
మనదేశంలో వివాహ వ్యవస్థకు ఉన్నంత భద్రత, గౌరవం మరే వ్యవస్థకూ లేదనడం అతిశయోక్తి కాదు. వివాహంతో ఒక్కటైన జంటలకు సమాజంతో పాటు గ్రామ, కుటుంబ పెద్దలు రక్షణగా నిలుస్తుంటారు. అలాగే కోర్టులు, ప్రభుత్వాలు కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తుంటాయి. పెళ్లయిన ఒక జంట విడిపోవాలనుకున్న ప్పుడు దానికి వారు చెప్పే కారణాలను పరిశీలించి సమంజసమేనని అనిపిస్తేనే న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేస్తాయి. అదే సమయంలో భర్త నుంచి విడిపోతున్న మహిళకు, వారి పిల్లలకు సంరక్షణ, ఆస్తుల విషయంలోనూ న్యాయబద్ధమైన పరిష్కారం చూపిస్తుంటాయి. ఇన్ని రకాల రక్షణ కవచాలు ఉన్నప్పటికీ వివాహ వ్యవస్థను కాదని చాలామంది సహజీవనం వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్నే లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటు న్నారు. అయితే వివాహం ద్వారా దంపతులైన జంటలకు సంఘంలోనూ, చట్టపరంగానూ లభించే రక్షణ సహ జీవన వ్యవస్థలో ఉండేవారికి, వారి సంతానానికి లభిస్తాయా? సమాజంలో వారి పిల్లలకు లభించే స్టేటస్ ఎలా ఉంటుందన్న సందేహాలు కూడా ఉండటం సహజం. వివాహం చేసుకున్నవారికి మాదిరిగానే సహజీవన వ్యవస్థ కు కొన్ని రకాల రక్షణ చట్టపరంగానే లభిస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పెళ్లి కాకుండా ఆడామగా కలిసి జీవించడాన్ని.. అంటే సహజీవనం చేయడాన్ని ఒకప్పుడు సంఘవ్యతిరేక చర్యగా పరిగణించేవారు. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సహజీవనం కామన్ అయిపోతోంది. పెళ్లి చేసుకునే కంటే చేసుకోకుం డానే కలిసి ఉండటానికే ఆధునిక యువతీయువకులు ఇష్టపడుతున్నారు. వాస్తవానికి ఇది పాశ్చాత్య సంస్కృతి. అక్కడి నుంచే మన దేశంలోకి దిగుమతి అయ్యి.. క్రమంగా మహానగరాలు, పట్టణాలకు.. ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. పెళ్లి కాకుండానే కాపురం ఏంటి? అని ఆక్షేపించే పరిస్థితి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతో తొలగిపోయింది. ఇతరుల స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, సహజీవనం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం. పెద్దల సమక్షంలో సవాలక్ష ఒప్పందాలతో జరిగిన పెళ్లిళ్లే కొన్నాళ్లకు పెటాకులైపోతున్నాయి. దాంతో పెళ్లి పేరుతో చేసిన భారీ ఖర్చులు వృథా అవుతున్నాయన్న భావన పెరుగుతోంది. దాంతో వివాహం కంటే సహజీవనమే బెటర్ అన్న భావన యువజనంలో పెరుగుతోందంటున్నారు. చట్టప్రకారం 21 ఏళ్లు నిండిన పురుషుడు, 18 ఏళ్లు నిండిన యువతి తమ ఇష్టప్రకారం సహజీవనం చేయవచ్చు. అదే విధంగా భార్యను కోల్పోయిన భర్త, భర్తను కోల్పో యిన భార్య పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చు. అయితే వివాహ బంధంలో ఉన్న పురుషులు గానీ, స్త్రీలు గానీ వేరొకరితో అవాంఛిత సంబంధం పెట్టుకుంటే అది సహజీవనం కిందకు రాదు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం`1955 ప్రకారం దేశంలో ప్రతిఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రత కల్పిస్తోంది. సహ జీవనం చేసే వారికి కూడా ఇవే వర్తిస్తాయి. అయితే దీనికి కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఇద్దరూ కలిసి ఉంటున్నట్లు వారు అద్దెకుంటున్న ఇంటి ఓనరు లేదా ఇరుగుపొరుగువారు లేదా తాము పరస్పర అంగీ కారంతో కలిసి ఉంటున్నట్లు స్వయంగా ఆ జంట అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసే రేషన్ కార్డు, ఆధార్ కార్డుల్లోనైనా వారిద్దరి పేర్లు ఉన్నా సరిపోతుంది. అప్పుడే సహజీవన జంట మధ్య ఏదైనా గొడవ జరిగితే చట్టపరమైన రక్షణ పొందేందుకు, పరిష్కారం కోరేందుకు అవకాశం ఉంటుంది. సహ జీవన జంటలకు గృహహింస చట్టం కింద కూడా రక్షణ లభిస్తుంది. వేధింపుల నుంచి రక్షణ, ఇతరత్రా న్యాయ సహాయం పొందేందుకు సహజీవనంలో ఉన్న మహిళలకు వెసులుబాటు ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్` 1973లోని సెక్షన్ 125(1)(ఏ) ప్రకారం వివాహం ద్వారా దంపతులైనవారికి ఎంత రక్షణ లభిస్తుందో లివ్ ఇన్ రిలేషన్‌షిప్పులో ఉన్నవారికి కూడా అంతే రక్షణ లభిస్తుంది. వారి జీవనం గడవడానికి కూడా ఖర్చులు పొందేందుకు అర్హత ఉంటుంది. ఇటీవలి కాలంలో శాసన, న్యాయ వ్యవస్థలు సహజీవన వ్యవస్థకు హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆమోదించిన యూనిఫారం సివిల్ కోడ్ ప్రకా రం రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు తమ బంధాన్ని ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనివల్ల వీరికి చట్టపర మైన హక్కులు, ఆస్తుల్లో వాటాలపై హక్కులు లభిస్తాయి. అలాగే ఈ జంటలకు పుట్టే పిల్లలకు కూడా హక్కులు వర్తిస్తాయి. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్న జంటలకు కలిగే సంతానం వివక్షకు గురికాకూడదని ఇటీవలి కాలంలో కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నాయి. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం కూడా ఈ పిల్లల హక్కులకు రక్షణ లభిస్తుంది. ఒకవేళ పిల్లల విషయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే వారు తమ జంటకే పుట్టినట్లు వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మన సమాజం ఇంకా పూర్తిస్థాయిలో సహజీవనాన్ని ఆమో దించే పరిస్థితి లేకపోయినా సామాజిక కట్టుబాట్లు ఇబ్బంది పెట్టకుండా, మిగతా వారిలా గౌరవంగా జీవించ గలిగే పరిస్థితిని న్యాయస్థానాలు, చట్టాలు పౌరులకు కల్పిస్తున్నాయి. అయితే వైవాహిక జంటలతో పోలిస్తే సహ జీవన జంటల విషయంలో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కూడా ఉన్నాయి. పెళ్లి కాకుండా సహజీవనం చేసే జంటల్లో స్వేచ్ఛ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది వారు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పిస్తున్నా.. అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు పుటుక్కున తమ బంధం తెంచేసుకునే ప్రమాదం కూడా ఉంది. వివాహమైన దంపతులు విడిపోవడం చాలా కష్టం. దానికి చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క మాటతో విడిపోవచ్చు. అందువల్ల సహజీవనానికి స్థిరత్వం లేనట్లే.
Comments