top of page

సర్కారుపై సంతృప్తి సగమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 25
  • 2 min read

రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు రెండేళ్లు దాటింది. ఆ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు, సంబరాలను అట్టహాసంగా జరుపుకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తదితర అగ్రనేతలంతా ఈ ఉత్సవాలు, సభల్లో పాల్గొని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలు, అమలుచేస్తున్న ఎన్నికల హామీల గురించి భారీగా ప్రచారం చేసుకున్నారు. అయితే వారంతా ప్రచారం చేసుకున్నట్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తున్నదా? ప్రజలందరూ ప్రభుత్వంపైనా, ఎన్నికల హామీల అమలుపైనా సంతృప్తితో ఉన్నారా?? అన్నది క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే గానీ తెలియదు. బయటకైతే పెద్ద అసంతృప్తి ఉన్నట్లు కనిపించడంలేదు. రెండేళ్లు అంటే ఏ ప్రభుత్వానికైనా తన పనితీరును నిరూపించుకోవడానికి గణనీయమైన అవకాశమే.. దాదాపు సగం పాలనాకాలం పూర్తిచేసుకున్న ఈ రెండేళ్లలో ప్రజల సంతృప్తస్థాయి ఎలా ఉందని తెలుసుకునేందుకు పలు సంస్థలు జరిపిన సర్వేలో కూటమి ప్రభుత్వంపై అంతర్లీనంగా అసంతృప్తి రాజుకుంటున్నట్లు వెల్లడవుతున్నది. ఎన్నికల్లో కూటమి పార్టీలు 90 శాతానికిపైగా విజయాలు అందుకున్నాయి. అంటే ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుంటే.. ఇప్పటికీ అదేస్థాయిలో ప్రజామద్దతు లభించాలి. కానీ రెండేళ్లలోనే ప్రభుత్వం పట్ల ప్రజా సంతృప్తి లేదా మద్దతు గణనీయంగా పడిపోయి 59 శాతం(పదిలో 5.9 మార్కులు) మేరకే ఉన్నట్లు ప్రముఖ సర్వే సంస్థ ‘యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ’ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ మాత్రం పడిపోతున్నదని ఈ సర్వే వెల్లడించింది. అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలపై సంతృప్తి కనిపిస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇతర ముఖ్యమైన హామీల అమలు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆయా వర్గాల ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నది. నిరుద్యోగ భృతి, మహిళలకు జీవనభృతి, 50 ఏళ్లకే బీసీ మహిళలకు వృద్ధాప్య పెన్షన్ వంటి అంశాలు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతున్నట్లు వెల్లడైంది. యునికార్న్‌తోపాటు పలు ఇతర సర్వే సంస్థల పరిశీలనల ప్రకారం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పరిపాలనపరమైన లోపాలు, ఆర్థిక విధానాల్లో వైఫల్యాలు, రాజకీయ సమన్వయ లేమి, రాజధాని అమరావతికి అతి ప్రాధాన్యత వంటి లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పారిశ్రామికీకరణకు ప్రభుత్వం మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ సఫలమై వాటి ఫలాలు అందడానికి కొన్నేళ్లు పడుతుంది. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా కనిపించిన 80 శాతం ప్రజా సంతృప్తి కాగితాలకే పరిమితమైందని, డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్‌కు గత ఏడెనిమిదేళ్లుగా దాదాపు ఒకే రకమైన ఫిర్యాదులు అందుతుండటం అధికార వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతుంది. ఇక రాజకీయంగా మంత్రివర్గంలో సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ నాయకత్వంలో యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే వారు ఇప్పటికీ జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నారని అనేక సర్వేల్లో తేలుతున్నది. ముఖ్యమంత్రి చేయించిన అంతర్గత సర్వేల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు అక్కడికి వెళ్లినా కూడా స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని అనుసంధానించడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రాయలసీమకు చెందిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సవిత వంటి జూనియర్ మంత్రులు తమ జిల్లాý రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారు. ఫలితంగా రాయలసీమలో సామాజిక సమతుల్యత, రాజకీయ సమగ్రత లోపించిందని పలు విశ్లేషణల్లో తేలింది. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా అంతర్గతంగా తీవ్ర నష్టం జరుగుతోంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి వాడుకోవడంలో ప్రభుత్వం వెనుకబడింది. ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇప్పుడు కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటి పరిణామాలు కూటమి శ్రేణుల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. రిటైర్డ్ అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చి పెత్తనం అప్పగించం వల్ల ప్రమోషన్లు నిలిచిపోయి ప్రభుత్వ శాఖల్లో నైరాశ్యం అలుముకుందంటున్నారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల ఆధారంగా బండిని బాగానే లాగిస్తున్నప్పటికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, రాజకీయ వ్యవస్థలను బలోపేతం చేసుకోకపోతే ప్రజా సంతృప్త స్థాయి మరింత దిగజారి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమని యూనికార్న్ వంటి సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page