top of page

సీఐడీ చేతికి ఎస్బీఐ కేసు

Writer: NVS PRASADNVS PRASAD
  • బజారుబ్రాంచ్‌లో వెలుగుచూసిన నకిలీ రుణాలు

  • ఏడాది క్రితమే బయటపెట్టిన ‘సత్యం’

  • రూ. కోటి దాటిందంటూ డీజీకి లేఖ

  • ఎస్పీ మహేశ్వర్‌రెడ్డికి భయపడే ఈ డ్రామా

(సత్యంన్యూస్‌, నరసన్నపేట)

శ్రీకాకుళంలో ఉన్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొత్తానికి రాష్ట్రంలో పాపులరైపోయింది. అత్యధికంగా బిజినెస్‌ చేయడం వల్లో, లేదూ అంటే లీడ్‌బ్యాంక్‌ కంటే ముందుకు దూసుకొచ్చినందుకో, రైతులకు ఎక్కువ శాతం రుణాలిచ్చినందుకో కాదు. జిల్లా చరిత్రలో ఎస్‌బీఐలో ఒక బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం వెలుగుచూసిందని, దీని మీద దర్యాప్తు జరిపించాలంటూ స్వయంగా బ్యాంకు ఉన్నతాధికారులే రాష్ట్ర సీఐడీకి లేఖ రాశారు. ఇది టీఆర్‌ఎం రాజు రీజనల్‌ మేనేజర్‌గా పని చేసిన కాలానికి వచ్చిన గుర్తింపుగానే చెప్పుకోవచ్చు. నరసన్నపేట బజారుబ్రాంచిలో ఎంఎస్‌ఎంఈ రుణాలతో పాటు అనేక వ్యక్తిగత రుణాలు బినామీ పేర్లతో బ్యాంకు ఉద్యోగుల చేతికి వెళ్లిపోయాయని మొట్టమొదటిసారిగా సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ 2024 ఏప్రిల్‌ 2న కథనాన్ని ప్రచురించింది. దీని మీద అటు పోలీసులు, ఇటు బ్యాంకు అధికారులు ఆరాతీస్తే, అదంతా అసత్యమని, కేవలం కక్షపూరితంగా ‘సత్యం’ కథనాలు రాస్తుందని బ్యాంకు ఉన్నతాధికారులకు చెప్పుకొచ్చిన అప్పటి మేనేజ్‌మెంట్‌ ఇప్పుడు రూ.కోటికి పైబడి ఇక్కడ నకిలీ రుణాలు బయటపడ్డాయని, దీని మీద స్వయంగా సీఐడీ దర్యాప్తు నిర్వహించాలంటూ తాజాగా సంబంధిత డీజీకి ఓ లేఖ రాసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత బయటకు అటువంటిదేమీ లేదని డాంభికాలు చెప్పినా లోలోపల మాత్రం శాఖాపరమైన విచారణ జరిపించారు. ఆమదాలవలస సీనియర్‌ మేనేజర్‌ బీఏఎన్‌ మూర్తిని అక్కడకు పంపించి, అసలు ఏమేరకు కుంభకోణం జరిగిందనేది వెలికితీయించారు. అయితే తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతుండటం, దేనికీ ఓ లెక్కాపత్రం లేకపోవడంతో తనకున్న పరిజ్ఞానంతో కొంతమేరకు ఈ వ్యవహారం తేల్చానని, మిగిలినది ఆడిటర్ల బృందం, బ్యాంకు విజిలెన్స్‌లు రంగంలోకి దిగితేగాని తేలేలా లేదంటూ మూర్తి అప్పట్లో బ్యాంకు మేనేజ్‌మెంట్‌కు తన నివేదికను అందజేశారు. అయితే ఈ నివేదిక పూర్తి పాఠాన్ని ఎక్కడా బ్యాంకు బయటపెట్టలేదు సరికదా.. ఈ విచారణ జరిపిన బీఏఎన్‌ మూర్తిని ఆకస్మికంగా బదిలీ చేశారు. అప్పుడే బజారు బ్రాంచిలో కుంభకోణం జరగడం ఖాయమన్న విషయం బ్యాంకు సర్కిళ్లకు తెలిసిపోయింది. అయితే ప్రతీసారి పాడే పాటనే ఇక్కడ కూడా చరణాలు మార్చి పల్లవిని వల్లించారు బ్యాంకు అధికారులు. ఇటువంటి వ్యవహారాలు బయటపడితే బ్యాంకు రెపిటేషన్‌ దెబ్బతింటుందని, వీలైనంత వరకు ఇటువంటి వ్యవహారాల్లో రికవరీ చేయించి ఎవరికీ నష్టం లేకుండా చూస్తామంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం జరిగినప్పుడు రీజనల్‌ మేనేజర్‌గా ఉన్న టీఆర్‌ఎం రాజు, బ్యాంకు మేనేజర్‌గా ఉన్న శ్రీకర్‌ ఎవరూ ఇక్కడ లేరు. దీంతో ఈ సొమ్ములు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయి, ఎవరి నుంచి రికవరీ చేయాలన్న విషయం తేల్చుకోలేకపోయారు. ఎవరి పేరుమీద అయితే బ్యాంకు రికార్డుల్లో లోను చూపిస్తుందో వారి ఖాతాలో ఆ సొమ్ములు క్రెడిట్‌ అయినట్టు కనిపించడంలేదు. అలాగే ప్రతీ నెలా కట్టే ఈఎంఐ కూడా దేశంలో నలుమూలల నుంచి సంబంధిత రుణ అకౌంట్లలో క్రెడిట్‌ కావడం అంతుచిక్కలేదు. అంటే.. ఓ పథకం ప్రకారం లక్కీభాస్కర్‌ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ చేసినట్టు బ్యాంకింగ్‌ వ్యవస్థలో లోపాలను కూలంకుషంగా తెలిసిన వ్యక్తులే దీనికి పూనుకొన్నారని అర్థమైంది. 2024 ఏప్రిల్‌లో ఈ వ్యవహారం వెలుగుచూస్తే మరో నెల రోజుల్లో ఈ కుంభకోణానికి ఏడాదవుతుంది. ఇంతవరకు మిన్నకుండి ఇప్పుడే సీఐడీకి లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏమిటనేదానిపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇందుకు ఎవరి రీజన్లు వారికున్నాయి. అసలు బజారుబ్రాంచిలో కుంభకోణమే జరగలేదని చెప్పిన అధికారులు ‘సత్యం’ తన కథనంపై బలంగా నిలబడటంతో అప్పటి బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌ను గాలిలో పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇది లీగల్‌గా కోర్టుకు వెళితే చెల్లదని ఆయన్ను విధుల నుంచి తప్పించింది. కానీ ప్రతీ చిన్న లోన్‌కు రీజనల్‌ ఆఫీస్‌కు వెళ్లే ఫైల్‌ మీద ఆర్‌ఎం సంతకాలు కూడా ఉన్నప్పుడు ఆయన్ను ఎందుకు తప్పించలేదన్న ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. మరోవైపు గార బ్రాంచిలో కూడా తాకట్టు బంగారు నగలు మాయం కావడంలో కూడా రీజనల్‌ మేనేజర్‌ రాజు పాత్రపై అనుమానాలు వ్యక్తం కావడంపై జనం దృష్టి మళ్లించడానికి రాజును పిల్లల కోడి మాదిరిగా అక్కడా ఇక్కడా తిప్పారు. కానీ ఇంతవరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌ను విధుల నుంచి తప్పించడంతో అసలు ఎందుకు ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నరసన్నపేట బ్రాంచిలో నకిలీ రుణాల కుంభకోణం జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. వాస్తవానికి బజారుబ్రాంచిలో జరిగిన వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మొదట సిద్ధపడ్డారు. కానీ వైట్‌కాలర్‌ నేరాలపై ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అగ్రెసివ్‌గా వ్యవహరిస్తుండటంతో ముందు, వెనుక ఉన్నవారందర్నీ స్థాయితో సంబంధం లేకుండా లేపలేసేస్తారని భయపడినట్టు తెలుస్తుంది. అందుకే కోటి రూపాయలు దాటి కుంభకోణం జరిగింది కాబట్టి దీన్ని సీఐడీ ఇన్వెస్టిగేట్‌ చేసే అధికారం ఉందని ఎవరిచ్చారో తెలీదు కానీ ఆ సలహా మేరకు సీఐడీ డీజీకి ఒక లేఖ రాశారు. నిజంగా బ్యాంకు పరువు ప్రతిష్ఠల కోసమే ఈ పని చేశారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ నమ్మడంలేదు. సీఐడీ కేసును టేకప్‌ చేయాలంటే దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి. అంతకు మించి ఇటువంటి కుంభకోణాలు జిల్లాలో అనేకచోట్ల జరిగివుండాలి. అలా కానప్పుడు ఇటువంటి విన్నపాలు సీఐడీకి అనేకం వస్తుంటాయి. దీనిపై ఎటువంటి చర్యలూ ఉండవు. ఈలోగా బజారుబ్రాంచి వ్యవహారం ఏమైందని ఎవరైనా అడిగితే సీఐడీ పరిధిలో ఉందని తప్పించుకోడానికి బ్యాంకు అధికారులు ఓ అవకాశం కల్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకంటే పెద్ద మొత్తంలో గార బ్రాంచిలో బంగారం మాయమైనప్పుడు కేవలం అప్పటి ఆర్‌ఎం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతిగా వ్యవహరించినవారు ఇప్పుడు సీఐడీకి కేసు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page