ఆయకట్టుకు నీరందక రైతులు ఆందోళన
నారాయణపురం కాలువకు గుర్రపుడెక్క సమస్య
రైతులు శ్రమదానం చేసినా ఫలితం శూన్యం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల మండలంలోని 13 గ్రామాల పరిధిలో నారాయణపురం కుడికాలువ ద్వారా సాగునీరు అందించాలని గత నెలలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతులు కలిసి గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. అంతకు ముందు కూటమి నాయకులు రైతులతో కలిసి కలెక్టర్‌కు విన్నవించారు. ఆగస్టు నెలలో నిర్వహించిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో నారాయణపురం కుడికాలువ ఆయకట్టుకు నీరందడం లేదని జెడ్పీటీసీ, ఎంపీపీలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈశ్వరరావు నారాయణపురం కుడికాలువను సందర్శించి గుర్రపుడెక్క తొలగిస్తామని హమీ ఇచ్చారు. కలెక్టర్ ప్రత్యేక నిధులు విడుదల చేసి కొంతమేర గుర్రపుడెక్కను తొలగించారు. అయినా సమస్యకు పరిష్కారం కాలేదు. 50 కిలోమీటర్ల నారాయణపురం కుడికాలువ కింద సుమారు 36వేల ఎకరాలు సాగవుతుంది. సంతకవిటి మండలం వాసుదేవపట్నం వద్ద ప్రారంభమయ్యే కుడి కాలువ ఎచ్చెర్ల మండలం భగీరథపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. కాలువ కింద సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాలకు చెందిన ఆయకట్టుకు నీరందిస్తుంది. నారాయణపురం కాలువకు గుర్రపుడెక్క సమస్య వెంటాడుతుంది. సకాలంలో నీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు శ్రమదానం చేసినా ఫలితం కనిపించడం లేదు.
13 గ్రామాలకు నీరందలేదు
కాలువపై 60 షట్టర్లు ఉన్నాయి. ఇందులో కేవలం మూడు షట్టర్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగతా 57 షట్టర్లు ఎత్తడానికి, దించడానికి అవసరమైన రెంచీలు లేక కొన్ని ఎత్తి ఉంచగా, మరికొన్ని దించేసి పెట్టేశారు. కొన్నిచోట్ల షట్టర్లను ఎత్తుకెళ్లిపోయారు. కాలువలో నీరు ఉన్నా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు అరకొర నీరందింది. సకాలంలో వర్షాలు కురవడంతో గత ఏడాది రైతులు గట్టెక్కిపోయారు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు నారాయణపురం కాలువ నుంచి పూర్తిస్థాయిలో నీరందలేదు. దీనికి కారణం కాలువలో గుర్రపుడెక్క ఉండడం. గుర్రపుడెక్క తొలగించడానికి కలెక్టర్ ప్రత్యేక నిధులు మంజూరుచేసినా పూర్తి స్థాయిలో తొలగించలేదు. దీంతో కాలువలో నీరున్నా గుర్రపుడెక్క కారణంగా ఎచ్చెర్ల పరిధిలో సుమారు 10వేల ఎకరాలకు నీరందలేదు. ఎచ్చెర్లలోని ఫరీద్‌పేట మొదలు ఇబ్రహీంబాద్, తమ్మినాయుడుపేట, సనపలవానిపేట, పూడివలస, కుశాలపురం, కొత్తపేట, పొన్నాడ, ధర్మవరం, బొంతలకోడూరు, తుమ్మపేట, తోటపాలెం, ముద్దాడపేట ఆయకట్టు భూములకు ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు రైతులు నానా యాతన పడుతున్నారు.
కాలువలో నీరున్నా..
శుక్రవారం కుశాలపురం, ఇబ్రహీంబాద్‌కు చెందిన పైడి సాంబమూర్తి, సనపల నారాయణరావు, అన్నంనాయుడు ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు మల్లయ్యపేట, తుంగపేట, బోరవానిపేట వద్ద కాలువలపై ఉన్న ఖానాల వద్ద పేరుకుపోయినా గుర్రపుడెక్కను శ్రమదానం చేసి తొలగించారు. అయినా నీరు అందే పరిస్థితి లేదు. యంత్రాల సాయంతో తొలగించాల్సిన గుర్రపు డెక్కను మాన్యువల్‌గా తొలగించడం సాధ్యం కాకపోవడంతో రైతులంతా వెనుదిరిగారు. ఈ ప్రాంతంలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నా ఎవరూ దీనిపై దృష్టిపెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల నీరు వృధాగా పోతున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల షట్టర్లు ఉన్నా, వాటిని ఆపరేట్ చేయడానికి రెంచీలు లేకపోవడంతో నీరు వృధాగా పోతుందని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీరు ఆయకట్టు శివారు ప్రాంతానికి అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి గుర్రపుడెక్క సమస్యను అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక నిధులు విడుదల చేసినా వాటిని పూర్తిస్థాయిలో గుర్రపుడెక్క తొలగించడానికి వినియోగించలేదని ఆరోపణలున్నాయి. ఖరీఫ్ చివరి దశలోకి వచ్చినా సాగునీరందనందున ఉబాలు ఎండిపోయాయని రైతులు చెబుతున్నారు.
Comments