రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
రోజూ వందల సంఖ్యలో కేసుల తాకిడి
శానిటేషన్ డ్రైవ్ ఊసెత్తని నగరపాలక సంస్థ
దోమలు విజృంభించడంతో రోగాల వ్యాప్తి
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా ఏ ఆస్పత్రిలోనూ బెడ్లు ఖాళీ లేవు. పాండమిక్ సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. కరోనా ముందు సీజనల్ వ్యాధుల బారిన పడినవారికంటే ఈసారి అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాలకు గురవుతున్నారు. ఎండాకాలం ముగిసి వర్షాలు పడిన తర్వాత సరైన ఎండలు లేక మురుగులో పుట్టిన దోమలు కుట్టడంతో వ్యాధులు ప్రబలుతాయి. ఇవి అంటువ్యాధులు కూడా. ఇటువంటి సమయాల్లోనే కార్పొరేషన్, పంచాయతీ యంత్రాంగాలు శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలి. కానీ రోజూ మాదిరిగానే చెత్త ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించడం తప్ప శానిటేషన్ విభాగం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడంలేదు. దీనివల్ల ప్రతి ఇంట్లోనూ జ్వరపీడితులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం చికున్‌గున్యా, డెంగీ, రోటా వైరస్‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ వచ్చింది అని తెలుసుకునే లోపే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో రక్తం ఎక్కించాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే బ్లడ్‌బ్యాంకుల్లో కూడా రక్తం దొరకడంలేదు. ప్రతి ఆస్పత్రిలో వందల్లో రోగులు బారులు తీరుతూ కనిపిస్తున్నారు. దీనికి తోడు మంకీపాక్స్ కూడా దేశంలో విస్తరిస్తోందని, దీన్ని ఇలాగే విడిచిపెడితే కరోనా మాదిరిగా లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమన్నది పక్కనపెడితే, ప్రస్తుతానికైతే వైరస్ మ్యుటేట్ అయ్యి రకరకాల రూపాలు మార్చుకుంటూ జ్వరాలు, ఇతర వ్యాధులను వ్యాప్తి చేస్తోంది.
కానరాని నియంత్రణ చర్యలు
పిల్లల్లో విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, డీహైడ్రేషన్ ఉంటే రోటా వైరస్ వచ్చినట్లని.. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, నీరసం ఉంటే నోరో వైరస్ ఉన్నట్టని.. జ్వరము, దగ్గు, ఊపిరాడకపోవడం, గొంతునొప్పి, ముక్కు నుంచి చీముడు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే మ్యుటేషన్ మార్చుకున్న కరోనా వైరస్ సోకినట్టేనని డాక్టర్లు చెబుతున్నారు. 103 డిగ్రీల జ్వరం ఉండి, మోకాళ్లు, మోచేతుల దగ్గర విపరీతమైన నొప్పి, కండరాల నొప్పి, ఒక్కోసారి ఒంటిపై దద్దుర్లు కనిపిస్తే చికున్‌గున్యాగా గుర్తించాలి. ఇదే లక్షణాలతో జ్వరం తగ్గకపోతే డెంగీగా మారుతుంది. డెంగీతో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం వల్ల చనిపోయిన కేసులు కూడా జిల్లాలో ఉన్నాయి. అయితే వైద్యాధికారులు దీన్ని బయటపెట్టడంలేదు. సాధారణంగా ఈ సీజన్‌లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు గుడ్లు పెట్టకుండా, వాటి సంతతి వృద్ధి చెందకుండా మలాథియాన్ స్ప్రే చేయాలి. అలాగే వృద్ధి చెందిన దోమలు వ్యాపించకుండా ఉండటానికి ఫాగింగ్ చేయాలి. కానీ ఇంతవరకు కార్పొరేషన్ అధికారులు మూలన ఉన్న ఈ యంత్రాలనే బయటకు తీయలేదు. దీంతో రోగాల తీవ్రత పెరిగిపోతోంది. కాలువల్లో పూడికలు పెద్ద ఎత్తున తీసి నీరు నిల్వ ఉండకుండా చేసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెత్తా చెదారాలను శానిటేషన్ సిబ్బంది అలాగే విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం నగరానికి ఉన్న ఏకైక కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అర్థరాత్రి నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగే ఈ ప్రాంతంలో కూరగాయల వేస్టేజ్‌ను యార్డులోనే పడేస్తున్నారు. సాధారణంగా మన రాష్ట్రంలో మదనపల్లి, కర్నూలు, చిత్తూరు వంటి ప్రాంతాలతో పాటు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలో పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లారీలతో ముత్యాలమ్మతల్లి పెద్దమార్కెట్‌కు లోడ్లు వస్తాయి. ఇక్కడ వాటిని గ్రేడిరగ్ చేసి ఒడిశాకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. అదే సమయంలో స్థానిక మార్కెట్ అవసరాల కోసం వాటిని రిటైలర్స్ కొనుగోలు చేస్తారు. ఇందులో సచ్చు, పుచ్చు, కుళ్లిన వాటిని తీసి పక్కన పడేస్తారు. వీటి కోసం పశువులు ఎగబడుతుంటాయి. దాంతో మార్కెట్ ప్రాంతం చిందరవందరగా మారిపోతుంది. దీని మీద రెండు చినుకులు పడితే పరిస్థితి చెప్పనక్కరలేదు. మొత్తం ఈ ప్రాంతాన్ని పొక్లెయిన్ పెట్టి క్లీన్ చేస్తే గానీ రోగాలు ప్రబలకుండా నిరోధించలేం. కొత్తగా వచ్చిన కార్పొరేషన్ హెల్త్ అధికారి దీనిపై దృష్టి సారించాలని గుజరాతిపేటవాసులు కోరుతున్నారు.
Comments