top of page

సమయం కోరింది సర్దుబాటుకేనా?!

Writer: ADMINADMIN


  • చంద్రబాబుతో చర్చలపై గుండ వర్గం ఆశలు

  • మార్చే ఉద్దేశమే ఉంటే చూచాయగానైనా చెప్పేవారు

  • ఇక్కడ మారిస్తే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టే

  • తెలుగు సీరియల్‌ మాదిరిగా సాగుతున్న టికెట్‌ ఎపిసోడ్‌

తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించిన దగ్గర్నుంచి జీడిపాకం తెలుగు సీరియల్‌లా సాగుతున్న సీనియర్ల పోరాటం కార్తీకదీపంలా అర్థాంతరంగా ముగిసిందా? లేదంటే మొగలిరేకుల్లా సశేషం అయిందా? అనే ప్రశ్నకు టీడీపీ వర్గాల నుంచి సమాధానం లభించడంలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణం బట్టి చూస్తే ఈ కథకు.. ఈ సాగదీత ధోరణికి ఫుల్‌స్టాప్‌ పడినట్టేనని భావించాల్సి ఉందా? అంటే.. సీనియర్‌ విశ్లేషకులు అవుననే సమాధానమిస్తున్నారు. శ్రీకాకుళంలో గొండు శంకర్‌కు టికెటివ్వడాన్ని ఏమాత్రం తట్టుకోలేని గుండ అప్పలసూర్యనారాయణ సతీసమేతంగా సోమవారం సాయంత్రం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. 15 నిమిషాల అపాయింట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ గంటన్నర పాటు సుదీర్ఘంగా బాబు మాట్లాడారని స్వయంగా అప్పలసూర్యనారాయణకు చెందిన సోషల్‌ మీడియానే సోమవారం సాయంత్రం ప్రకటించింది. రెండు రోజుల్లో సమాచారమిస్తానని చంద్రబాబు చెప్పారని అందులో పేర్కొన్నారు. లక్ష్మీదేవికే టికెటిచ్చే ఉద్దేశంతోనే చంద్రబాబు రెండు రోజులు సమయం చెప్పారని, ఈ గ్యాప్‌లో గొండు శంకర్‌ను పిలిచి చెబుతారని గుండ వర్గం భావిస్తోంది. కానీ లోతుగా ఆలోచిస్తే రాష్ట్రంలో ఇటువంటి 15 స్థానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక లక్ష్మీదేవికో లేక కలమట వెంకటరమణకో క్యాడర్‌ బలం ఉందని బాబు భావిస్తే వీరితో పాటు మరో 15 మందిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే.. వారు కూడా గత ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా పని చేసినవారే. ఇక్కడ లక్ష్మీదేవి ఏం చేశారో, అక్కడ వారూ అదే చేశారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు అభ్యర్థుల మార్పు అనే గందరగోళానికి తెరతీస్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ గుండ వర్గం మాత్రం రాష్ట్రంలో ఐదుచోట్ల కచ్చితంగా అభ్యర్థులు మారతారని, లేకుంటే వాటి పరిధిలోని ఎంపీ అభ్యర్థుల గెలుపోటముల మీద అది ప్రభావితం చూపిస్తుందన్న భావనతో ఉన్నారు. రాష్ట్రంలో సీట్లు దక్కని అసంతృప్తులను ఎక్కడికక్కడ జిల్లా టీడీపీ నాయకులు ముందుగా బుజ్జగించారు. ఆ తర్వాత పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జీలు వచ్చి నచ్చజెప్పారు. అక్కడితో ఈ కథకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే అంటూ అసంతృప్తులను బుజ్జగించడానికి బాబు చేసిన వ్యూహాత్మక తప్పిదం అసంతృప్తి ఇంకా కొనసాగేలా చేసింది. భావోద్వేగాలతో కూడిన అసంతృప్తి ఉన్నప్పుడు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తే అన్యాయం జరిగిందంటూ శిబిరాలు నడుపుతున్నవారికి అనుకూలంగానే ఓటింగ్‌ ఉంటుంది. అలా అని ఇప్పుడు దాన్ని పట్టుకొని టికెట్లు మార్చాలంటే రాష్ట్రంలో టీడీపీకి, జనసేనలను కలిపి 63 చోట్ల అభ్యర్థులను మార్చాలి. అది జరిగే పనా? అంటే కచ్చితంగా కాదు. టికెట్లు ప్రకటించడానికి ముందు దఫదఫాలుగా చంద్రబాబు చేయించిన సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు ఇచ్చినవారినే బలపరిచే విధంగా అసంతృప్తులతో పని చేయించాలి గానీ, ఇప్పుడు కొత్త సర్వేల పేరుతో వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించడం వల్ల అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. వాస్తవానికి గుండ లక్ష్మీదేవికి టికెట్‌ ఇవ్వలేనప్పుడు చంద్రబాబునాయుడు, లోకేష్‌లలో ఎవరో ఒకరు అప్పలసూర్యనారాయణతో మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వల్లే తన కుటుంబానికి నష్టం జరిగిందని గుండ భావిస్తున్నందున జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నచ్చజెప్పారు. అయితే తాను ఆయన కంటే సీనియర్‌ కాబట్టి చంద్రబాబే చెప్పాలని అప్పలసూర్యనారాయణ చెప్పడంలో తప్పు లేదు.

అనవసరంగా ఆశలు రేపినట్లే

దీన్ని మరింత కాంప్లికేట్‌ చేసే విధంగా మీ చిన్న కుమారుడ్ని పట్టుకొని రండి, హైదరాబాద్‌లో మాట్లాడుకుందామని కబురు పెట్టడం గుండ వర్గంలో మరింత ఆశలు రేపింది. తన రీసెర్చ్‌ వర్క్‌తో బిజీగా ఉన్న గుండ విశ్వనాథ్‌ను ఆగమేఘాల మీద విశాఖపట్నం రప్పించి, అక్కడ్నుంచి హైదరాబాద్‌ పట్టుకెళ్లి మరీ బాబుతో భేటీ చేయించారు. కానీ విశ్వనాథ్‌ వచ్చారు కాబట్టి ఇక ఆయనకే ఖరారు చేస్తానని బాబు చెప్పనప్పుడు ఆయన్ను తీసుకురమ్మనమనడం ఎందుకు? అప్పలసూర్యనారాయణ కూడా లక్ష్మీదేవికే టికెట్‌ కావాలని బలంగా చెప్పకుండా ఒకవేళ తమ కుటుంబానికి ఇవ్వడం ఇష్టం లేకపోతే నాగావళి కృష్ణ, కొర్ను నాగార్జున ప్రతాప్‌లలో ఒకరికి ఇవ్వాలని కోరడం నిజంగా ఆయన అమాయకత్వం. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నాగావళి కృష్ణ, కొర్ను ప్రతాప్‌ల పేర్లతో కూడా జరిగినా గెలుపునకు కావాల్సిన పర్సంటేజ్‌ రాకపోవడం వల్లే లక్ష్మీదేవి, గొండు శంకర్‌ మధ్య తుది సర్వే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఐవీఆర్‌ఎస్‌లో లేనివారిద్దరిలో ఎవరో ఒకరికి టికెటివ్వాలని అప్పలసూర్యనారాయణ చెప్పడం దేనికి సంకేతం? శంకర్‌ అయితే ధర్మాన ప్రసాదరావు సునాయాసంగా గెలిచేస్తారని చెప్పుకొచ్చిన ఆయన నియోజకవర్గంలో అర్బన్‌ ఓటర్లు ఎక్కువగా ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. ఇటువంటి డేటాలేవీ లేకుండానే చంద్రబాబు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారంటే ఎవరూ నమ్మరు.

చల్లబర్చేందుకే సమయం కోరారా?

తమకు నామినేటెడ్‌ పదవులు వద్దని అప్పలసూర్యనారాయణ చంద్రబాబుకు ఖరాకండీగా చెప్పడంతో రెండు రోజుల తర్వాత నిర్ణయం చెప్తానని చంద్రబాబు చెప్పి ఉంటారు తప్ప మార్పులు, చేర్పులు ఉండే అవకాశం లేదని టీడీపీ రాజధాని వర్గాలు చెబుతున్నాయి. నాగావళి కృష్ణ, కొర్ను ప్రతాప్‌ల పేర్లను అప్పలసూర్యనారాయణ సూచించినప్పుడు వారిద్దరూ వచ్చారా? అని చంద్రబాబు అడిగి ప్రతాప్‌ రాకపోవడంతో నాగావళి కృష్ణను పిలిచి పోటీకి ఆయన సన్నద్ధత గురించి అడిగారట. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక ఉన్నా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లి గెలవలేనని, లక్ష్మీదేవికే టికెటిస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారట. ఇక నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ ఎలాగూ లక్ష్మీదేవికే ఇవ్వాలని చెబుతారు. అది సహజం. గొండు శంకర్‌ను కొనసాగిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని గుండ దంపతులు చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టడంతో భావోద్వేగంతో ఉన్న వారిద్దరికీ అభ్యర్థిని మార్చలేమని అప్పటికప్పుడు చెప్పలేకే రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని చంద్రబాబు చెప్పి ఉండవచ్చు. ఈలోగా పార్టీ నాయకులు అప్పలసూర్యనారాయణ వర్గంతో మాట్లాడి కంబైండ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టిస్తారు. పార్టీ లైన్‌ దాటడం తనకు ఇష్టం లేదని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడటమే తన లక్ష్యమని అప్పలసూర్యనారాయణతో చెప్పించినా ఆశ్చర్యం లేదు. గుండ కుటుంబానికి ఇచ్చిన రెండు రోజుల సమయంలో పార్టీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ఒక కామన్‌ సర్క్యులర్‌ జారీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు భోగట్టా. అభ్యర్థుల ఖరారు పూర్తయిందని, స్థానికంగా ఉన్న సీనియర్లంతా ప్రచారానికి దిగాలని సూచించడమే దాని సారాంశంగా ఉండనున్నట్లు భోగట్టా.

 
 
 

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page