ఒకేసారి రెండు ఫీట్లు సాధించనున్న భారతీయ రైల్వే
ముంబై`అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు కారిడార్
అందులో భాగంగా ఏడు కి.మీ. సముద్రగర్భంలో ప్రయాణం
2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే లైన్‌ను జమ్మూకశ్మీర్‌లో నిర్మించి తన సత్తా చాటిన భారతీయ రైల్వే తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో ఎప్పటికప్పుడు సాంకేతికతలో కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. ఎప్పుడో 1854లో బ్రిటీష్ హయాంలో మన దేశంలో మొదటి రైలు కూతపెట్టింది. అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం దేశంలో తన వ్యాపార, సైనిక ప్రయోజనాల కోసమే పలు రైల్వేలైన్లు నిర్మించింది. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల సౌకర్యాల కల్పనే ధ్యేయంగా అనేక మార్పులు చేస్తోంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లు, వందేభారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టింది. అదే క్రమంలో బల్లెట్ రైళ్లను రంగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బుల్లెట్ రైలుతో పాటు ఆ ప్రాజెక్టులో భాగంగానే సముద్రగర్భ రైలుమార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే కృషి ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అతితక్కువ దేశాల్లోనే సముద్రగర్భ రైల్వేలైన్లు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే మనదేశంలోనూ సముద్రం గర్భంలో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
దేశంలో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలన్నది మన పాలకుల ప్రణాళిక. అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదన వాయిదాపడుతూనే వచ్చింది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావించడమే తప్ప ఇన్నాళ్లూ ఆచరణకు నోచుకోలేదు. కానీ ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవలి కాలంలో ఆధునికీకరణ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అత్యంత తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రాజధాని, శతాబ్ది, లాంగ్‌డ్రైవ్ రైళ్లతో పాటు వందే భారత్ రైళ్లు దూసుకొచ్చాయి. తర్వాత దశగా చిరకాల ప్రతిపాదన అయిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా పట్టాలకెక్కుతోంది. దీన్ని మొదటిగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నడపనున్నారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పనులు ఇదే స్పీడుతో జరిగితే మరో రెండేళ్లలో అంటే 2026 నాటికి మొదటి బల్లెట్ రైలు ఈ రెండు నగరాల మధ్య పరుగులు పెట్టనుంది. రెండు నగరాల మధ్య 508 కిలోమీటర్ల నిడివిన ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారిడార్ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా బల్లెట్ రైలును ట్రాక్‌లో పెట్టడంతో పాటు సముద్ర గర్భ రైల్వే వ్యవస్థను కూడా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తేనుంది.
ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే..
సముద్రగర్భ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనే అందుబాటులో ఉంది. వాటిలో ప్రముఖమైనది ఇంగ్లాండ్`ఫ్రాన్స్ దేశాలను కలుపుతూ నిర్మించిన యూరో టన్నెల్. జపాన్‌లో కొన్ని దీవులను కలుపుతూ సాగే షీకాన్ టన్నెల్, టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి ఐరోపాను కనెక్ట్ చేసే మర్మరే టన్నెల్, డెన్మార్క్, స్వీడన్‌లను కలిపే ఒరేసుండ్ టన్నెల్, దక్షిణ కొరియాలో పలు సిటీలను కలిపే టన్నెల్, చైనాలో మూడు ప్రధాన నగరాలను కలిపే టన్నెల్ రూపంలో మాత్రమే సముద్రగర్భ రైల్వేలైన్లు ఉన్నాయి. రెండేళ్లలో ఇండియా కూడా వాటి సరసన చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం భూమి మీదుగా కాకుండా అనేక పర్వత ప్రాంతాలు, సముద్రం గుండా సాగుతుంది. దానికి అనుగుణంగా పర్వతాలను తొలిచి అండర్ టన్నెల్స్ (సొరంగ మార్గాలు), అలాగే సముద్ర గర్భాన్ని చీల్చి ప్రత్యేక టన్నెల్స్ నిర్మిస్తున్నారు.
సముద్రం అడుగున 7 కి.మీ.
బుల్లెట్ రైల్ కారిడార్ మొత్తం నిడివి 508 కిలోమీటర్లు కాగా అందులో 27 కి.మీ. భూగర్భంలో నుంచి సాగుతుంది. మరో ఏడు కి.మీ. (థానే`విరార్ మధ్య) అరేబియా సముద్రంలో నుంచి వెళ్తుంది. వీటి కోసం అటు భూగర్భంలోనూ, ఇటు సముద్ర గర్భంలోనూ ప్రత్యేకంగా సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. సముద్ర బెడ్‌కు 25 నుంచి 65 మీటర్ల లోతులో టన్నెల్ నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నిర్మాణం అంత సులభం కాదు. దీనికోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సముద్రం అడుగున సొరంగం నిర్మాణానికి ఎండ్వాస్ యంత్రాలను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఘన్సోలీ, శిల్పాటా, విక్రోలి ప్రాంతాల్లో తవ్వకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మొదటి టన్నెల్ బోరింగ్ మెషిన్ పనులు ప్రారంభమవుతాయని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన కట్టర్ హెడ్ అమర్చిన బోరింగ్ మెషిన్‌ను దీనికి వినియోగిస్తారు. నిర్మాణంలో ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతి అనుసరిస్తున్నారు. దీని ప్రకారం డబుల్ లైన్‌తో సింగిల్ ట్యూబ్ టన్నెల్ నిర్మించనున్నారు. అంటే రెండు ట్రాక్‌లపై బుల్లెట్ రైళ్లు గంటకు సగటున 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి.
ఇప్పటికే నదీగర్భ మెట్రోరైలు
మొదటిసారి సముద్రగర్భ రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న భారత్‌లో ఇప్పటికే నదీగర్భ మెట్రో రైల్వే ఉంది. దాన్ని పశ్చిమ బెంగాల్లోని కోల్‌కతా మెట్రో రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఈస్ట్`వెస్ట్ మెట్రో కారిడార్‌గా పిలిచే ఈ ప్రాజెక్టు కోల్‌కతా నగరంతో హౌరా జిల్లాను అనుసంధానం చేస్తోంది. మొత్తం 16.6 కి.మీ. ఈ ప్రాజెక్టును మొదటి దశలో సాల్ట్ లేక్ సెక్టర్ 5 నుంచి సాల్ట్ లేక్ స్టేడియం వరకు 5.8 కి.మీ. మార్గాన్ని 2020లోనే ప్రారంభించారు. సాల్ట్ లేక్ స్టేడియం నుంచి ఫూల్‌బాగన్ నుంచి 1.6 కి.మీ. రెండో దశను గత ఏడాది ప్రారంభించారు. ఇక మూడో దశలో నిర్మించిన మెట్రో లైన్ హుగ్లీ నది గుండా సాగుతుంది. అయితే ఇది చాలా తక్కువ నిడివి మాత్రమే 570 మీటర్ల మేరకు హుగ్లీ నది బెడ్‌కు దిగువన సుమారు 30 మీటర్ల లోతులో సొరంగం నిర్మించి రైల్వేలైన్ వేశారు. ఈ మార్గంలో గత ఏడాది ట్రయల్ రన్ పూర్తి చేసిన అనంతరం ఈ ఏడాది మార్చి 15న వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించారు. అఫ్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నదీగర్బ టన్నల్ ప్రాజెక్టును నిర్మించింది. ఇప్పుడు ముంబై`అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో నిర్మిస్తున్న సముద్రగర్భ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే ఖ్యాతి ఇనుమడిస్తుంది.
Comments