మరింత పెరిగే అవకాశం
గత ఏడాదితో పోల్చితే 50 శాతం అదనం
స్థానిక పంట మరో నెలలో మార్కెట్‌లోకి
సలసలా కాగుతున్న వంటనూనె
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్రంలో టమోటా ధర సెంచరీకి చేరువైంది. ఈ నెల ఒకటి.. అంటే సోమవారం నాటికి కేజీ టమోటా ధర రైతుబజారులో రూ.50 ఉండగా, గురువారం రూ.60కి చేరింది. బహిరంగ మార్కెట్‌లో టమోటా కిలో రూ.100 పలుకుతోంది. ఈ ఏడాది టమోటా ధర మూడోసారి సెంచరీ దాటడం విశేషం. జూన్, జూలై నెలల్లో టమోటా ధర బహిరంగ మార్కెట్‌లో రూ.110కి చేరింది. గత ఏడాది అక్టోబర్ 3 నాటికి రైతుబజారులో కేజీ టమోటా రూ.18 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.24కు విక్రయిస్తుండేవారు. ఈ ఏడాది ప్రస్తుతం రూ.100కు చేరవై మరింత ధర పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు టమోటా ధరలు అదుపులోకి రావని చెబుతున్నారు. స్థానికంగా పండిస్తున్న టమోటా మార్కెట్‌లోకి రావడానికి మరో నెల రోజులు పడుతుందంటున్నారు. ఈ నెల శుభకార్యాలకు అనువైన రోజులు ఉండడం, భవానీ, అయ్యప్ప మాలాధారణలు ముమ్మరం కావడంతో కూరగాయల్లో ప్రధానమైన టమోటా మరింత గిరాకీ పెరగనుందని వ్యాపారులు చెబుతున్నారు. రైతుబజార్లో ప్రస్తుతం టమోటా ధర రోజుకు రూ.10 చొప్పున పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ధర పెంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే రైతుబజార్లో తక్కువ ధరకు కూరగాయాలు, టమోటా విక్రయించాలి. బహిరంగ మర్కెట్‌లో ధరలను అంచనా వేసి రైతుబజారులో ధరలు నిర్థారించాలి. టమోటా విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాలు తప్పుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
దిగుబడి తగ్గడమే...
గురువారం టమోటాలను రైతుబజార్లో విక్రయించడానికి 25 కేజీల కేట్‌ను రూ.1550కి కొనుగోలు చేశారు. మొత్తం 30 కేట్‌లను కొనుగోలు చేసి రైతుబజార్లో రూ.60కి విక్రయించారు. రైతుబజార్‌కు వచ్చిన రెండు గంటల్లోనే అమ్ముడైపోయాయి. ధరలు పెరిగితే టమోటాను విక్రయించడానికి రైతులెవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే గురువారం 25 కేజీల కేట్‌ను రూ.1550కి అంటే ఒక కేజీని రూ.62కు కొనుగోలు చేసిన మార్కెటింగ్ అధికారులు వాటిని రూ.60కి విక్రయించారు. ఒక కేట్‌లో రద్దు పోను నికరంగా 24 కేజీలు మాత్రమే విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన కేజీపై వ్యాపారులు రవాణా ఛార్జీలతో కలిపి రూ.5వరకు నష్టపోతారు. దీంతో రైతుబజార్‌లో రైతులు, వ్యాపారులు ధరలు పెరిగిన టమోటా, ఉల్లి బంగాళాదుంపలు వంటివాటిని విక్రయించారు. మార్కెటింగ్ అధికారులే ప్రత్యేక కౌంటర్ పెట్టి నష్టపోతున్న డబ్బులను రీయంబర్స్ చేసి రైతులు, వ్యాపారులతో విక్రయించే ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా టమోటా పంట అందుబాటులో రాలేదు. మరో నెల రోజుల సమయం పడుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నాటకలోనూ టమోటా పంట దిగుబడి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి మదనపల్లి, పలమనేరు మార్కెట్‌కు వచ్చే టమోటాలను సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో అవసరాల మేరకు దిగుమతి చేసుకోవడానికి ఆశించిన స్థాయిలో దేశంలో టమోటా పంట దిగుబడి గణనీయంగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా..
అన్ని రాష్ట్రాల్లోనూ టమోటా ధర ఆందోళన కలిగించే స్థాయికి చేరుతుంది. దీంతో దేశ వ్యాప్తంగా టమోటా ధరలు పెరిగాయి. గత నెల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణంతో టమోటా పంట పూర్తిగా దెబ్బతింది. దిగుబడి గణనీయంగా తగ్గి డిమాండ్ పెరిగింది. దీంతో టమోటా ధర రోజురోజుకు పైపైకి ఎగబాకుతోంది. గత ఏడాది జూలై 12న మదనపల్లి మార్కెట్‌లో క్వింటా టమోటా ధర రూ.16వేలు పలికింది. అంటే హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో ధర రూ.160 అన్నమాట. ఆ సమయానికి జిల్లాలో రైతుబజారులో సాధరణ రకం రూ.100 పలికింది. ఈ ఏడాది జూలై 11న క్వింటాల్ టమోటా ధర రూ.500`750 పలికింది. ఆ లెక్కన మదనపల్లిలో కేజీ రూ.5 నుంచి 7.50 పడిరది. శ్రీకాకుళం రైతుబజార్లో రూ.44కు విక్రయించారు. గురువారం నాటికి మదనపల్లిలో క్వింటా టమోటా ధర గ్రేడ్‌ను బట్టి రూ.1200 నుంచి రూ.1950 పలికింది. ఈ లెక్కన మదనపల్లిలోనే టమోటా కిలో రూ.12 నుంచి రూ.19.50 పడిరది. ఈ నెల ఒకటిన మదనపల్లిలో క్వింటాల్ టమోటా రూ.450 నుంచి రూ.790 పలికింది. అన్ని రకాల పన్నులు, రవాణాతో కలిపి జిల్లాకు వచ్చేసరికి వ్యాపారి లాభంతో కలుపుకొని జిల్లాలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని రైతుబజారులో రూ.60కి విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.
వంటనూనెపై సుంకం
ఈ ధరలకు ఊతమిచ్చేలా వంటనూనె ధరలపై కేంద్రం సుంకం పెంచడంతో కేజీపై రూ.20 నుంచి 30 వరకు పెరిగాయి. ముడి పామాయిల్, సోయాబిన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 20 శాతం దిగుమతి సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 14న ప్రకటించింది. ఇప్పటి వరకు వీటిపై సుంకం లేదు. శుద్ధిచేసిన పామాయిల్, సోయాబిన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతిపై ప్రస్తుతం ఉన్న 12.5 సుంకాన్ని 32.5 శాతానికి పెంచారు. దిగుమతి సుంకం అమలు ప్రకటన వెలువడిన తర్వాత వంట నూనెల ధరలు పెంచేశారు. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం తక్కువ సుంకంతో దిగుమతి చేసుకున్న వంట నూనెలు సుమారు 30 లక్షలు టన్నుల వరకు ఉంది. ఇది దేశంలో 50 రోజులుకు సరిపడ వంట నూనె. అయినా తక్కువ సంకంతో దిగుమతి చేసుకున్న వంట నూనెలను లీటర్‌కు రూ.20 నుంచి రూ.30 పెంచి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రోసిసెంగ్ చేసిన వంట నూనె బ్లాక్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో తనిఖీలు నిర్వహించి వంట నూనెల ధరలు పెంపు, నిల్వలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో వంట నూనె డిమాండ్ మేరకు సప్లై లేదని చెప్పి వ్యాపారాలు లీటర్‌పై రూ.20 నుంచి రూ.30 పెంచి విక్రయిస్తున్నారు.
Commentaires