top of page

సిగడాం టు వైజాగ్..ఒక స్కామర్ వేట!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 10
  • 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురం గ్రామం చెందిన తమ్మినేని సురేష్ కుమార్.. ఇదొక పేరు కాదు, నిరుద్యోగుల పాలిట ఒక పీడకల. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టినా అతని బుద్ధి మారలేదు. ‘ఖైదీ నంబర్ ’ ట్యాగ్ పోయినా, మోసం చేయాలనే అతని ప్రవృత్తి మాత్రం పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వైజాగ్‌లో ఇతగాడు చేసిన వంచనలకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ, పోలీస్ స్టేషన్ బెయిల్ కాగితాల కంటే, అమాయకుల నమ్మకమే పెట్టుబడిగా సురేష్ తన రూట్ మార్చాడు. ఈసారి అతని కన్ను కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకంపై పడింది.

రూ. 25 లక్షల లోన్ ఎర

ఈ ఏడాది ఫిబ్రవరి. ప్రధాన మంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద రూ.25 లక్షల సబ్సిడీ రుణం మంజూరు చేయిస్తానంటూ సురేష్ సరికొత్త వల విసిరాడు. ఈ వలలో చిక్కింది ఆరుగురు నిరుద్యోగులు. లోన్ కావాలంటే ముందే ‘కమిషన్ ’ ఇవ్వాలి. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష చొప్పున ఒప్పందం. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా, అత్యంత రహస్యంగా ఆరుగురి నుంచి రూ. 6 లక్షల అడ్వాన్స్ మొత్తాన్ని నొక్కేశాడు. బాధితుల్లో ధవళపేటకు చెందిన బి.రమేష్‌కుమార్, ఆనందపురం వాసి పి.రామచంద్రరావు, శ్రీకాకుళానికి చెందిన నర్సింగరావుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. డబ్బులు చేతికి చిక్కగానే సురేష్ తన ‘మిస్సింగ్ గేమ్ ’ మొదలుపెట్టాడు.

డిజిటల్ ట్రాక్స్ & మాయం

కొన్ని నెలలు ‘టైం పడుతుంది’ అంటూ కాలయాపన చేసిన సురేష్, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. బాధితుడు రమేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఫిబ్రవరి 13న రూ.50వేలు ఫోన్ పే ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న సురేష్, మిగిలిన రూ.50 వేలను రెండు విడతలుగా (రూ.30 వేలు, రూ.20 వేలు) నగదు రూపంలో చేతికి తీసేసుకున్నాడు. డిజిటల్ ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే నగదుకు ప్రాధాన్యత ఇచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

బయటపడ్డ చిట్టా!

డబ్బులు ఇచ్చి మోసపోయామని గ్రహించిన మిగతా ఐదుగురు బాధితులు సురేష్ కోసం వజ్రపుకొత్తూరు మండలం మహదేవపురం గ్రామానికి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఊరిలో అడుగుపెట్టగానే సురేష్ చేసిన పాత మోసాల చిట్టా, కథలు కథలుగా బయటపడింది. ప్రస్తుతం అతను వైజాగ్‌లో మకాం మార్చి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని సమాచారం అందింది .

పోలీస్ యాక్షన్ వర్సెస్ బాధితుల వేట

ప్రస్తుతం ఈ కేసు రెండు వైపులా రసవత్తరంగా మారింది. లీగల్ ప్రాసెస్ కంటే.. సురేష్ తమ చేతికి చిక్కితేనే వసూలు సులువవుతుందనే ప్లాన్‌తో బాధితులంతా ఒక బృందంగా ఏర్పడి వైజాగ్‌లో సురేష్ అడ్డాల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1న రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పొందూరు, జి.సిగడాం పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ తల్లిదండ్రులను విచారించి, అతని రహస్య స్థావరాల సమాచారాన్ని, కాల్ డేటాను సేకరిస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్న సురేష్ కుమార్ కోసం అటు పోలీసులు, ఇటు బాధితులు ఏకకాలంలో వేట కొనసాగిస్తున్నారు. ఈ ‘పిల్లి ` ఎలుక’ ఆటలో ‘మాయగాడు’ పోలీసులకు దొరుకుతాడా? లేక బాధితుల చేతికి చిక్కి బుద్ధి తెచ్చుకుంటాడా? అనేది చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page