
బాధాకరం.. సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకుపోతున్న ఫోటో బాధాకరం.. ఆమెకు ఏమైంది..? ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చెప్పలేని దుస్థితి.. (ఈ పోటో పబ్లిష్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు)
కల్పనా రాఘవేందర్.. శాస్త్రీయ సంగీతంలో మంచి విద్వత్తు ఆమె సొంతం.. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచీ శిక్షణ, సాధన.. గాన రాక్షసి అంటారు అందరూ.. అంటే ఏదైనా అలవోకగా పాడగలదు.
ఆమె తండ్రి రాఘవేందర్ ఓ గాయకుడు, తల్లి సులోచన గాయకురాలు.. చిన్నతనం నుంచీ ఆమె స్టూడియోలు తిరుగుతూనే పెరిగింది. ఎంసీఏ చేసింది.. ఆమె నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా..
కష్టమైన పాట పాడాలంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఆమెనే ఎంచుకునేవారు. 3వేల వరకూ సినిమా పాటలు పాడిరది. స్టేజీ షోలకు లెక్కే లేదు. వ్యక్తిగత జీవితంలో చాలా విషాదం.
బరువు బాగా పెరిగింది, లావుగా ఉండేది. భర్తతో పడలేదు, విడాకులు.. ఒక కూతురు.. ఒంటరిగా కూతురితో ఉండేది.. బరువు తగ్గే సర్జరీలు గట్రా ఏమీ లేకుండా యోగా, డైట్, ఎక్సర్‌సైజులతో బరువు తగ్గించుకుంది. లైఫ్ చాలెంజింగుగా తీసుకుంది.
ఆమధ్య మరో వివాదం.. తను అటూఇటూ తిరుగుతోంది కాబట్టి కూతుర్ని మరీ దగ్గరి బంధువుల దగ్గర ఉంచింది.. అక్కడ లైంగిక వేధింపులు.. కేసు కూడా పెట్టినట్టుంది.. కొన్నాళ్లు ఎక్కడా కనపించలేదు.
ఈమధ్యే మళ్లీ కొన్ని షోలలో కనిపిస్తోంది. గతంలో తెలుగు బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆమె బతుకులో విద్వత్తు ఎంతో విషాదమూ అంతే.. అందరితో కలివిడిగా, జోవియల్‌గా ఉండే ఆమె అంటే అందరికీ అభిమానమే..
వర్తమానంలోకి వస్తే.. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందట. భర్తతో కలిసి ఉంటున్నట్టు అని రాస్తున్నాయి వాట్సప్ న్యూస్ గ్రూపులు.. ప్లస్ మెయిన్ సైట్లు కూడా.. రెండు రోజులుగా ఆమె బయటికి రాకపోవడంతో అసోసియేషన్ భర్తకు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫోన్ చేసిందట.
తీరా తలుపులు బలవంతంగా తెరిచి చూస్తే ఆమె అపస్మారక స్థితిలో ఉంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని భావిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్సలో ఉంది ఇప్పుడు.. నువ్వు కోలుకోవాలమ్మా, మరిన్ని మంచి పాటల్ని ఆలపించాలి.
తన భర్త అంటున్నారు, ఆమె మళ్లీ పెళ్లి చేసుకుందా..? తెలియదు..! చెన్నై నుంచి భర్త బయల్దేరాడని వార్త.. అసలు రెండు రోజుల నుంచీ ఆమె అలాగే పడిఉంటే పలకరించి, ఏమైందని కనుక్కునే పరిస్థితి లేకపోవడం దయనీయమే.. భర్తను కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు.
ప్చ్.. అద్భుతమైన గానప్రతిభ ఉన్న ఆమె వ్యక్తిగత జీవితం మొదటి నుంచీ విషాదమే.. చివరకు ఇప్పటి స్థితి దాకా.. ట్రాజెడీ.., విషింగ్ హర్ స్పీడీ రికవరీ!!
ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది!
సై విశ్వేష్
‘‘ఆమె గానం వినిపించింది.. కానీ, ఆమె బాధను వినలేకపోయాం!’’
‘‘పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను.’’
‘‘నా గళం వినిపిస్తేనే నేను బతికున్నట్లుగా ఉంటుంది.’’
ఇవి గాయని కల్పన గారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు. కానీ, ఈసారి ఆమె మౌనంగా నిద్రమాత్రలు మింగింది!
ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది!
ఈ వార్త విన్న వెంటనే మనందరం షాక్ అయ్యాం.
‘‘ఎందుకు ఇలా చేసుకుంది?’’
‘‘ఆమెకేమైనా పెద్ద సమస్య ఉందా?’’
‘‘పాపం, ఎవరైనా తనను ఆదరించాల్సింది!’’
కానీ, ఇది ఒక్క కల్పన గారి కథ కాదు.
రోజురోజుకూ వేలాదిమంది మన చుట్టూ నిశ్శబ్దంగా కరిగిపోతున్నారు!
వారి మనస్సులో పోరాటం జరుగుతోంది.. కానీ, మనం చూసేలా లేదు!
చాలామంది మనుషులు బయటకు చిరునవ్వుతో కనిపిస్తూ లోపల నరకయాతన అనుభవిస్తూ ఉంటారు.
‘‘నీకు అన్ని ఉన్నాయిగా.. నీకెందుకు డిప్రెషన్?’’ అని అడిగే సమాజమే..
తీవ్రమైన ఒత్తిడి, ఒంటరితనం ఏంటో అర్థం చేసుకోదు.
‘‘సహాయం కోరే ధైర్యం లేకపోతే, సహాయం చేసేవారైనా ముందుకు రావాలి!’’
ఆత్మహత్య అనేది ఒకరోజు తీసుకునే నిర్ణయం కాదు.
ఎంతో కాలంగా నిండిపోతున్న భావోద్వేగ భారం ఒక్క క్షణంలో పేలిపోతుంది.
ఎవరైనా మన చుట్టూ మౌనంగా ఉంటే, వారిని వెంటనే గుర్తించాలి.
పరిస్థితిని మార్చే 3 మేజిక్ స్టెప్స్
వినండి : ఎవరైనా బాధలో ఉంటే, వారికి ‘‘నువ్వు ఒంటరివి కావు’’ అనే నమ్మకం ఇవ్వండి.
అంగీకరించండి : ‘‘ఇలా అనిపించడం సహజమే’’ అని చెప్పండి, ‘‘నీకు ఏమైంది?’’ అని కాకుండా, ‘‘నీకు తోడుగా నేనున్నాను’’ అని చెప్పండి.
సహాయం అందించండి : అవసరమైతే, ప్రొఫెషనల్ కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు, స్నేహితుల ఆత్మీయత ఇవ్వండి.
అండగా నిలుద్దాం!
మన చుట్టూ ఉన్న వాళ్లు హఠాత్తుగా చాలా మౌనంగా ఉంటే.. సామాజిక మాధ్యమాల్లో ‘‘ఇంకెందుకు బతకాలి?’’ లాంటి పోస్ట్ పెడితే.. ఎప్పుడూ సరదాగా ఉండే వాళ్లు ఒక్కసారిగా మారిపోతే ‘‘ఎవరికీ నేను అవసరం లేదు’’ అనే మాట మాట్లాడితే.. వెంటనే వారితో మాట్లాడండి. తక్షణ మానసిక సహాయం అందించండి..
Comments