top of page

సరిగ్గా రెండేళ్లు.. అదే రోజు.. అదే ప్రాంతం

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • భూ వివాదంలో ఒకరి హత్య

  • భూమి కోసమే గతంలో రామశేషు బలి

  • శ్రీకూర్మంలో భూమి విలువలే కారణం


శ్రీకూర్మం సర్పంచ్‌ రామశేషు హత్య జరిగి డిసెంబర్‌ 6కి సరిగ్గా రెండేళ్లు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ హత్య రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఇప్పుడూ అటువంటి హత్యే అదే గ్రామంలో అదే రోజు జరిగింది. రామశేషు మృతిచెంది రెండేళ్లు పూర్తయిన రోజునే ప్రత్యర్ధులు దారి కాచి మారణాయుధాలతో ముగ్గురిపై దాడి చేశారు. దాడిలో రెడ్డికవీధికి చెందిన ఉప్పాడ రాజేష్‌(38) అలియాస్‌ ఉల్లిపాయల రాజేష్‌ ఇక్కడక్కడే మృతి చెందగా చుక్కా రాము, అతని భార్య సరోజిని తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ దాడిలో 11 మందిని అనుమానితులుగా గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని చింతవలసలోని 1.40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం కారణంగా దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమి వివాదంపై 2018లో క్రైం రిజిస్టర్‌ అయినట్టు తెలిసింది. మృతుడు రాజేష్‌ సమీప బంధువు ఉప్పాడ రాములమ్మకు వారసత్వంగా వచ్చిన ఈ భూమిని దక్కించుకోవడానికి గ్రామానికి చెందిన కొయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాములమ్మ శ్రీకూర్మం నుంచి బలివాడకు మకాం మార్చుకుంది. ఈ భూమి తమదేనని కొయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఉప్పాడ రాములమ్మకు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. దీంతో కింద కోర్టు తీర్పును హైకోర్టులో కొయ్య భాస్కరరావు వర్గీయులు అప్పీలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దిగువ కోర్టు తీర్పును అమలుచేయాలని తీర్పు వెలువరించింది. దీంతో కొయ్య భాస్కరరావు వర్గీయులు ఉప్పాడ రాములమ్మ నుంచి ఆ భూమిని సొంతం చేసుకోవాలని నిరంతరం ప్రయత్నాలు చేస్తునే వచ్చారు. రాములమ్మకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కొయ్య భాస్కరరావు వర్గీయులకు వ్యతిరేకంగా ఈ భూమిని ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

రాములమ్మ తన సమీప బంధువు శ్రీకూర్మంకు చెందిన ఉప్పాడ సూర్యనారాయణతో పాటు చుక్క రాము, అనపాన షన్ముఖరావుకు 1.40 ఎకరాల భూమిని ఈ ఏడాది మార్చిలో రిజిస్ట్రేషన్‌ చేసింది. ఈ ముగ్గురు కలిసి ఆ భూమిని రాములమ్మ నుంచి కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవహారం రుచించని కొయ్య భాస్కరరావు వర్గీయులు శుక్రవారం సాయంత్రం ముందుగా భూమి కొనుగోలు చేసినవారిలో ఒకరైన ఉప్పాడ సూర్యనారాయణపై దాడి చేయడానికి సమాయత్తమయ్యారు. విషయాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ వారి నుంచి తప్పించుకున్నాడు. కొయ్య భాస్కరరావు వర్గీయులు దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సూర్యనారాయణ సమీప బంధువు రాజేష్‌కు చెప్పినట్టు తెలిసింది. అయితే రాజేష్‌ తనపై దాడి చేయాల్సిన అవసరం కొయ్య భాస్కరరావు వర్గీయులకు ఏముందని సూర్యనారాయణతో అన్నట్టు తెలిసింది. ఈలోగా రాజేష్‌, చుక్కా రాము, అతని భార్య సరోజినిలపై కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రాజేష్‌ ఘటనా స్థలం వద్దనే మృతిచెందాడు. వాస్తవంగా భూవివాదంతో రాజేష్‌కు ఎటువంటి సంబంధం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే రాజేష్‌ అండదండలతోనే ఆ భూమిని కొనుగోలు చేశారని కొయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు భావించి దాడి చేసినట్టు తెలిసింది. రాములమ్మకు లీగల్‌ వ్యవహారంలో అన్నివిధాల సహకరించడం వల్ల రాజేష్‌పై కక్ష పెంచుకున్నట్టు గ్రామంలో చర్చ సాగుతుంది.

పేకాట నిర్వాహకులతో సంబంధం

జిల్లా సరిహద్దులో ఉన్న ఒడిశా పరిధి గారబందలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న ఆమదాలవలస తోటాడకు చెందిన బెండి తులసీ, అక్కివరానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి తాండ్ర తేజేశ్వరరావు, శ్రీకాకుళం నగరానికి చెందిన గోపీకృష్ణ(గోపి)తో రాజేష్‌కు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురితో పాటు రాజేష్‌కు పేకాట శిబిరాల్లో వాటాలున్నాయి. తులసీ, తేజా, గోపితో పాటు ఈ పేకాట శిబిరం నిర్వహించడానికి రాజేష్‌ 20 పైసలు వాటా పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీకూర్మం ప్రాంతంలో తరుచూ పేకాట, పిక్కాట నిర్వహించే రాజేష్‌కు స్థానిక పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో ఆపేయాల్సి వచ్చింది. దీంతో బెండి తులసీ, తాండ్ర తేజా, గోపీతో జతకట్టడం ప్రారంభించాడు. వారితో కలిసి ఒడిశా బాటపట్టాడు. శుక్రవారం పేకాట శిబిరానికి తులసీ, తేజతో కలిసి వెళ్లివుంటే దాడి నుంచి రాజేష్‌ తప్పించుకునేవాడని వారే చెబుతున్నారట. ప్రతి రోజు ఉదయం శ్రీకాకుళం పెద్దమార్కెట్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ మధ్యాహ్నం పేకాట శిబిరాలు, జాతర్లలో పిక్కాట నిర్వహిస్తుంటాడు. వేసవి కాలంలో కొన్నాళ్లు పెద్దపాడు ఫ్లైవోవర్‌ వద్ద చెరుకు రసం విక్రయించాడు. భూ వ్యవహారంతో సంబంధం లేకపోయినా రాజేష్‌ హతం కావడంతో గ్రామంలో సర్వత్రా చర్చ ప్రారంభమైంది.

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page