నగరంలో పెరుగుతున్న అమ్మకాలు, సేవనం
ఆ మత్తులో విచక్షణ కోల్పోతున్న యువత
పెరుగుతున్న నేరాలు.. అమాయకులపై దాడులు
అరెస్టులు చేస్తున్నా మూలాలు పట్టుకోలేకపోతున్న పోలీసులు
కొత్త ఎస్పీ సంకల్పంతోనైనా ఈ పీడ వదులుతుందా?
క్రైమ్ కథా చిత్రాలు.. గంజాయి గాధలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు కోన దిలీప్‌కుమార్ (25). నగరంలోని గూనపాలెంలో తల్లితో పాటు నివాసముంటున్నాడు. తండ్రి లేకపోవడంతో తల్లే పని చేస్తూ పెంచింది. గంజాయి అతని జీవితాన్ని చిత్తు చేసింది. అది లేకుండా ఒక్కరోజు కూడా బతకడం సాధ్యంకాని పరిస్థితికి వెళ్లిపోయాడు. గంజాయి దొరక్కపోతే మత్తునిచ్చే మాత్రలనే బఠాణీల్లా నమిలేసి మెంటలెక్కిపోయాడు. ఆ మత్తులోనే వన్‌టౌన్ పరిధిలో కొన్ని నేరాలకు పాల్పడ్డాడు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం బరంపురం వద్ద ఉన్న నిషా నివారణ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. శ్రీకాకుళం జీజీహెచ్‌లో, విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోవడంతో బరంపురం సమీపంలోని కొనిశి గ్రామంలో ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.
...
ఆదే గూనపాలేనికే చెందిన మరో యువకుడి పేరు ప్రశాంత్. గంజాయి మత్తులో అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. గంజాయి సేవించిన తర్వాత విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మణి అనే వ్యక్తిపై దాడి చేసి అతని బుర్ర బద్దలుకొట్టాడు. పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అప్పటినుంచి పరారీలో ఉన్నాడు.
...
తుమ్మావీధికి చెందిన జగన్నాథం ఇటీవల డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతుండగా పక్కనుంచి ఒక యువకుడు ద్విచక్ర వాహనం పై వెళ్తూ తల మీద గట్టిగా మోదడంతో గాయపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అసలు జగన్నాథానికి, ఆయనపై దాడి చేసిన యువకుడికి కనీసం ముఖపరిచయం కూడా లేదు. కేవలం గంజాయి ఇచ్చిన ఉద్రేకంతో చేసిన చర్య ఇది.
...
వారం రోజుల క్రితం కంపోస్ట్ కాలనీ వద్ద రోడ్డు మీదే వెల్డింగ్ సిలెండర్ పెట్టి దాని వైర్లను రోడ్డు మీద పడేయడంతో ఎవరైనా కాలికి తగిలి పడిపోతారని చెప్పిన పాపానికి ఒక యువకుడి బుర్ర బద్దలుగొట్టేశారు. ఆ యువకుడి రిమ్స్ క్యాజువాలిటీలో చికిత్స తీసుకున్న ఆ యువకుడు కేసు పెట్టాలని భావించినప్పటికీ గంజాయి బ్యాచ్ చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గిపోయాడు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
..ఇలా చెప్పుకుంటూపోతే నగరంలో వెలుగులోకి రానివి, పోలీసుల వరకు చేరని గంజాయి దాడులు కోకొల్లలు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి పెద్దగా శిక్షలు పడే అవకాశం లేకపోవడంతో పోలీసులు కూడా గంజాయి మత్తులో న్యూసెన్స్ చేసిన వారి పట్ల ఇన్నాళ్లూ ఉదాశీనంగా వ్యవహరించారు. ఫలితంగా నగరంలో గంజాయి బ్యాచ్ విచ్చలవిడితనం పెరిగిపోయింది. అయితే కొత్త ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి దీన్ని ఒక సవాల్‌గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సేవించినవారిని, విక్రయిస్తున్నవారిని విడిచిపెట్టకూడదన్న ధ్యేయంతో ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాలతో జిల్లా నలుమూలలా సోదాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరం పెద్దదిగా ఉండటం వల్ల గంజాయి మూకలను అదుపులోకి తేవడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోయినా ఎస్పీ పంతం పట్టి దాడులు కొనసాగిస్తే అసాధ్యం మాత్రం కాదు. గంజాయి బ్యాచ్ వల్ల సమాజమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా మారిపోతున్నారు. నిత్యం ఏదో ఒక గొడవ తేవడం, కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్ చుట్టూ తిరగడం సర్వసాధారణమైపోయింది. గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, ఎక్కడెక్కడ సేవిస్తున్నారన్న వివరాలు పోలీసులకు తెలియనివి కావు. కాకపోతే అదిలించి నడిపించేవారు లేక మనకెందుకులే అన్నట్లు మిన్నకుండిపోయారు. శ్రీకాకుళం వన్‌టౌన్ ఎస్‌ఐగా విజయ్‌కుమార్ పని చేసిన తొలిరోజుల్లో తన స్టేషన్ పరిధిలో గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఏమైందో గానీ వన్‌టౌన్ పరిధిలోనే గంజాయి సేవనం, అమ్మకాలు పెరిగిపోయాయి. వాటి ప్రభావంతో క్రైమ్ రేట్ కూడా పెరిగింది. గతంలో మాదిరిగా స్టూవర్ట్‌పురం నుంచో, మరో రాష్ట్రం నుంచో దొంగలముఠా రావడం, ఇళ్లు కొల్లగొట్టడం అనే రివాజు పోయి స్థానిక గంజాయిబాబులే ఇళ్ల గజాలు వంచేసి చోరీలకు పాల్పడిన సందర్భాలు కనిపిస్తున్నాయి.
వలంటీరే రింగ్ మాస్టర్
గంజాయి దందాలను అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ నియమించిన ప్రత్యేక సిబ్బంది గత కొద్ది రోజులుగా అదుపులోకి తీసుకుంటున్న వ్యక్తుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు భోగట్టా. ఇందులో భాగంగా నగరంలోని మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఒక యువకుడి ఇంట్లో సోదాలు చేసి రెండు ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు లాగుతున్నారు. కొన్నాళ్లు కొరియర్ బాయ్‌గా పనిచేసిన ఈ యువకుడు చాలా రోజులుగా పనీపాటా లేకుండా పోకిరీ వేషాలు వేస్తుండేవాడని, ఆయన తండ్రి స్క్రాప్ కొనుగోలు చేసి విక్రయిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ యువకుడిగా స్నేహ బృందంగా ఉంటున్న మండలవీధి, కత్తెరవీధి, కర్రావీధి, రెడ్డికవీధి, చల్లవీధికి చెందిన సుమారు 60 మంది రోజూ సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు డీఈవో కార్యాలయం రోడ్డులోనే ఉంటూ హడావుడి చేస్తుంటారు. దాంతో సాయంత్రం ఏడు తర్వాత ఆ రోడ్డు మీదుగా ఒంటరిగా వెళ్లడానికి ఎవరూ సాహసించరు. వీరందరిపైనా అనేక అభియోగాలతో వన్‌టౌన్, రూరల్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. అందరికీ అంతో ఇంతో నేరచరిత్ర ఉంది. డీఈవో కార్యాలయ పిట్టగోడలపై కూర్చోనే ఈ బ్యాచ్‌ను రెడ్డిక వీధికి చెందిన ఒక వలంటీర్ లీడ్ చేస్తుంటాడని తెలిసింది. రాజకీయ పార్టీల ర్యాలీలకు, సమావేశాలకు వీరందరినీ ఆ వలంటీరే తీసుకొని వెళ్లి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతుంటాడన్న ప్రచారం ఉంది. బ్యాచ్ పేరు చెప్పి పలుకుబడిన వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మహాలక్ష్మీనగర్ కాలనీలో రెండు ప్యాకెట్ల గంజాయి చిక్కిన నేపథ్యంలో వలంటీర్ బ్యాచ్ అలెర్ట్ అయింది. తోటపాలెం వద్ద దొరికిన ఈ బ్యాచ్‌లో అందరూ సేవించేవారే అనుకున్నారు. పోలీసులకు చిక్కిన తర్వాత బ్యాచ్‌లో కొందరు గంజాయి విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. గతంలో గంజాయి సేవించినవారినే పట్టుకున్నారు తప్ప అమ్ముతున్నవారిని పట్టుకోలేదు.
మూలాలు పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం
జిల్లాలో అక్కడక్కడా గంజాయి అమ్మకందారులు చిక్కినా మూలాలు కనిపెట్టడం పోలీసులకు సాధ్యం కాలేదు. జలుమూరు మండలంలో గత ఏడాది గంజాయి విక్రయిస్తున్న వృద్ధురాలిని అదుపులోకి తీసుకొని ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఒడిశాలోని బాధ్యుడిని సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా మూలాలను గుర్తించలేకపోయారు. గంజాయి అక్రమంగా తరలించేవారు, విక్రయించేవారు చిక్కినా వారి నుంచి సమాచారం రాబట్టడం అంత సులువు కాదు. వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతూ సాంకేతికతను వినియోగిస్తూ ఫోన్ డేటా బయటకు రాకుండా ఎప్పటికప్పుడు నెంబర్లు మార్చుతుంటారు. తరచూ ప్రాంతాలను కూడా మార్చేస్తూ కొత్త ప్రాంతాల్లో డీల్ కుదుర్చుకుంటారు. ఒకవేళ పోలీసులకు చిక్కినా గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారన్న విషయం బయటపెట్టరు. ఒకవేళ బయటపెట్టినా సదరు బాధ్యుడు చిక్కడు. ఒకవేళ పోలీసులకు ఎవరైనా దొరికితే మిగతా వారందరూ అలెర్ట్ అయిపోతున్నారు. గంజాయి కేసుల్లో మూలాలు కనుగొనడం ఇప్పటికీ సాధ్యం కాలేదంటే వారంతా ఎంత పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తుంటారో అర్ధమవుతుంది. గంజాయి మూలాలన్నీ ఒడిశాలోనే ఉన్నాయని తెలిసినా అక్కడకు వెళ్లి బాధ్యులను తీసుకురావడం అసాధ్యం. ఒడిశా పోలీసులు అన్ని సందర్భాల్లో ఆంధ్రా పోలీసులకు సహకరించరు. వారు సహకరించకపోతే నిందితులను గుర్తించడం సాధ్యంకాదు. దీంతో గంజాయితో పట్టుడినవారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి 90 రోజులు జైల్లో ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేయడం.. పెడదారిపట్టిన యువతకు కౌన్సెలింగ్ నిర్వహించి విడిచిపెట్టేయడం చేస్తున్నారు.
Comments