top of page

సెంటర్‌ పార్కింగ్‌కు అవకాశం ఇవ్వండి

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • పాలకొండ రోడ్డు వ్యాపారులు తీర్మానం

  • ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాలని నిర్ణయం



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలో జీటీ రోడ్డు మాదిరిగా సెంటర్‌ పార్కింగ్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొండ రోడ్డులో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యాజమాన్యాల ప్రతినిధులు తీర్మానించారు. గురువారం స్థానిక వరం రెసిడెన్సీలో పాలకొండ రోడ్డులో వ్యాపారులంతా సమావేశమై సెంటర్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌ను కలిసి విన్నవించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ పాలకొండ రోడ్డును ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కోరారు. పాలకొండ రోడ్డులో గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తున్నవారంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్డు మధ్యలో డివైడర్‌ ఏర్పాటుచేసి అందులో చెట్లు పెంచడం వల్ల తీవ్రనష్టం జరిగిందన్నారు. సాయంత్రం ఆరు తర్వాత రోడ్డుపై చీకట్లు అలమకొని వ్యాపారాలు ఎనిమిది గంటలకే మూసేసే పరిస్థితికి చేరిందన్నారు. జీటీ రోడ్డు మాదిరిగానే పాలకొండ రోడ్డులో వ్యాపారులంతా టాక్స్‌లు చెల్లిస్తున్నామన్నారు. పాలకొండ రోడ్డులో పార్కింగ్‌ ఇబ్బందులతో పాటు డివైడర్‌ మధ్యలో పెంచిన మొక్కలు చెట్టుగా మారడం వల్ల వ్యాపారాలు సాగక అద్దెలు చెల్లించలేని పరిస్థితికి కొందరు వ్యాపారులు దిగజారామని కొందరు యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అద్దెలకు తగ్గట్టుగా వ్యాపారాలు సాగక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వ్యాపారాలు సాగకపోయినా టాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పాలకొండ రోడ్డులో దీర్ఘకాలికంగా కొనసాగే వ్యాపారం ఒక్కటీ లేదన్నారు. రూ.కోట్లు పెట్టబడి పెట్టి వ్యాపారాలు సాగక మధ్యలోనే నిలిపేసే పరిస్థితి పాలకొండ రోడ్డులో ఎంతో మంది వ్యాపారాలు ఎదుర్కొన్నారని తెలిపారు. పాలకొండ రోడ్డులో ప్రస్తుతం చెట్లతో పాటు డివైడర్‌ను శాశ్వత ప్రాతిపదికన తొలగిస్తున్నందున వ్యాపారుల విన్నపాలను పరిగణలోకి తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. డివైడర్‌ స్థానంలో సెంటర్‌ పార్కింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల పార్కింగ్‌ సమస్యతో పాటు పాలకొండ రోడ్డులో వ్యాపారుల స్థితిగతులు మారుతాయన్నారు. ప్రస్తుతం తొలగిస్తున్న మూడున్నర అడుగుల ఉన్న డివైడర్‌ను ఐదు అడుగులుగా చేయాలని అధికారులు చేస్తున్న ఆలోచన సహేతకం కాదన్నారు. ఈ నిర్ణయాన్ని పాలకొండ రోడ్డులో ఉన్న వ్యాపారులంతా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. పాలకొండ రోడ్డులో వ్యాపారాభివృద్దికి సెంటర్‌ పార్కింగ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. డివైడర్‌ స్థానంలో సెంటర్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. సెంటర్‌ పార్కింగ్‌ ఏర్పాటు కోసం అందరినీ కలిసిన తర్వాత మరోమారు సమావేశం కావాలని వ్యాపారులు నిర్ణయించారు. సమావేశంలో పాలకొండ రోడ్డు వ్యాపారులు వీనస్‌ హరి, సుప్రీం ఎలక్ట్రానిక్స్‌ దివాకర్‌, డే అండ్‌ నైట్‌ మెడికల్స్‌ కరుణ్‌కుమార్‌ గుప్తా, క్లాసిక్‌ కంప్యూటర్‌ తారక్‌, జేఎంఆర్‌ రాజా, డాక్టర్‌ అంధవరపు రవికుమార్‌, శివానంద వినోద్‌, వారాహి సిల్క్స్‌ నాని, సూర్య సిండికేట్‌ రవికాంత్‌, చంద్రమౌళి నాగరాజు, నగేష్‌, బాలాజీ ఎలక్ట్రానిక్స్‌ యజమానితో పాటు 60 మంది వరకు వ్యాపారులు పాల్గొన్నారు.

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page