top of page

సర్వమత హితైషి.. సర్వేపల్లి

Writer: ADMINADMIN
  • విద్యావేత్తే కాదు రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త

  • ప్రపంచ గురువుగా ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తం

  • జీవన తత్వాన్ని బోధించిన మహనీయుడు

  • ఆయన్ను సర్మించుకోవడమే గురుపూజోత్సవ లక్ష్యం


ఆయన అధ్యాపకుడు, తత్వవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, సర్వమతాల సారాన్ని ఔపోసన పట్టిన ఆధ్యాత్మికవేత్త, నిత్య అన్వేషకుడు, నిరంతర జ్ఞానపిపాసి.. ఆయన మరెవరో కాదు విశ్వగురువుగా పేరెన్నికగన్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. అసాధారణ ప్రజ్ఞాశాలిగా ప్రఖ్యాతి పొందిన ఆయన భారత అత్యన్నుత పదవులైన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను సైతం అలంకరించి భారతరత్నగా భాసిల్లిన నిత్యకృషీవలుడు. అందుకే ఆ మహనీయుడి జయంతి రోజైన సెప్టెంబర్‌ ఐదో తేదీన ప్రతి ఏటా గురుపూజోత్సవం నిర్వహించుకుంటూ ఆయన్ను స్మరించుకుంటుంటాం. ప్రతి ఒక్కరూ తమ గురువులను శక్తిమేరకు, శ్రద్ధాభక్తులతో సత్కరించుకోవడం ద్వారా డాక్టర్‌ సర్వేపల్లికి నివాళులర్పిస్తుంటారు. ఈయన అప్పటి మద్రాసు రాష్ట్రం.. ప్రస్తుత తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించినా.. వీరిది అచ్చతెలుగు కుటుంబం. తండ్రి సర్వేపల్లి వీరాస్వామి, తల్లి సీతమ్మ. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామం. మాతృభాష కూడా తెలుగే. తహసీల్దారుగా పని చేసిన వీరాస్వామి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేసేవారు. ఆ క్రమంలోనే అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తిరుత్తణిలో పని చేస్తున్నప్పుడు 1888 సెప్టెంబర్‌ ఐదో తేదీన వీరాస్వామి దంపతులకు రాధాకృష్ణన్‌ జన్మించారు. అతని బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతిల్లో సాగింది. మద్రాస్‌ క్రిష్టియన్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా, మైసూర్‌, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెలుగు

దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన విశాఖలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్‌(ఏయూ) సర్వేపల్లి హయాంలోనే ఒక వెలుగు వెలిగింది. అంతకుముందు కలకత్తా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న సమయంలోనే భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథాన్ని రచించారు. లండన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యతత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, అమెరికా తదితర దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల్లో అనేక అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చి మన దేశ ఖ్యాతిని ఇనుమడిరపజేసిన ఘనత డాక్టర్‌ సర్వేపల్లి కే దక్కుతుంది. 1931లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండో వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. తన హయాంలో ఆ విశ్వవిద్యాలయం బహుముఖంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బొబ్బిలి రాజా సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఆర్ట్స్‌ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే సైన్స్‌కు సంబంధించిన పలు కోర్సులు ప్రారంభించారు. యూనివర్సిటీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కెమికల్‌ టెక్నాలజీతో పాటు తత్వశాస్త్ర విభాగాలు ప్రారంభించి ఆయా కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు వసతి కల్పిస్తూ హాస్టల్స్‌, విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు, వర్సిటీ సిబ్బంది నివాసానికి క్వార్టర్స్‌, ఆధునిక తరగతి గదుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఫలితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ఖ్యాతి గడిరచింది. తర్వాత కాలంలో ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించినా ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మర్చిపోలేదు. అక్కడి జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అతిపురాతనమైన బెనరాస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి కూడా 1939`48 మధ్య వైస్‌ఛాన్సలర్‌గా సేవలు అందించారు. రష్యాలో భారత దేశ రాయబారిగా, తొలి జాతీయ విద్యాకమిటీ చైర్మన్‌గా, యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) ఛైౖర్మన్‌గా విశిష్ట సేవలు అందించిన సర్వేపల్లి దేశంలో ఉన్నత విద్యారంగానికి దిశానిర్దేశం చేసి దాని వ్యాప్తికి బాటలు వేశారు.

మొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి

విద్యారంగానికే తొలినుంచీ అంకితమైన డాక్టర్‌ సర్వేపల్లి దేశ స్వాతంత్య్రోద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. ఉద్వేగభరిత ప్రసంగాలతో యూనివర్సిటీ విద్యార్థులను, ఉద్యమకారులను ఉత్తేజపరిచి స్వాతంత్య్ర కాంక్షను రగిలించేవారు. స్వాతంత్య్రానంతర మన దేశానికి సొంత రాజ్యాంగం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌లో కూడా సభ్యుడిగా ఉన్న సర్వేపల్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వంటి మహామహులతో కలిసి దేశానికి సొంత రాజ్యాంగాన్ని అందించారు. స్వాతంత్ర భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా బాబు రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక కాగా.. తొలి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ 1952 మే 13న బాధ్యతలు చేపట్టారు. తన తొలి టెర్మ్‌ ఐదేళ్లు పూర్తి అయిన తర్వాత రెండోసారి కూడా ఆయన్నే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడం విశేషం. ఆ విధంగా 1952 నుంచి 1962 వరకు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి.. బాబు రాజేంద్రప్రసాద్‌ తర్వాత భారత రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1967 వరకు ఆ పదవిలో కొనసాగారు.

నిత్య సత్యాన్వేషి

అధ్యాపకుడిగా, ప్రొఫెసర్‌గా, వైస్‌ ఛాన్సలర్‌గా, తత్వవేత్తగా వేలాది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచిన డాక్టర్‌ సర్వేపల్లి అందించిన బహుముఖ సేవలను గుర్తించిన ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయన్ను గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం ద్వారా తమను తాము గౌరవించుకున్నాయి. దేశానికి, విద్యారంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుతో సర్వేపల్లిని సత్కరించింది. అన్నింటికీ మించి సర్వేపల్లి ఆధ్యాత్మికవేత్తగా అద్వైత వేదాంతిగా ఖ్యాతిగాంచారు. దృష్టిలో మతం అంటే శాంతి, సత్యం కోసం నిత్య అన్వేషణ సాగించడమే. హిందూ, క్రిష్టియన్‌, ముస్లిం మత గ్రంథాలైన భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లను అమూలాగ్రం చదివి ఆకళింపు చేసుకున్న అద్వైత వేదాంతి ఆయన. సర్వమతాలు సమానమన్న విశాల దృక్పథంతో ఉదారవాదాన్ని నమ్మేవారు.. దాన్నే ప్రబోధించేవారు. ఉపనిషత్తులు బుద్ధుడి బోధనలను అనుసరిస్తూ వాటిని జీవన విధానానికి అన్వయించుకుంటూ తత్వశాస్త్రాన్ని బోధిస్తూ తాత్వికుడిగా మనదేశానికే కాకుండా ప్రపంచానికి మార్గదర్శనం చేసిన సర్వజ్ఞాని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1975 ఏప్రిల్‌ 17న తుదిశ్వాస విడిచారు. ఆయన మన మధ్య లేకున్నా ప్రతి ఏటా గురుపూజోత్సవం ద్వారా ఆయన మనమధ్యకు వస్తూనే ఉన్నారు.


డాక్టర్‌ పద్మ పొనుగోటి, ఫ్రీలాన్సర్‌

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page