సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
- DV RAMANA

- Feb 11
- 2 min read
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు
మధ్యాహ్నం మహా అన్నసమారాధన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అలా ఉత్సవాలు నిర్వహించే క్షేత్రాల్లో ప్రముఖమైనది పార్వతీపురం మన్యం జిల్లా (ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా) పాలకొండలో వెలసిన అవధూత సనారీ విశ్వేశ్వర, అన్నపూర్ణమాంబల మఠం. స్థానిక కోమటి వీధిలో ఉన్న ఈ మఠంలో ప్రతి ఏటా శివరాత్రి పర్వదినంనాటు ఉత్సవాలు నిర్వహించడం దశాబ్దాల తరబడి ఆనవాయితీగా ఉంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలో తెనాలి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాల్లో తరలివస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఉత్సవాల్లో పాల్గొని మరుసటిరోజు తిరిగి వెళ్లడం సంప్రదాయంగా ఉంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా శివరాత్రి ఉత్సవాల నిర్వహణకు మఠం అభివద్ధి కమిటీ సన్నాహాలు చేస్తోంది.
క్షేత్ర ప్రాశస్త్యం
పాలకొండ కోమటి వీధిలో సింహాద్రి వారి ఇంట జన్మించిన విశ్వనాథులవారే సనారీ విశ్వేశ్వరస్వామి అవధూతగా మారారు. ఆయన్ను సాక్షాత్తు కాశీవిశ్వనాథుడి అవతారంగా భావిస్తారు. చిన్నతనంలోనే ఐహిక సుఖాలను వీడి ఆధ్యాత్మిక లోకంలో విహరించడం ప్రారంభించిన విశ్వేశ్వర స్వాములవారు కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేర్కొన్నట్లే పాలకొండలో జన్మించి ప్రజలను ఆధ్యాత్మికత వైపు మళ్లించారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూనే తన మహిమలను చూపడం ప్రారంభించారు. దాంతో ప్రజలు కూడా ఆయన్ను దైవస్వరూపంగా భావించి పూజలు చేయసాగారు. క్రమంగా ఆయన ప్రభ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. మరోవైపు ఇతర అన్ని ప్రాంతాలకు తన బోధనలు చేరి, ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెరగాలన్న లక్ష్యంతో సనారీ విశ్వనాథులవారు రాష్ట్ర సంచారం చేపట్టారు. అనేక ప్రాంతాలు పర్యటిస్తూ మద్రాసు(నేటి చెన్నై) వరకు వెళ్లారు. చివరికి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం చేరి భ్రమరాంబ మల్లికార్జునుల క్షేత్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గుహలో సజీవ సమాధి పొందారని ప్రతీతి. కాగా ఆయన సతీమణి మాతా అన్నపూర్ణమాంబ పాలకొండలోని స్వగహంలోనే సమాధి అయ్యారు. అప్పటినుంచీ అదొక పవిత్ర స్థలం, క్షేత్రంగా మారింది. విశ్వబ్రాహ్మణులు అక్కడ చిన్న ఆలయం నిర్మించి నిత్య పూజాదికాలు చేస్తుంటారు. గతంలో ఈ క్షేత్రం తెనాలి వారి ఆధీనంలో ఉండేది. వారు ఏడాదికోసారి శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెళ్లడం తప్ప పెద్దగా అభివద్ధి చేసింది లేదు. దాంతో స్థానికులు పూనుకుని ఆలయ అభవద్ధికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి తలెత్తిన విభేదాలను పరిష్కరించుకుని గత ఐదారేళ్లుగా సనారీ మఠం అభివద్ధికి విశేష కషి చేస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు
ఏటా శివరాత్రి పర్వదినాన ఈ మఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ ఏడాది శివరాత్రి నాడు భారీ అన్నసమారాధన నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి పంచామతాభిషేకాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మహానైవేద్యం సమర్పించి, ఒంటిగంట నుంచి మహా అన్నసమారాధన చేపడతారు. మధ్యాహ్నం రెండు గంటలకు అన్నపూర్ణమాంబ అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. రాత్రి సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయని మఠం అభివద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.






Comments