పుడు కాల్ వచ్చిందని ఒకరు. పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నారని, అందువల్లనే ఏదో ఒక బటన్ నొక్కుతున్నట్టు చెప్పేవారూ ఉన్నారు.
సచివాలయం ఉద్యోగులు విధుల్లో చేరి ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. సర్వీసు రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఆరేళ్లు పూర్తి చేసుకుంటే ఉద్యోగోన్నతి తప్పనిసరి చేయాలి, నోషనల్ ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలి. సచివాలయం ఉద్యోగుల విషయంలో ఈ రెండూ సంపూర్ణంగా జరగలేదు. సచివాలయం ఉద్యోగుల రేషనలైజేషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల మంది సర్‌ప్లస్ ఉన్నట్టు మొదట గుర్తించారు. ఇప్పటికే సచివాలయం ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ఎవరెవరు సచివాలయం నుంచి ఇతర శాఖల్లో పని చేయడానికి విల్లింగ్ ఇచ్చారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. మహిళా పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో 60 శాతం మంది ఐసీడీఎస్‌లో పని చేయడానికి, సర్వేయర్లలో 20 శాతం మంది రెవెన్యూ శాఖలో పని చేయడానికి.. ఇలా అందరు ఉద్యోగులు విల్లింగ్ ఇచ్చారు. విల్లింగ్ ఇచ్చిన సర్‌ప్లస్ ఉద్యోగుల్లో 10వేల మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇప్పటికిప్ప్పుడు భర్తీ చేస్తే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే.. మొన్న ఉగాదికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొంది. ఇప్ప్పుడు సగం మంది సచివాలయ సిబ్బంది వేర్వేరు శాఖలకు వెళ్లిపోతే, అక్కడ ఖాళీలు భర్తీ అయిపోతే, కొత్త నోటిఫికేషన్ మాట మర్చిపోవడమే. అందుకే ప్రభుత్వం వీరిని పొమ్మనలేక ఐవీఆరఎస్ ఫీడ్‌బ్యాక్, సచివాలయం మినహా అన్ని శాఖల అధికారుల ఆకస్మిక తనిఖీలు, ప్రమోషన్ లేకుండా ఉక్కిరిబిక్కిరి చేసి ఎవరికి వారే వదిలేసేటట్టు చేస్తుందన్నవారూ లేకపోలేదు.






Comments