top of page

స్కూల్స్‌కు వాలంటైన్స్‌ డే సెలవు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Feb 15
  • 2 min read
  • తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోని ముస్లిం పండగ పేరు చెప్పి వాడకం

  • మార్చితో సెలవులు ముగుస్తున్నాయనే పథకం




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

షబ్‌`ఇ`బరాత్‌.. ఈ పేరెప్పుడైనా విన్నారా? చదువుతుంటే ముస్లిం సంస్కృతికి సంబంధించిన పేరని మాత్రమే అర్థమవుతుంది కదా. మీకే కాదు.. ఈ జిల్లాలో గాని, తెలుగు రాష్ట్రాల్లో గాని షబ్‌`ఇ`బరాత్‌ అని పేరు చెబితే గుర్తుపట్టే ముస్లింలు లేరు. కానీ ఇది ఒక పండగ. ఈ విషయం మన జిల్లాకు చెప్పింది అరబ్బులో, ఆఫ్గనీలో, ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్‌ మాత్రం కాదు.. సాక్షాత్తు మన గురుదేవులు, ప్రభుత్వ ఉపాధ్యాయులే. దక్షిణ, మధ్య, ఆగ్నేయ ఆసియాలతో పాటు మధ్యప్రాచ్యంలో జరుపుకొనే పండగిది. ఎక్కడ చూశారో, ఎలా చూశారో తెలీదు గానీ ఒక ఆప్షనల్‌ హాలీడేను తమకు అనుకూలంగా వాడుకోడానికి హైదరాబాద్‌లో కూడా జరుపుకోని ఈ పండగ పేరుతో శుక్రవారం జిల్లాలో కొన్ని మండలాల్లో హైస్కూల్‌ ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ఆప్షనల్‌ హాలీడే తీసుకున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆప్షనల్‌ హాలీడే ప్రకటించారంటూ ఉపాధ్యాయ వర్గాల్లోనే శుక్రవారం పెద్ద ఎత్తున కామెడీ ట్రాక్‌ నడిచింది. అసలు ఈ ఆప్షన్‌ హాలీడే అంటే ఏమిటి? దాన్ని ఎందుకు స్థానిక పరిస్థితుల బట్టి ప్రకటించాలి అన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ ప్రస్తావిస్తే మన ఘనత చెందిన ఉపాధ్యాయులు ఎంత పొందికగా ఈ సెలవును వాడేశారన్నది అర్థమవుతుంది. ప్రతీ ఏడాది పబ్లిక్‌ హాలీడేస్‌తో పాటు 12 నుంచి 15 ఆప్షనల్‌ హాలీడేలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇందులో ఓ ఐదు సెలవులను స్థానికంగా ఉన్న యంత్రాంగం నిర్ణయం తీసుకునే విధంగా విడిచిపెడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం నగరంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు ఉన్నా కూడా వరలక్ష్మీవ్రతం లాంటి నోములు జరిగినప్పుడు ప్రభుత్వం పబ్లిక్‌ హాలీడేగా ప్రకటించదు. అటువంటప్పుడు స్థానిక ఎంఈవో అనుమతితో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆప్షనల్‌ హాలీడే ఇవ్వొచ్చు. అలాగే శివరాత్రికి ప్రభుత్వం పబ్లిక్‌ హాలీడేగా సెలవిస్తుంది. కానీ జాగారం చేసినవారు మరుసటిరోజు రాలేరని ఆ రోజు ఆప్షనల్‌ హాలీడే ప్రకటిస్తారు. ఇక భోగీ, సంక్రాంతికి మాత్రమే సెలవిచ్చే ప్రభుత్వం కనుమ రోజు ముక్కలు, కక్కలు తింటాం కాబట్టి రాలేమంటే సెలవివ్వదు. అందుకే స్థానికంగా ఆప్షనల్‌ హాలీడే ప్రకటిస్తారు. ఇవి కాకుండా గ్రామాల్లో అమ్మవారి పండగలైనప్పుడు ప్రధానోపాధ్యాయుడి చొరవతో ఆప్షనల్‌ హాలీడే ప్రకటిస్తారు. ఇందుకోసం ఐదు రోజుల సెలవులు ప్రధానోపాధ్యాయుడి ద్వారా ఎంఈవో చేతిలో ప్రభుత్వం పెడుతుంది. కానీ జిల్లాలో మాత్రం శ్రీకాకుళం రూరల్‌, సరుబుజ్జిలి, పొందూరు, జి.సిగడాం వంటి మరికొన్ని మండలాల్లో శుక్రవారం ప్రేమికుల రోజు సందర్భంగా ఆప్షనల్‌ హాలీడేను ప్రకటించారని ప్రచారం జరిగింది. ఆ పేరు చెప్పుకుంటే బయటకు బాగోదు కాబట్టి ఇక్కడ జరుపుకోని షబ్‌`ఇ`బరాత్‌ అనే పండగ పేరును చూపించారు. వాస్తవానికి షబ్‌`ఇ`బరాత్‌ ఇస్లాం కేలండర్‌ ప్రకారం ఎనిమిదో నెల షాబాన్‌ మాసంలో 14 లేదా 15వ తేదీ రాత్రి జరుపుతారు. చంద్రుడి ఆధారంగా చేసుకునే ఈ రాత్రిపండగను సిక్కోలు గురువులు తెర మీదకు తెచ్చారు. పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు శనివారం, ఆదివారం తేడా లేకుండా పాఠాలు చెప్పాలని ప్రభుత్వం టైమ్‌టేబుల్‌ నిర్ణయించడంతో తమ ఆప్షనల్‌ హాలీడేలు ఉత్తినే పోతున్నాయని భావించిన ఉపాధ్యాయులు మధ్యప్రాచ్యం అంటే ఇరాన్‌, ఇరాక్‌ ప్రాంతాల్లో కూడా అంతంత మాత్రంగా జరుపుకొనే పండగను తెర మీదకు తెచ్చారు. ఈ విద్యాసంవత్సరంతో ఆప్షనల్‌ హాలీడేలు ముగుస్తాయి. ఇవి వాడుకోపోతే వచ్చే విద్యాసంవత్సరానికి సెలవులు తగ్గిపోతాయని భావించారో, లేదూ అంటే కొత్త పండగలను తెర మీదకు తెద్దామనుకున్నారో తెలీదు గానీ జిల్లాలోని అనేక మండలాల్లో షబ్‌`ఇ`బరాత్‌ పేరు చెప్పి అందరు ఎంఈవోల నుంచి ఆప్షనల్‌ హాలీడే అనుమతులు తీసుకున్నారు. అసలు ఇంతవరకు ఈ పేరే వినని ఉపాధ్యాయులకు ఈ సలహా ఎవరిచ్చుంటారు, అందరూ ఒకే పేరుతో ఆప్షనల్‌ హాలీడేకు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారన్నదే తేలడంలేదు. సాధారణంగా ఆప్షనల్‌ హాలీడే ఓ పండగ సందర్భంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ మతానికో, ఆ ప్రాంతానికో సంబంధించిన విద్యార్థులు 80 శాతం మంది ఉండాలి. కానీ షబ్‌`ఇ`బరాత్‌ అంటే ఏమిటని ఇక్కడ పెద్ద మసీదు అధ్యక్షుడ్ని అడిగితే, మనం చేసుకోని పండగ ఇదొకటని ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు. కనీసం పాఠశాలల్లో సాంఘిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు కూడా సెలవు వస్తుందంటే పండగ చేసుకున్నారు తప్ప ఇదేమిటని ప్రశ్నించలేదు. షబ్‌`ఇ`బరాత్‌ అంటే ‘క్షమారాత్రి’. ఇరాన్‌లో సమాధుల వద్దకు వెళ్లి ధూపాలు వేసి వచ్చే ఒక రాత్రి. చనిపోయినవారి ఆత్మలను గౌరవించే పండగ. ఈ క్షమారాత్రి మన గురువులకు క్షమాభిక్ష ప్రసాదించుగాక..!

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page