top of page

సమగ్రశిక్ష.. ఇదేందబ్బా!

Writer: NVS PRASADNVS PRASAD
  • ముందుగా ఉద్యోగం ` ఆ తర్వాతే మెరిట్‌

  • వెయిటేజ్‌, ఎక్స్‌పీరియన్స్‌ నై జాంతా

  • గతంలో ఆగినచోటే మొదలెట్టిన వైనం

  • శనివారం తెరపైకి కొత్త ఆదేశాలు

  • పాదర్శకతకు పాతర

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పోలీస్‌ ఎస్‌ఐ ఉద్యోగం ముందు ఇచ్చేసి, ఆ తర్వాత తీరిగ్గా రాతపరీక్ష నిర్వహించి, ఆ వెనుక ఫిజికల్‌ టెస్ట్‌ పెట్టి, ఉద్యోగం వచ్చిన తర్వాత డిగ్రీ పూర్తిచేసే వెసులుబాటు ఇస్తే.. ఎలా ఉంటుంది? జిల్లాలో సర్వశిక్ష ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న పోస్టులకు ఇప్పుడు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. తమకు కావాల్సినవారి జాబితాను ముందుగా సిద్ధం చేసి, వారి కోసం నిబంధనలు మార్చి, వారికి మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి ఉద్యోగాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

సమగ్ర శిక్షలో ఏ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చినా దానికి ఏదో శాపం ఉన్నట్టు కనిపిస్తుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది ఆగస్టులో పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఏ తప్పులు చేశారో, ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా అవే తప్పులు చేశారు. గతంలో భర్తీ కాకుండా ఉండిపోయిన పోస్టులను నింపాలని నోటిఫికేషన్‌ ఇచ్చి రోజుకో ఆదేశాలు, పూటకో ఉత్తర్వులతో గందరగోళం చేసిపారేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ముందుగా అభ్యర్థులను నిర్ణయించుకొని, వారికి ఉద్యోగాలివ్వడం కోసం రోజుకో కొత్త నిబంధన, పాత నిబంధనల సడలింపు చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా కేవలం తాము అనుకున్నవారిని పిలిపించి సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తులు తీసుకోవడం, రుసుము కట్టించుకోవడం, రోస్టర్‌ పాయింట్లు విడుదల చేయడం, వెయిటేజీ మార్కులు ఇవ్వడం.. ఇవన్నీ వట్టి బూటకం. కేవలం కూటమి నాయకులు చెప్పిన కొద్ది మందికి ఉద్యోగాలివ్వడం కోసం సర్వశిక్ష అధికారులు మొత్తం ఆడుతున్న నాటకం. వివరాల్లోకి వెళితే..

జిల్లా సర్వశిక్షలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ కోసం గత నెల 22న నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీని ప్రకారం 16 పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు, 3 పీజీటీ, 16 సీఆర్‌టీ ఉద్యోగాల భర్తీ జరపాల్సి ఉంది. అలాగే నాన్‌ టీచింగ్‌లో 3 వార్డెన్‌ పోస్టులు, 3 అకౌంటెంట్‌ పోస్టులు భర్తీ చేయాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 12 వరకు సమయమిచ్చారు. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అన్నీ నిబంధనల మేరకే చేశామని చెప్పుకోవడం కోసం మెరిట్‌ జాబితాను విడుదల చేశారు. కానీ ఇందులో అన్నీ గందరగోళాలే. ఒకే కుల రిజర్వేషన్‌, ఒకే ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న ఏ ఇద్దరికీ ఒకేమాదిరిగా వెయిటేజీ మార్కులు ఇవ్వలేదు. పోనీ వెయిటేజీ మార్కుల ప్రకారం ఓవరాల్‌గా వచ్చిన పర్సంటేజీ ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారా అంటే.. అదీ లేదు. 60.28 శాతం ఉన్నవారిని పక్కకు పెట్టి 55, 40 పాయింట్లు ఉన్నవారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచారు. ఒక సందర్భంలో నాన్‌ టీచింగ్‌ పోస్టులకు 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తున్నామని, టీచింగ్‌ స్టాఫ్‌కు 1:20 నిష్పత్తిలో గుర్తించామని మొదట్లో చెప్పుకొచ్చారు. కానీ ఆ ప్రకారం శుక్రవారం, శనివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగలేదు. దీని మీద కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తే, వారి సందేహాలు నివృత్తి చేయడానికి ఆదివారం గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అందులో దరఖాస్తుదారులు అడిగిన ఏ ప్రశ్నలకూ సర్వశిక్ష ఉద్యోగుల వద్ద జవాబు లేకుండాపోయింది. వాస్తవానికి ఓపెన్‌ కేటగిరీలో పోస్టులు తీస్తున్నామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానీ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ దగ్గరకొచ్చేసరికి ఎస్సీ రిజర్వుడు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు చెబుతున్నారు. శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దాదాపు 700 మంది హాజరయ్యారు. ఇందులో 386 మందిని లోపలికి పిలిచారు. శనివారం నాటికి సీన్‌ మారిపోయింది. గడిచిన ప్రభుత్వ హయాంలో ఏ కేటగిరీ వరకు ఉద్యోగాలు తీసి నిలిపేశారో, ఆ మిగిలిన రోస్టర్‌కు ఉద్యోగాలివ్వాలని సర్వశిక్ష స్టేట్‌ జీసీడీవో ఆదేశాలిచ్చినట్లు ఓ కాగితం చూపించి, కేవలం ఎస్సీ రిజర్వేషన్‌కు మాత్రమే భర్తీ చేస్తున్నామని మిగిలినవారిని వెనక్కు పంపించేశారు. వాస్తవానికి కొత్త నోటిఫికేషన్‌లో ఆ విషయం పేర్కొనలేదు. దీంతో చాలామంది దరఖాస్తు ఫీజు చెల్లించి మరీ అప్లై చేశారు. సోషల్‌ సీఆర్‌టీ పోస్టు జనరల్‌ కేటగిరీ అని పేర్కొనడంలో అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది ఎస్సీ రిజర్వేషన్‌కు వెళ్తుందని చెబుతున్నారు. ఏ నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలిచారో సర్వశిక్ష అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మెరిట్‌ జాబితా ప్రకారం 1:20లో ఉన్నవారు తమకు ఇంకా పిలుపు రాలేదని చూస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్టులు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారి జాబితా ముందే ప్రిపేరయిపోయిందని, ఆ మేరకు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

Kommentarer


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page