జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో నాన్‌లోకల్ సభ్యులు
పక్కరాష్ట్ర క్రీడాకారులతో ప్రాబబుల్స్
జిల్లా క్రీడాకారులకు స్టాండ్‌బై పొజిషన్
పైసలిస్తేనే కెప్టెన్సీ
జీరో పెర్‌ఫార్మర్లకు జట్టులో స్థానం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

గత ఏడాది అండర్`19 జట్టుకు కెప్టెన్సీ నుంచి సీనియర్ క్రీడాకారుడు పూర్ణచంద్రను తప్పించి శ్రీరాంకు అప్పగించారు. ఈ ఏడాది రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుడిని తప్పించి జూనియర్ క్రీడాకారుడు పి.సాయికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
అండర్`16, 14లో రాష్ట్రజట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీహెచ్ రోహిత్‌ను తప్పించి హైదరాబాద్‌కు చెందిన వీఎస్‌వీ ప్రణీత్‌ను జిల్లా జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
విశాఖలో ఒక కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన యజమాని కుమారుడు అభయ్ గత ఏడాది విశాఖ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది అండర్`19, 23 జిల్లా జట్టులకు ప్రాతినిధ్యం వహించారు.
జిల్లా అండర్`23 జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిని పక్కన పెట్టి హైదరాబాద్‌కు చెందిన ఆవుల రిషికేశ్, రాజ్‌కుమార్, రవీంద్రలను ఎంపిక చేశారు.
జెంటిల్మెన్ క్రీడగా పిలవబడే క్రికెట్‌కు జిల్లాలో గడ్డుకాలం నడుస్తుంది. జిల్లా క్రికెట్ సంఘం అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలకు ఈ ఉదాహరణలు గట్టి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీన్ని ఖండిరచడానికి జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే.. ఇప్పుడు దేశంలో ఆటంటే క్రికెట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ క్రికెట్ ఆట మాత్రమే కాదు.. ఒక మతం. అందుకే ఇక్కడ సచిన్ లాంటి క్రీడాకారుడు దేవుడయ్యాడు. మరేముంది? దేవుడు, మతం ఉన్నచోట డబ్బులకు ఏమాత్రం కొదవ ఉండదు. అయితే అది ఏ రూపంలో వస్తుందనేదే ఇక్కడ చర్చించాల్సిన విషయం.
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కేటగిరీల్లో క్రీడాకారుల ఎంపికలో చేతివాటం చూపించి నైపుణ్యం కలిగినవారిని పక్కన పెట్టి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తీసుకువచ్చి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహింపజేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే జిల్లా క్రీడాకారులను కాదని జిల్లా క్రికెట్ సంఘం పాలక వర్గానికి ముడుపులు ఇచ్చేవారికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 7న క్రీడాకారుల పేరెంట్స్ సంఘం జిల్లా క్రికెట్ జట్టుకు ప్రోపబుల్స్ ఎంపిక విధానం, సీనియర్లను పక్కన పెట్టడం, కోచ్‌లు లేకుండా ప్రాక్టీస్ సెషన్ నిర్వహించడం, సెలక్టర్లు, మేనేజర్ల పేరుతో పాలకవర్గం ప్రతినిధులు ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జిల్లా క్రికెట్ సంఘానికి ఒక లేఖ రాయడం గమనార్హం. అయినా మార్పు రాలేదు.
ఇలాంటి ఆరోపణలతోనే జిల్లా క్రికెట్ సంఘం కార్యకలాపాలు 2014కు ముందు నిలిచిపోయాయి. రాజకీయ నాయకుల జోక్యంతో వివాదం న్యాయస్థానాల్లో సుమారు పదేళ్లు నడిచింది. 2019 ఏసీఏ నియమించిన అంబుడ్స్‌మేన్ ద్వారా జిల్లా క్రికెట్ సంఘం మనుగడలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘం కార్యకలాపాలు సాగిస్తున్న నాటి నుంచి చోటుచేసుకున్న అవినీతిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఏపీ సీబీసీఐడీకి ఫిర్యాదులు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఏసీఏ నుంచి వచ్చిన నిధులు స్వాహా, జట్టు ఎంపికల కోసం క్రీడాకారుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిసింది. వైకాపా ప్రజాప్రతినిధులను అడ్డంపెట్టుకొని క్రికెట్ సంఘం ప్రతినిధుల వ్యక్తిగత ఖాతాల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వడానికి వివిధ మార్గాల ద్వారా క్రీడాకారులు రూ.లక్షల్లో జమ చేశారనే ఆరోపణలపై విచారణ చేయాలని మంత్రులను కోరినట్టు తెలిసింది.
అనేక చిక్కుముడులు, కోర్టు కేసులు ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శిగా రిటైర్డ్ ఏఎస్పీ దివంగత మీర్ మహమ్మద్ మనుమడు గుంటూరు వాసి హసన్‌రాజా షేక్‌కు పగ్గాలు అప్పగించారు. అలాగే జిల్లా అధ్యక్షులుగా కూడా వేరే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న పుల్లెల వైఎన్ శాస్త్రిని నియమించారు. మీర్ మహమ్మద్ కుమారుడు ఇలియాస్ జిల్లా క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు క్రికెట్ క్రీడతో సంబంధం లేని మరో నలుగురిని కార్యవర్గంలో వివిధ హోదాల్లో కూర్చోబెట్టారు. వైకాపా నాయకుల అండదండలు కార్యవర్గంపై ఉండడంతో వారు చెప్పిన వారినే ప్రోపబుల్స్‌గా ఎంపిక చేయడం, అందినకాడికి దండుకోవడం ప్రారంభించారనే ఫిర్యాదులు వెళ్లాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతి ఏడాది మంజూరు నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కంటే దాన్ని నడిపిస్తున్న వ్యక్తుల అభివృద్ధి మాత్రం దినదిన ప్రవర్ధమానం చెందిందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా క్రికెట్ జట్టులో జిల్లా క్రీడాకారులకు చోటుకల్పించకుండా విశాఖ, హైదరాబాద్, విజయవాడకు చెందిన క్రీడాకారులను ఎంపికచేస్తూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అండర్ 14, 16, 19, 23 జట్టులో ఒకరిద్దరు ఇతర జిల్లాల క్రీడాకారులకు చోటు కల్పించి జిల్లా క్రీడాకారులను స్టాండ్‌బైగా ఎంపిక చేస్తున్నారని జిల్లా క్రికెట్ సంఘంపై ఆరోపణలు ఉన్నాయి.
ప్రోపబుల్స్ ఎంపికలో సెలెక్టర్లుగా క్రికెట్ సంఘం మేనేజర్‌లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. ఎంపిక ప్రక్రియ పూర్తిచేసిన కొన్ని రోజుల వరకు ప్రోపబుల్స్‌ను ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. జట్టు ఎంపిక పోటీలకు హాజరు కానివారు, ఫెర్‌ఫార్మెన్స్ లేనివారిని ప్రోపబుల్స్ జాబితాలో చేర్చుతున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.
క్రీడాకారుల ఎంపికలకు సెలక్టర్లుగా గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారిని నియమిస్తున్నారు. స్పోర్ట్స్‌కోటాలో రైల్వేలో ఉద్యోగం పొందిన విశాఖకు చెందిన వ్యక్తిని సెలక్టర్‌గా జిల్లా క్రికెట్ సంఘం ప్రతిసారి నియమిస్తుంది. ఈ ఉద్యోగి గతంలో మహిళా జట్టు ఎంపికల విషయంలో అవినీతికి పాల్పడి బుక్కయ్యారు. ఇటీవల విశాఖకు చెందిన ఒక క్రీడాకారుడిని శ్రీకాకుళం జిల్లా జట్టుకు ఎంపిక చేయిస్తానని చెప్పి భారీగా డబ్బులు తీసుకొని మోసం చేశాడని సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియలో సబ్ స్టాండర్డ్ కోచ్‌లు పాల్గొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Comments