
ప్రజా సంక్షేమం పేరుతో అనుత్పాదక పథకాలకు వేల కోట్ల రూపాయలు మళ్లించడం వల్ల జరిగే చేటు ఏమిటో? అటువంటి నిర్ణయాల వల్ల ఎటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడుతుందన్నది ఇప్పటికే అనేక సందర్భాల్లో అను భవంలోకి వచ్చింది. అయినా పార్టీలు అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ పేద లకు నగదు బదిలీ పేరుతో అనేక రకాల సంక్షేమ పథకాలు తెస్తామని ఎన్నికల్లో వరాల వర్షం కురిపిసు ్తన్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఖజానాకు పెనుభారంగా మారిన ఆ వరాలను అమలు చేయలేక ఆపోసో పాలు పడుతున్నాయి. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేయడంతోపాటు అప్పుల పాల్జేసేస్తున్నాయి. దీనికి తాజా ఉదా హరణ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం. ప్రస్తుతం ఈ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఉంది. గత కొన్నేళ్లుగా కేంద్రం లోనూ, దేశంలోనూ మెజారిటీ రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయిన ఆ పార్టీ గ్యారెంటీ హామీల పేరుతో కొత్త ఎత్తుగ డలు వేసి ప్రజలను ఆకట్టుకుని వారి మద్దతును ఓట్ల రూపంలో కొల్లగొడుతోంది. ఈ వ్యూహాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోనే అమలు చేసి ఆ రాష్ట్రంలో పాగా వేసింది. 2022 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఏకంగా పది గ్యారెంటీలను ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 భృతి, ప్రతి గృహానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ స్కీం పునరుద్ధరణ తదితర హామీలు ఈ పది గ్యారెంటీల్లో ఉన్నాయి. వాటి ప్రభావంతో హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, అప్పులు పెరిగిపోవడంతో వేరే మార్గం లేక సుఖ్‌విందర్ సింగ్ సుక్కు నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు గతంలో తాము ఇచ్చిన హామీలకు, ఇతర సబ్సిడీ పథకాలకు కత్తెర వేసే పని మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు రాష్ట్రాన్ని దివాలా అంచున నిలబెట్టాయి. దేశంలో తలసరి రుణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి తలపై రూ.1.17 లక్షల అప్పు ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.86,589 కోట్లకు ఎగబాకాయి. ఒక చిన్న రాష్ట్రానికి ఇంత భారీ అప్పులు ఉండటం నిజంగా ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుల భారం పెరిగిపోవడంతో కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకుండాపోయింది. కేంద్రం కూడా కొత్త అప్పులపై ఆంక్షలు విధించింది. దాంతో ఖర్చులు తగ్గించడం, సంక్షేమ పథకాలకు ఇస్తున్న సబ్సిడీలను కట్ చేయడంపై ప్రభుత్వం అనివార్యంగా దృష్టి సారించాల్సి వస్తోంది. మంత్రుల జీతాల చెల్లింపులను రెండు నెలలు వాయిదా వేశారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాన్ని అమలు చేస్తే పుట్టి మునుగుతుందని భావించి కేవలం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే అది కూడా 125 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కుదించి సగం ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. ఉచిత తాగునీటి సరఫరా పథకానికి కూడా నీళ్లొదిలేసింది. మొత్తంగా 14 సంక్షేమ పథకాలకు ఇస్తున్న సబ్సిడీలను కోత పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొదలుపెట్టిన గ్యారెంటీ పథకాల వ్యూహం వర్కౌట్ కావడంతో ఆ తర్వాత జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములా అనుసరించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అవే చేదు అనుభ వాలు ఎదురవుతున్నాయి. గ్యారెంటీ పథకాల అమలు పెనుభారంగా మారడంతో కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ధరలు పెంచి ఖజానా నింపడానికి సిద్ధమైంది. గ్యారెంటీ పథకాలను పున:సమీక్షించాలని కాంగ్రెస్‌లోనే పలువురు డిమాండ్ చేస్తుండటం విశేషం. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గ్యారెంటీ హామీల పుణ్యాన తెలంగాణ ఏర్పాటైన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. పది నెలలు గడిచినా ఇంతవ రకు ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమని వేరే చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల ఇబ్బందుల సంగతి పక్కన పెడితే.. మూడు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే కూటమి కూడా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అయ్యింది. తాను కూడా సూపర్ సిక్స్ పేరుతో ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వాటిలో ఒకటైన సామాజిక పెన్షన్ల పెంపును అమల్లోకి తీసుకొచ్చింది. కానీ మిగతా పథకాల ఊసెత్తడంలేదు. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చినట్లే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ప్రతి ఇంటికి మూడు ఉచిత సిలెం డర్లు, 18`59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నెలకు రూ.1500 భృతి, నిరుద్యోగ భృతి వంటి గ్యారెంటీ హామీలు ఇచ్చినా ఇప్పటికీ వాటిని అమలు చేసేందుకు కనీసం గ్రౌండ్ వర్క్ కూడా చేపట్టడంలేదు. ‘ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం.. కానీ ఏం చేద్దామన్నా ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు’ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ మధ్య నిస్సహాయతను సూచించే వ్యాఖ్యలు చేశారు. ఈలోగా రాష్ట్రంలో వరదలు సంభవించి ఆర్థికంగా మరింత నష్టం వాటిల్లింది. సంక్షేమ పథకాల విషయంలో గత వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించిన ఎన్డీయే కూటమి.. ఎన్నికల్లో మాత్రం అధికారం కోసం దానికి మించి అన్నట్లు సూపర్‌సిక్స్ ప్రకటించింది. చిత్రమేమిటంటే సబ్సిడీ, సంక్షేమ పథకాలకు వ్యతిరేకమని చెప్పుకొనే బీజేపీ కూడా ఏపీకి వచ్చేసరికి వాటికే జైకొట్టింది.
Comments