top of page

సరిదిద్దుకో.. లేదంటే సస్పెండ్‌ చేస్తా!

Writer: NVS PRASADNVS PRASAD
  • దువ్వాడ వ్యవహారంపై జగన సీరియస్‌

  • వచ్చే ఎన్నికల్లో పేరాడ పోటీ చేస్తారని ప్రకటన

  • కాపులకు ప్రాధాన్యత లేకే ఓడిపోయామన్న రెడ్డి శాంతి

  • ధర్మాన కోసం ఆరా తీసిన పార్టీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వ్యవహారం రచ్చకెక్కడంతో జిల్లాలో పార్టీ పరువు కూడా బజారుకెక్కిందని, డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయకపోతే కష్టమని వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నేరుగా దువ్వాడ శ్రీనివాస్‌ ముందే ఫిర్యాదు చేశారు. గురువారం జగన్మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమీక్షలో ఎన్నడూ లేనివిధంగా రెడ్డి శాంతి ఎటువంటి బెదురూ లేకుండా మాట్లాడారు. ఇంట గెలవకుండా రచ్చ గెలవడం కుదరదని, దువ్వాడ శ్రీనివాస్‌ భార్యతో ఉన్న గొడవలు ఇప్పుడు 45 రోజులుగా జిల్లాలో వైకాపా పరువురు బజారుకీడ్చాయని, మధ్యలో మరో మహిళ కూడా చేరి పార్టీని రచ్చకీడుస్తున్నారని, ప్రజలకు ఏం సమాధానాలు చెప్పాలో తమకు తెలియడంలేదని, మీరు మాత్రం శ్రీనుతో చక్కగానే మాట్లాడుతున్నారని రెడ్డి శాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమెతో టెక్కలి వైకాపా ఇన్‌ఛార్జి పేరాడ తిలక్‌ కూడా శృతికలిపారు. దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు సహజీవనం చేస్తున్నానని, ఒకే ఇంటిలో ఉంటున్నామని మీడియాకు చెప్పుకొచ్చిన దివ్వెల మాధురి టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తనను నియమించడం ఆమె పెట్టిన భిక్షగా ప్రకటించారని, కావాలంటే ఆమె టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను చూడాలంటూ పేరాడ తిలక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తూ ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్‌ పెట్టకపోతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని దువ్వాడ శ్రీనుకు వార్నింగ్‌ ఇచ్చినట్టు భోగట్టా. 2029లో పేరాడ తిలక్‌ టెక్కలి అసెంబ్లీకి పోటీ చేస్తారని, దువ్వాడ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవసరం ఉండదని జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో చెప్పినట్టు భోగట్టా. పేరాడ తిలక్‌ లాంటి అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆయన్ను గెలిపించుకొని వస్తే ఎమ్మెల్సీ పదవి కోసం మాట్లాడదామని, ఇదే వ్యవహారం ఇంకా కొనసాగితే సస్పెండ్‌ చేయక తప్పదని జగన్మోహన్‌రెడ్డి దువ్వాడకు ముఖం మీద చెప్పినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం జరుగుతున్నప్పుడు దువ్వాడ శ్రీను అక్కడే ఉన్నారు. జిల్లా వైకాపా పరిస్థితిపై రెడ్డి శాంతి గుక్క తిప్పుకోకుండా మాట్లాడారని తెలుస్తుంది.

కాపులకు ప్రాధాన్యమివ్వాలి

జిల్లాలో కాళింగులు, వెలమలకు ఏమాత్రం తీసిపోని సంఖ్యలో తూర్పుకాపులు ఉన్నారని, వైకాపాలో మాత్రం మొదటి రెండు కులాలకు ప్రాధాన్యత దక్కిందన్న భావన జిల్లా తూర్పుకాపుల్లో ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, వైకాపా అధికారంలో ఉన్నా కాళింగులకు, వెలమలకు పెద్ద పదవులు దక్కుతున్నాయంటూ ఆమె ధర్మాన కృష్ణదాస్‌, ధర్మాన ప్రసాదరావులకు మంత్రి పదవులు, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీ, స్పీకర్‌ వంటి పోస్టులను ఉదహరించారట. టీడీపీ అధికారంలో ఉన్నా అదే జరుగుతుందని, వైకాపా అయినా తూర్పుకాపులను గుర్తిస్తే భవిష్యత్తులో ఓటు పోలరైజ్‌ అవుతుందని జగన్మోహన్‌రెడ్డికి చెప్పినట్టు భోగట్టా. అన్నింటికీ మించి జిల్లాలో కింజరాపు, ధర్మాన కుటుంబాలు ఒక్కటేనన్న టాక్‌ బలంగా నాటుకుపోయిందని, అందుకు తగ్గట్టుగానే గడిచిన ఐదేళ్లలో వైకాపా నడుచుకోవడాన్ని జిల్లా ప్రజలు గడిచిన ఎన్నికల్లో సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్‌ చేశారని రెడ్డి శాంతి పేర్కొన్నారని తెలుస్తుంది. జిల్లాలో కింజరాపు హవాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని, గడిచిన ఐదేళ్లలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌ ఎవర్నీ నొప్పించకుండా అందర్నీ కలుపుకొని వెళ్లినా కింజరాపు కుటుంబాలకు వ్యతిరేకంగా బలాన్ని కూడబెట్టలేకపోయామన్నారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ రానున్న కాలంలో మరింత అగ్రెసివ్‌గా పని చేయాలని, ప్రతిపక్షంలో పార్టీని నడపాలంటే ఖర్చులుంటాయి కాబట్టి దాని కోసం వెనుకాడకూడదని, ప్రతీ అంశంపైన స్థానికంగా అధికార పక్ష తీరును ఎండగట్టాలని ఆదేశాలిచ్చినట్టు భోగట్టా.

తమ్ముడేడీ?

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా వైకాపా నాయకులతో సమావేశానికి ప్రారంభంలోనే ధర్మాన కృష్ణదాస్‌ను చూసిన జగన్మోహన్‌రెడ్డి తమ్ముడేడీ అంటూ ప్రశ్నించారు. దీనిపై జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ కల్పించుకుంటూ ధర్మాన ప్రసాదరావుకు ఆరోగ్యం ఈమధ్య కాలంలో సరిగ్గా ఉండటంలేదని, అందుకే రాలేకపోయారని చెప్పుకొచ్చారు. వెంటనే కృష్ణదాస్‌ కూడా ధర్మాన అనారోగ్యంగా ఉన్నారని, త్వరలోనే కలుస్తారని జగన్మోహన్‌రెడ్డికి చెప్పారు.

ఎంపీకి రెడీగా ఉండన్న!

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం ఎంపీగా రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన్ను నియమించారు. ఆమదాలవలస నియోజకవర్గం కావాలని అడగవద్దని, అందుకోసం చింతాడ రవి ఉన్నారని, లేదూ అంటే మరికొన్ని పేర్లు సూచించినా తప్పు లేదు కానీ, ఆమదాలవలస అసెంబ్లీకే పోటీ చేస్తానని ఒత్తిడి తేవద్దని జగన్మోహన్‌రెడ్డి సీతారాంకు చెప్పినట్లు భోగట్టా.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page