వాస్తవికతను అద్దం పట్టే కథనాలు రావాలి: ఎస్పీ, జేసీ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ వెబ్ పేజీ (https://www.satyamdaily.net/)ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కలిసి ప్రారంభించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన తేనేటి విందు కార్యక్రమంలో ‘సత్యం’ వెబ్‌పేజీపై పబ్లిష్ బటన్‌ను కలెక్టర్ ప్రెస్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవికతకు అద్దం పట్టే కథనాలు రావాలని సూచించారు. సాంకేతిక దిశగా ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న తరుణంలో డిజిటల్‌గా పాఠకులకు సమాచారం అందించడానికి కృషి చేస్తున్న ‘సత్యం’ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సత్యం బ్యూరో ఇన్‌ఛార్జి బగాది నారాయణరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా 2005లో ప్రచురణ ప్రారంభించిన ‘సత్యం’ పత్రిక 19 ఏళ్లు పూర్తి చేసుకొని 20వ యేట అడుగుపెట్టిన శుభసందర్భంగా ‘సత్యం’ వెబ్‌పేజీని డిజిటల్‌గా తీసుకువచ్చినట్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఎడిటర్ ఎన్‌వీఎస్ ప్రసాద్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సత్యం పత్రికను ఈ స్థాయిలో నిలబెట్టారని వివరించారు. సత్యం పత్రిక ఇంత ఆదరణ పొందడానికి పాఠకులు, చందాదారులు, ప్రకటనకర్తల ఆదరాభిమానాలేని వివరించారు. వీరి స్ఫూర్తితోనే డిజటల్ వేదికపై ‘సత్యం’ పత్రికను ఆవిష్కరించగలిగామన్నారు. 13 మంది సిబ్బందితో నిత్యం పాఠకులకు వార్తల్లో కొత్తదనాన్ని అందించడానికి ‘సత్యం’ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుల సూచనలు, సలహాలు, వారిచ్చే ప్రోత్సాహంతో పాఠకుల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక కథనాలు, తాజా వార్తలు అందించగలుగుతూ ‘సత్యం’ ద్వారా మరింత చేరువ కాగలగుతున్నామని వివరించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ‘సత్యం’ వెబ్‌పేజీ ద్వారా ప్రతీ రోజు డిజిటల్ పాఠకులకు సమగ్ర సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యం వెబ్ పేజీని తయారు చేసిన ఐటీ విద్యార్ధులు రతన్, సాయిరాజ్ నైపుణ్యాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు. ‘సత్యం’ వెబ్‌పేజీ ఆవిష్కరణ కార్యక్రమంలో డీపీఆర్‌వో బాలమాన్ సింగ్, సీనియర్ జర్నలిస్టులు శాసపు జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాలరావు, సీపాన రమేష్, ఎండీయూ ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments