ఎంపీగా పోటీ చేయాలని చెప్పిన జగన్
కుటుంబంలో ఒకరికి అసెంబ్లీ టిక్కెటివ్వాలన్న సీతారాం
చిరంజీవి నాగ్‌ను తనకొదిలేయ్‌మన్న అధినేత
జగన్‌తో భేటీ అయిన తమ్మినేని
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు అలా పక్కకెళ్లి ఆడుకోండమ్మా.. మీ గేమ్ స్టార్ట్ అయినప్పుడు గ్రౌండ్‌లోకి వద్దురు గాని! అంతవరకు మా ఆటను మాకు ఆడుకోనివ్వండి. అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ సీనియర్లకు సంకేతాలివ్వడం కాదు.. స్పష్టం చేసేస్తున్నారు. 2027లో ఎట్టి పరిస్థితుల్లోనూ మో`షా ద్వయం జమిలీ ఎన్నికలకే వెళ్తాయని, ఈలోగానే నియోజకవర్గాలన్నింటినీ సెటరేట్ చేయాలని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆమదాలవలస వైకాపా ఇన్‌ఛార్జి తమ్మినేని సీతారాం దంపతులతో రాష్ట్ర రాజధానిలో ఏకాంతంగా గంటపాటు చర్చలు జరిపారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీతారాం పార్లమెంట్‌కే వెళ్లాలని జగన్మోహన్‌రెడ్డి సూటిగా చెప్పినట్టు భోగట్టా. అందుకే కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించామని, ఆ మేరకు శక్తియుక్తులు కూడగట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. 2014, 2019లలో ఇదే సామాజికవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిని నిలిపినా ఫలితం రాలేదని, అందుకు కారణం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని, ఈసారి అలా కాకుండా తమ్మినేని మాత్రమే జిల్లా నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసే కళింగ సామాజికవర్గ నేత అని జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూన రవితో తనకు వైరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమదాలవలస అసెంబ్లీకి పోటీ చేసి గెలుస్తానని సీతారాం చెప్పినా, అందుకు జగన్మోహన్‌రెడ్డి సమ్మతించలేదని ఒక టాక్ నడుస్తుంది. తనకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వనప్పుడు తన కుమారుడికి ఆమదాలవలసలో నిలపాలని కోరగా, చిరంజీవి నాగ్ భవిష్యత్తు తాను చూసుకుంటానని జగన్మోహన్‌రెడ్డి అన్నారని వినికిడి. అలా కానప్పుడు కోడలు, తన కుమార్తెనైనా అసెంబ్లీ బరిలో నిలపాలన్న ఆలోచన జగన్మోహన్‌రెడ్డి ముందు పెట్టగా, రాబోయే ఎన్నికలు వైకాపాకు కీలకమైనవని, గతసారి ఇటువంటి మొహమాటాలకు పోయి అధికారాన్ని కోల్పోయామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీతారాం పార్లమెంట్‌కే వెళ్లాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఆమదాలవలస అసెంబ్లీ టిక్కెట్ వ్యవహారం తనకు వదిలేయాలని, వైకాపా అభ్యర్థిగా ఎవరున్నా అక్కడ గెలిపించాల్సిన బాధ్యత కూడా సీతారామ్‌దేనని స్పష్టం చేసినట్లు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళంలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో ఇచ్ఛాపురం, పలాసలో రాబోయే ఎన్నికలకు ఎటువంటి మార్పులు ఉండవు. ఇప్పటికే టెక్కలి అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా తిలక్‌ను ప్రకటించడం వల్ల అక్కడ కూడా సమస్య తీరిపోయింది. దాసన్న ఉన్నంత వరకు నరసన్నపేటలో మార్పు ఉండదు కాబట్టి ఇక శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు లెక్కే తేలాల్సి ఉంది. ఇందుకోసమే రెండు రోజుల క్రితం వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి ధర్మాన ఇంటికి వచ్చి ఆయనతో ఏకాంతంగా గంటకు పైగా చర్చించారు. ఏది ఏమైనా రెండేళ్ల తర్వాతే తన అభిప్రాయాన్ని చెబుతానని ధర్మాన అనడంతో కనీసం జగన్మోహన్‌రెడ్డి వద్దకు ఓసారి వెళ్దామన్న విజయసాయిరెడ్డి సూచనను కూడా ధర్మాన అంగీకరించనట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్లినా ఇదే మాట చెబుతానని, ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నందుకు మీరే జగన్మోహన్‌రెడ్డికి చెప్పండంటూ ధర్మాన సున్నితంగా తిరస్కరించారు. దీంతో వెంటనే ఆమదాలవలస నియోజవర్గానికి సంబంధించి తమ్మినేని సీతారామ్‌ను పిలిపించుకొని జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ధర్మాన సోదరుల వ్యవహారాన్ని అటు రెడ్డి శాంతి, ఇటు తమ్మినేని సీతారాం వ్యతిరేకిస్తున్నారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ జిల్లా వ్యవహారాలు చూడాల్సి ఉంది కాబట్టి, ఈయన పట్ల కాస్త మెతగ్గా వ్యవహరిస్తున్నా ధర్మాన శైలి పట్ల వీరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన అలక జిల్లా మొత్తం మీద ప్రభావం చూపుతుందన్న ఆలోచన పార్టీలో లేకపోలేదు. మరోవైపు వైకాపాలో కరుడుగట్టిన నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. ఈలోగానే పార్టీని పటిష్టం చేయలేకపోతే 2027 జమిలీ ఎన్నికలకు అభ్యర్థులను తయారుచేసుకోవడం కష్టమవుతుందన్న భావనలో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారు. ఇన్నాళ్లూ అభ్యర్థి ఎవరన్నది అనవసరం, తన మొహం చూసే ఓటేస్తారని భావిస్తూవచ్చారు. కానీ అది వాస్తవం కాదని తేలడంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం గట్టిగా పనిచేసినవారిని వదులుకోడానికి జగన్మోహన్‌రెడ్డి ఇష్టపడటంలేదు. బాలినేని పార్టీ విడిచిపెట్టినప్పుడు జగన్మోహన్‌రెడ్డికి ఉన్న ధైర్యం ఇప్పుడు కనిపించడంలేదని జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. రాజకీయ బదిలీల కారణంగా పత్తిపాడు నుంచి తాడికొండ నియోజకవర్గంలో పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వైకాపాను వీడి జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేనలో ఉన్నవారికి కూడా కూటమి ప్రభుత్వం మంచి కార్పొరేషన్ పదవులే ఇచ్చి గౌరవిస్తోంది. రెండో జాబితాలో 49 టీడీపీకి, 9 జనసేనకు, 2 బీజేపీకి కేటాయించారు. అలాగే మరో మాజీమంత్రి విడదల రజనీ కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగిన వెంటనే ఆమెకు చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈమె కూడా రాజకీయ బదిలీల్లో భాగంగా గతసారి నియోజకవర్గం మారారు. గుంటూరు`2 నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా జిల్లాను శాసించే నాయకులు పార్టీకి దూరంగా ఉంటే వచ్చిన నష్టం జగన్మోహన్‌రెడ్డికి అర్థమవుతుంది. ఇప్పటికైనా బ్యాలెన్సింగ్ రాజకీయాలు కాకుండా ఖరాఖండిగా ఒక నిర్ణయం తీసుకోవాలన్న కోణంలో జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
Comments