top of page

‘సర్వే’శుని స్వాహాపర్వం!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • సచివాలయాలు వేదికగా అక్రమాలు

  • బదిలీల పేరుతో సహచరుల నుంచే వసూళ్లు

  • వారి నుంచి ఒత్తిడి పెరగడంతో విధులకు గైర్హాజరు

  • లోహరిబంద గ్రామ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌పైనా ఆరోపణలు

  • అయినా చర్యలు తీసుకోని జిల్లా అధికారులు

జిల్లా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న జి.సిగడాం మండలం పెంట గ్రామ సచివాలయ సర్వేయర్‌ భాను ప్రతాప్‌ ఫిబ్రవరి ఒకటిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల సొమ్ము రూ.44 వేలతో పరారయ్యాడు. దాంతో ఇంటి పన్ను కోసం వసూలు చేసిన మొత్తాన్ని పింఛన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి వచ్చింది.

`సచివాలయంలో పౌరసేవలు పొందడానికి అర్జీదారులు చెల్లించే లక్షల రూపాయల సేవా రుసుమును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయకుండా నెలల తరబడి తన వద్దే పెట్టుకున్న మందస మండలం లోహరిబంద సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎస్‌కే బుకారీని గత నెల 22న కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒక సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీప్రసాద్‌ ఈ నెలలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన పింఛన్‌ సొమ్మును పట్టుకొని పరారయ్యాడు.

ఈ మూడు ఘటనలు ఒకే కోవకు చెందినవి. నిందితులు ముగ్గురూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ బాధితులే. వీరిపై ఆయా సచివాలయాల పరిధిలో అనేక ఆరోపణలున్నాయి. ఆర్ధికపరమైన అనేక మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)


జిల్లా పరిధిలోని జి.సిగడాం, మందస మండలాల్లో నిధులు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సచివాలయ ఉద్యోగులు దర్జాగా తిరుగుతున్నా, వారి నుంచి సొమ్ము రికవరీ చేయడంలో స్థానిక మండల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లా సర్వేశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న భానుప్రతాప్‌ ఆచూకీ లేదని చెబుతున్నారు. అయితే సర్వేశాఖ అధికారులు, సచివాలయ సిబ్బందితో ఆయన టచ్‌లోనే ఉన్నాడు. గత ఏడాది నిర్వహించిన సచివాలయం సర్వేయర్ల బదిలీల్లో సర్వేశాఖ అధికారితో కలిసి పెద్దమొత్తంలో వసూలు చేసినట్టు భానుప్రతాప్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు సమర్పించినా కొందరు సర్వేయర్లకు కోరుకున్న చోటుకు బదిలీలు కాకపోవడంతో తాము చెల్లించిన డబ్బు వెనక్కి ఇవ్వాలన్న ఒత్తిడి భానుప్రతాప్‌పై ఉందని సచివాలయ సర్వేయర్లే చెబుతున్నారు. కాగా సుమారు రూ.10 లక్షలు వసూలుచేసి, ఆ మొత్తాన్ని సర్వేశాఖ అధికారికే అప్పజెప్పినట్టు భానుప్రతాప్‌ కొందరు సహోద్యోగులకు చెప్పినట్టు తెలిసింది. కోరుకున్న చోటకు బదిలీ కాని కొందరు సర్వేయర్లు తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా ఆ మొత్తం సర్వేశాఖ అధికారికే ఇచ్చేశానని భానుప్రతాప్‌ చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే బాధ్యుడు భానుప్రతాప్‌ 45 రోజులుగా విధులకు డమ్మా కొట్టి తిరుగుతున్నాడు. అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఆయన కాజేసిన పింఛన్‌ సొమ్మును పెంట సచివాలయ సిబ్బంది ఇంటి పన్ను సొమ్ముతో భర్తీ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీంతో భానుప్రతాప్‌పై పింఛన్‌ సొమ్ముతో పరారయ్యాడన్న అభియోగం నమోదు కాలేదు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీకి ఎడిక్ట్‌ అయిన భానుప్రతాప్‌ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అక్రమాలకు పాల్పడినట్టు సహోద్యోగులు చెబుతున్నారు.

ఆ ఇద్దరిపైనా ఆరోపణలు

మందస మండలం లోహరిబంద గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న సతీష్‌బాబుపై పలు అవినీతి ఆరోపణలు, పోలీసు కేసులు, ఫిర్యాదులు ఉన్నాయి. ఉద్యోగాలు వేయిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.20 కోట్ల మేర వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితులు కలెక్టర్‌, జెడ్పీ సీఈవో చుట్టూ తిరిగినా, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదు. నాలుగు సార్లు సస్పెండ్‌ అయినా కార్యదర్శి సతీష్‌లో మార్పు రాలేదు. బదిలీలు, డిప్యూటేషన్లు, హుదూద్‌ ఇళ్లు ఇప్పిస్తానని 2014 నుంచి అనేకమందిని మోసం చేస్తూ వస్తున్నాడు. విచారణ పేరుతో సతీష్‌ను పిలిపిస్తున్న పోలీసులు, జెడ్పీ అధికారులు అతగాడు ఇచ్చే ప్యాకేజీని తీసుకొని విడిచిపెట్టేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. సతీష్‌ పరిధిలో పని చేసే సచివాలయ డిజిటల్‌ సహయకుడు రూ.లక్ష సేవా రుసుము కాజేశాడని మందస ఎంపీడీవో తీరిగ్గా కలెక్టర్‌కు నోట్‌ పెట్టడడం అనుమానాలకు తావిస్తోంది. ఒక సచివాలయంలో సేవా రుసుము రూ.లక్ష జమ కావాలంటే ఆరు నెలల వ్యవధి పడుతుంది. ప్రతి నెల సేవా రుసుమును ప్రభుత్వానికి జమ చేయాల్సిన ఉద్యోగి వాటిని సొంతానికి వాడుకుంటే నిలదీయాల్సిన గ్రామ క్యార్యదర్శి సతీష్‌ను ఎందుకు బాధ్యుడిని చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఎంపీపీడీవో ఆరు నెలల పాటు తాత్సారం చేసి చివరి నిమిషంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్ష జమ చేయలేదని కలెక్టర్‌కు నివేదిక పంపించి సస్పెండ్‌ చేయించారు. ప్రభుత్వ సొమ్మును కాజేసిన సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ బుకారీని గ్రామ కార్యదర్శి సతీష్‌ పూర్తిగా ప్రోత్సహిస్తూ వచ్చారన్న విమర్శలు ఉన్నాయి.

అక్రమార్కులకే బాధ్యతలు

ఫిబ్రవరి 22న సస్పెండ్‌ అయిన బుకారీకి మార్చి ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసే బాధ్యత అప్పగించారు. గ్రామ కార్యదర్శి సతీష్‌ బాబు ఆధ్వర్యంలో రోడ్డుపైనే ద్విచక్ర వాహనంపై కూర్చొని లబ్ధిదారులను ఎండలో నిలబెట్టి బయోమెట్రిక్‌ తీసుకొని పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన రూ.లక్షను సొంతానికి వాడుకున్నాడన్న అభియోగంతో కలెక్టర్‌ సస్పెండ్‌ చేసిన వారం రోజుల్లోనే లోహరిబందలో డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎస్‌కే బుకారీకి పింఛన్ల సొమ్ము అప్పగించి పంపిణీ చేయించారు. ఆర్ధిక నేరారోపణలపై సస్పెండైన ఉద్యోగి చేతిలో పింఛన్‌ సొమ్ము పెట్టి పంపిణీ చేయడం మండల అధికారుల నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేసి సచివాలయానికి లబ్ధిదారులను పిలిపించి కొన్ని చోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. లోహరిబందలో ఆర్ధిక నేరాలు, అక్రమాలు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ విధుల నుంచి సస్పెండైన సచివాలయ ఉద్యోగి బుకారీ ఒకరైతే, ఉద్యోగాలు, బదిలీల పేరుతో ఉద్యోగులను, నిరుద్యోగులను, అమాయకులను టోకరా వేసి రూ.20 కోట్లు కాజేశాడని అభియోగాలు ఎదుర్కొంటున్న గ్రామ కార్యదర్శి సతీష్‌బాబు ఒకరు. ఇద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. వీరికి మండల అధికారి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సచివాలయ వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను వెనకేసుకు వస్తున్నారని విమర్శలున్నాయి. ప్రభుత్వ సొమ్ము రూ.లక్ష కాజేసిన ఉద్యోగి పింఛన్‌ సొమ్ముతో ఉడాయిస్తే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page