top of page

సమరయోధుల్ని కించపర్చొద్దు!

Writer: DV RAMANADV RAMANA

1947లో భారతదేశానికి వచ్చింది రాజకీయ స్వాతంత్య్రమేనని, అయోధ్య రామమందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్రోద్యమం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలు వాళ్ల మద్దతుదారులు తరచూ చేసే తప్పుడు వ్యాఖ్యానాల మీద మన ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటి వరకూ చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బహుశా మన స్వాతంత్య్రోదమ వీరులు ఇలాంటి పరిణామాలను ఊహించి కూడా ఉండరు. అయోధ్య రామ మందిరంలో విగ్రహా విష్కరణ జరిగిన రోజునే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందన్న మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ దేశం కూడా తన సొంత స్వాతంత్య్ర ఉద్యమాన్ని, భవిష్యత్‌ తరాల కోసం తమ ప్రాణాలనే పణంగా అర్పించిన జాతి నిర్మాతలను ఈ రకంగా కించపరచుకోవదు. అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందనే బోగస్‌ వాదన అశాస్త్రీయ మత భావోద్వేగాలను రెచ్చగొట్టడం నుంచి పుట్టుకువచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలు కూడా ఇస్లాం ఛాందసవాదులు, ఫాసిస్టు శక్తుల మాదిరే ఒంటెద్దువాదం, మత ఛాందస భావజాలానికి మించి ఎదగలేకపోయాయి. దేశభక్తి, జాతీయతల గురించి చర్చించేటప్పుడు కూడా వాళ్ల వాదనలలో రాజ్యాంగ సూత్రాలైన సమానత్వ, సహోదరత్వ భావాల పట్ల విశ్వాసలేమితో నిండివుంటాయి. దేశ భక్తి, జాతీయతలు ఎన్నటికీ మత సంబంధిత విలువలు కాదన్న వాస్తవాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నటికీ అర్ధం చేసుకోజాలదు. కాసేపు 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదనే అనుకుందాం. రాముడికి గుడి కట్టించేస్తే దేశానికి సార్వభౌమాధికారం లభించినట్లు సంబరం చేసుకోవచ్చా? ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో వలస పాలన అంతం కావడమా లేక గుడి నిర్మాణమా ఏది అసలైన స్వాతంత్య్ర విధానానికి తార్కాణం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు భారత స్వాతంత్య్రోద్యమాన్ని, దేశ భవిష్య నిర్మాణం కోసం తమ అశువులు తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్య్రోద్యమ వీరులని ఎంతలా అవమానిస్తున్నాయో తేటతెల్లం అవుతుంది. రామమందిరం నిర్మించిన మోడీ కన్నా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఏళ్ల తరబడి కారాగారవాస శిక్ష అనుభవించిన దేశభక్తుల ఆత్మనిర్భరత ఏ రకంగా తక్కువ అవుతుంది? దేశంలోని ప్రతి భారతీయుడు స్వాతం త్య్రోద్యమ ఘన వారసత్వానికి వారసుడే. భగత్‌సింగ్‌ నుంచి మహాత్మాగాంధీ వరకు మన స్వాతంత్య్ర ఉద్యమ పోరాట యోధులను ప్రతి పౌరుడూ గర్వకారణంగా భావించాల్సిన అవసరం ఉన్నది. స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో ఉన్న ఈ చైతన్యం మూలంగానే రాములోరికి గుడి లేకపోవడాన్ని లోటుగా ఏనాడూ భావించలేదు. నిజానికి దేశంలో వేలు, లక్షల సంఖ్యలో రామాలయాలు ఉన్నాయి. ఆ ఆరు దశాబ్దాల కాలంలో ప్రజల హక్కులు, సాధికారత, సమానత్వం, సమన్యాయం ఈ విలువలే స్వేచ్ఛా దేశానికి ప్రతీకగా నిలిచాయి. తప్ప మతాధిపత్యానికి, మత వివక్షకు ఏనాడు తావియ్యలేదు. పేదరికాన్ని నిర్మూలించాలి అనేది ప్రభుత్వాల ఉదాత్త లక్ష్యంగా నిలిచింది. తప్ప మందిరాన్ని నిర్మించాలి అన్నది ఏనాడూ లక్ష్యంగా లేదు. ఇప్పుడు కూడా మోడీ ముందు భారతీయుడిని అనాల్సి వచ్చిందే తప్ప ముందు హిందువని అనలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అన్న వ్యాఖ్యలపై బీజేపీ తన వైఖరి ఏమిటో స్పష్టం చెయ్యకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదు రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం అన్న వ్యాఖ్యలను పట్టుకుని యాగీ చెయ్యాలని చూస్తున్నాయి. మోడీ ప్రభుత్వం రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రజాస్వామిక సంస్థలను కబళించేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడం అంటే, అసమాన పోరాటమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏకపక్షంగా మారిన పోలీసు యంత్రాం గం, ఈడీ, సీబీఐ, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌, మీడియాలతో ప్రతిపక్ష పార్టీలు పోరాడవలసి వస్తుందని రాహుల్‌ గాంధీ లెక్కలేనన్ని సార్లు ప్రకటించారు. భారతదేశానికి, భారత రాజ్యాంగానికి మధ్య ఉన్న భేదాన్ని బీజేపీ కావాలనే విస్మరిస్తున్నది. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి నప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో బీజేపీ చేసిన పోరాటంగా భావిస్తుందా? రాజ్యాధికారానికి వ్యతి రేకంగా మారడడం ప్రజల ప్రాథమిక హక్కు దానికీ, దేశానికి సంబంధం లేదు. కానీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని, దేశ స్వాతంత్య్రాన్ని తులనాడడం మాత్రం కచ్చితంగా దేశద్రోహమే.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page