లోకల్ సరుకుకే బ్రాండెడ్ ముద్రతో మోసం
పేపర్ రేటు పేరుతో అధిక ధరలకు అమ్మకాలు
విజయనగరం, విశాఖ కంటే మన దగ్గర అధిక రేటు
పౌల్ట్రీ రంగంలో సింహభాగం ఆ మూడు సంస్థల పెత్తనమే

పేపరు రేటు చూసి చికెన్ కొంటున్నారా?.. అయితే మీరు మోసపోతున్నట్లే. పేపర్‌లో ఆయా సంస్థల ప్రకటిస్తున్న రేట్లే నిజమనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఏ రోజు ఏ ధరకు చికెన్ అమ్మాలో నిర్ణయించేది సిండికేటే. అలాగని అన్ని జిల్లాల్లో రేట్లు ఒకేలా ఉంటున్నాయా అంటే అదీ లేదు. విజయనగరం ఫారం గేట్ ధరకు.. శ్రీకాకుళం ఫారం గేట్ ధరకు మధ్య కేజీకి రూ.15 తేడా ఉంటుంది. కానీ విశాఖ ఫారంగేట్ ధరకు విజయనగరం ఫారం గేట్ ధరకు మధ్య ఎటువంటి తేడా ఉండదు. ఆ రెండు జిల్లా ధర కంటే శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర దాదాపు రూ.15 ఎక్కువగా ఉంటోంది. పోనీ విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి రవాణా చేసి తెప్పిస్తున్నారేమో.. అందువల్లే రవాణా ఛార్జీలతో కలిపి ధర ఎక్కువ వసూలు చేస్తున్నారనుకుందామంటే అలా కూడా జరగడంలేదు. ఈ జిల్లాలోని ఫౌల్ట్రీల నుంచే తెచ్చి అమ్ముతున్నారు. మరోవైపు పేపర్‌లో ప్రకటించే ధర కంటే తక్కువకే విజయనగరం జిల్లాలో విక్రయాలు చేస్తుంటే.. శ్రీకాకుళంలో మాత్రం పేపర్ ధరకే విక్రయిస్తున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మార్కెట్లో అమలవుతున్న చికెన్ ధరలన్నీ సిండికేట్ సృష్టించిన మాయాజాలమే. పౌల్ట్రీ అసోసియేషన్ ఏరోజుకారోజు చికెన్ అమ్మకం ధరలను నిర్ణయించి ప్రతిరోజూ సాయంత్రం పత్రికలకు ప్రకటన జారీ చేస్తుంటుంది. మరుసటి రోజు పత్రికల్లో కనిపించే ఆ ధరకే చికెన్ అమ్మకాలు జరుపుతుంటారు. కానీ అసోసియేషన్ ఇచ్చిన పేపర్ పేపర్ ధరకే విక్రయాలు జరుపుతున్నామన్న సాకుతో కేజీ వద్ద రూ.60కి పైగా వినియోగదారులను దోపిడీకి గురిచేస్తున్నారు. విజయనగరంతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో కేజీపై రూ.15 అధిక ధర పేపర్‌లో చూపించి సిండికేట్ మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా రోజులకంటే ఆదివారం చికెన్ ఎక్కువగా అమ్ముడవుతుంది. జిల్లాలో సగటున 15 లక్షల కేజీలు విక్రయిస్తారు. ఆ లెక్కన ఒక్క ఆదివారం నాడే కనీసం రూ.2 కోట్ల వరకు ఆర్జిస్తున్నారు. ధరలపై అవగాహన ఉన్నవారు ప్రశ్నిస్తే పేపర్ ప్రింట్ తప్పు పడిరదని, లేదంటే పాతరేటే ముద్రించారని బుకాయిస్తారు. ఈ సిండికేట్ మాయాజాలం జిల్లాలో పదేళ్ల నుంచి కొనసాగుతోంది. కొంతమంది వ్యాపారులు ఎక్కువ మొత్తంలో చికెన్ కొనుగోలు చేసేవారికి పేపర్ రేట్‌పై రూ.60 వరకు తగ్గించి అమ్ముతుంటారు. అంటే మిగతా వినియోగదారులను ఆ మేరకు దోపిడీ చేస్తున్నట్లే కదా! ఈ సిండికేట్ మాఫియాను ఒక అడ్వకేట్ ఫామ్ గేట్ నడిపిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపారులు ఎంత చెబితే అంతకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
కార్పొరేట్ల కనుసన్నల్లో..
రాష్ట్రంలో చికెన్ మార్కెట్‌ను సుగుణ, స్నేహ, వెంకాబ్ లాంటి కార్పొరేట్ సంస్థలు శాసిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్థ తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌కు ఊతమివ్వడం ద్వారా ఈ సంస్థలు రాష్ట్రంలో జిల్లాల వారీగా తమ నెట్‌వర్క్‌ను పెంచుకున్నాయి. దాంతో సొంతంగా ఫార్మింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పౌల్ట్రీ రంగంలో సొంతంగా కోడిపిల్లలు కొని, పెంచి, చికెన్ అమ్మేవారి సంఖ్య 20 శాతం కంటే తక్కువగానే ఉంది. వీరంతా రిస్క్‌తో వ్యాపారం చేస్తారు. మిగిలిన 80 శాతం మంది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వైపు మొగ్గుచూపి ఏదో ఒక కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ నిర్వహణ మొత్తం కార్పొరేట్ సంస్థల చేతిలోనే ఉంటుంది. స్థానిక యాజమాన్యాలు షెడ్లు, లేబర్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటాయి. కోడి పిల్లలు, మేత, మందులు, వ్యాక్సిన్ల సరఫరా అంతా కంపెనీలదే. కోడి పిల్లల్ని బాగా పెంచితే దానికి ఇన్సెంటివ్, గ్రోయింగ్ కాస్ట్ మాత్రమే పౌల్ట్రీ రైతులకు లభిస్తుంది. ఫార్మింగ్ పూర్తయిన తర్వాత కిలోకి రూ.2.50 చెల్లించి మొత్తం చికెన్ తరలించుకుపోతారు. అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఏడాదిలో నాలుగుసార్లు ఫార్మింగ్ చేస్తారు. లేదంటే ఒక్కసారితో దుకాణం సర్దేస్తారు. పౌల్ట్రీ యజమానులకు లాభనష్టాలతో సంబంధం ఉండదు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌లో సుగుణ చికెన్ ముందుండేది. ఆ తర్వాత స్నేహ సంస్థ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం వెంకాబ్ వచ్చి చేరింది. వీరితో పాటు స్థానికంగా ఫార్మింగ్ చేస్తున్నవారు ఉన్నారు.
ధరలో హెచ్చుతగ్గులు
ఈ సంస్థల మధ్య పోటీ నేపథ్యంలో మొదట్లో ఒక్కో సంస్థ ఒక్కో ధర అమలు చేసేవి. అనంతర స్థానిక యాజమాన్యాలతో కలిసి ఈ మూడు సంస్థలు ధరలు నిర్ణయించి పేపర్ రేట్‌గా ప్రకటించడం ప్రారంభించాయి. దానివల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం .. మూడు జిల్లాల్లో ధరలు దాదాపు ఒకే విధంగా ఉండేవి. ఆ తర్వాత స్థానిక వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలను నిర్ణయించడం ప్రారంభించారు. దీంతో అన్నిచోట్ల ఒకే ధర ఉండేది. తర్వాత కాలంలో కార్పొరేట్‌్ సంస్థలు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌ను తగ్గించడం వల్ల స్థానిక పౌల్ట్రీ యజమానులు సిండికేట్ వైపు పెద్దగా మొగ్గుచూపలేదు. దీంతో చికెన్ వ్యాపారులు పేపర్ రేట్ కంటే రూ.30 తగ్గించి విక్రయించడం, కొందరు పేపర్ రేట్ కంటే రూ.10 అధికంగా విక్రయించడం ప్రారంభించారు. ఇలా చికెన్ ధరల్లో హెచ్చుతగ్గుల వెనుక మతలబు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. స్నేహ చికెన్ నాణ్యమైనదనే అభిప్రాయం మార్కెట్‌లో ఉంది. దీంతో స్నేహ చికెన్‌ను పేపర్ రేట్ కంటే కేజీకి రూ.4 నుంచి రూ.7 అధికంగా చెల్లించి విశాఖ నుంచి దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడుతుంటారు. అలా తెచ్చిన చికెన్‌ను పేపర్ రేట్ కంటే రూ.20 అధిక రేటుకు విక్రయిస్తుంటారు. అయితే సుగణ చికెన్‌ను పేపర్ రేట్‌కే చెల్లించి దిగుమతి చేసుకుంటారు. దానికి అనుగుణంగా చికెన్ విక్రయిస్తుంటారు. లోకల్ మార్కెట్‌లో లభించే చికెన్‌ను పేపర్‌రేట్ కంటే రూ.15 నుంచి రూ.20 తక్కువకు సరఫరా చేస్తారు. దీంతో దీన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు వ్యాపారులు బోర్డులు పెడుతుంటారు. సిండికేట్ చెప్పిన ధరకు విక్రయించని వారికి చికెన్ సరఫరా నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వీరు లోకల్ చికెన్ కొనుగోలు చేసి తక్కువ ధరకే అమ్ముతున్నట్టు బోర్డులు పెడుతున్న పరిస్థితి అక్కడక్కడా ఉంది.
లోకల్ సరుకే బ్రాండెడ్ పేరుతో
సిండికేట్ ఆధ్వర్యంలో చికెన్ అమ్మకాలు జరిగినప్పుడు స్నేహ, వెంకాబ్, సుగుణ సంస్థలు సరఫరా చేసిన చికెన్‌తో పాటు లోకల్ వ్యాపారులు సరఫరా చేసిన చికెన్‌ను ఒకే రేటుకు వ్యాపారులు విక్రయిస్తుండేవారు. కొందరు లోకల్ సరుకునే కంపెనీ చికెన్‌గా చూపించి తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్టు బోర్డులు పెట్టడం ప్రారంభించారు. దీనిపై మిగతా వ్యాపారులు అభ్యంతరం చెప్పడం ఇతరత్రా కారణాలు సెండికేట్ నిర్వాహకులకు తలనొప్పిగా మారాయి. మార్కెట్లో ఆధిపత్యం కాపాడుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ఏడాదిలో మూడుసార్లు చిల్లర వ్యాపారులకు విందు సమావేశాలు నిర్వహించి బహుమతులు ఇస్తుండేవారు. అయితే కోవిడ్ తర్వాత పరిస్థితి అస్తవ్యస్తం కావడం, కంపెనీ చికెన్ కంటే లోకల్ సరుకు వైపే స్థానిక వ్యాపారులు మొగ్గుచూపడంతో పేపర్ రేట్ ఫిక్స్ చేసి ఆ ధరకే విక్రయించేలా సిండికేట్ నిర్ణయించింది. ప్రస్తుతం విజయనగరం సిండికేట్ గుప్పిట్లోంచి బయటకు వచ్చేసినా శ్రీకాకుళంలో మాత్రం సిండికేట్ నడుస్తోంది. వాస్తవానికి కేజీ లైవ్ బర్డ్ ఉత్పత్తికే రూ.90 ఖర్చవుతుంది. వేసవిలో కోళ్లు సరిగ్గా మేత తినవు. నీరు ఎక్కువగా తాగుతాయి. దీంతో వాటి పెరుగుదల రేటు తగ్గిపోతుంది. దీని ప్రభావం ఉత్పత్తి మీద పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఒక కోడి 40 రోజుల్లోనే 2.5 కేజీలు పెరుగుతుంది. అదే వేసవిలో మాత్రం 40 రోజుల్లో రెండు కేజీల బరువే పెరుగుతుంది. ఆ కారణంతోనే చికెన్ ధర పెంచి రూ.300 పైగా రేటుకు విక్రయిస్తుంటారు.
Comments