సొంతవారికి సాయపడి గట్టిమేల్ తలపెట్టవోయ్!
- NVS PRASAD
- Dec 4, 2024
- 2 min read
ఇసుక రీచ్‌లు కట్టబెట్టడంలో లోకల్ ఫీలింగ్ చూపిస్తున్న మైన్స్ డీడీ
నాలుగు ర్యాంపులకు నిలిచిపోయిన ఫైనాన్షియల్ క్లియరెన్స్
గోపాలపెంట దందాపై కలెక్టర్ ఆగ్రహం
కొత్త టెండర్లు కట్టబెట్టకుండా బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో కాశీకి వచ్చిన భక్తులను మీది తెనాలి, మాది తెనాలి అంటుంటాడు బ్రహ్మానందం. అంతకు ముందే మనం మనం బరంపురం అనే నానుడి పుట్టింది. అంటే.. దానర్ధం వడ్డించేవాడు మనవాడైతే చివరి పంక్తిలో కూర్చున్నా భోజనం అందుతుందన్నట్టు మాట. ఇప్పుడు ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నారు జిల్లా మైన్స్ అధికారులు పైనుంచి నిజంగా ఒత్తిడి వస్తుందా? లేదూ అంటే తన ప్రాంతం వారికి మేలు చేయాలన్న కోరికో తెలీదు గానీ జిల్లాలో ఇసుక ర్యాంపులను గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందినవారికి కట్టబెట్టడానికి ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా లోకేష్ ఓఎస్‌డీ చెప్పారు కాబట్టి ఫలానా వారికే ఈ ర్యాంపులు అప్పగించాలని చూస్తున్నారని, నిజంగా లోకేష్ తరఫున ఫోన్ వచ్చిందా? లేదూ అంటే ఆ పేరు చెప్పి ఇక్కడ అయినవారికి కట్టబెట్టేస్తున్నారా? అనేది ఎవరికీ తెలియడంలేదు. వివరాల్లోకి వెళితే..

శ్రీకాకుళం నియోజకవర్గంలో భైరి, నరసన్నపేట నియోజకవర్గంలో అంధవరం, దుంపాక, ఉప్పరపేట ర్యాంపుల్లో సెమీ మెకానిజంతో ఇసుకను తవ్వడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి జిల్లాలో ఔత్సాహికులతో పాటు గుంటూరు, విజయవాడలకు చెందిన కొన్ని సంస్థలతో పాటు ఏయూఎన్ కన్‌స్ట్రక్షన్స్, పీఎస్‌ఎన్ రెడ్డి అండ్ కో, శ్రీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ కంపెనీ, విశ్వసముద్ర వంటి సంస్థలు ఆన్‌లైన్ ద్వారా బిడ్‌లు వేశాయి. ఇందుకు సంబంధించి మంగళవారం ఆన్‌లైన్ బిడ్‌లను కలెక్టరేట్‌లో ఓపెన్ చేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనలేమిటి? టెండర్లు వేసినవారికి ఉన్న అర్హతలేమిటి? వంటి పత్రాలను పరిశీలించారు. అనంతరం ఫైనాన్షియల్‌గా బిడ్‌లలో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికి అగ్రిమెంట్ ఇవ్వాలి. అయితే ఇప్పటికే గోపాలపెంట ర్యాంపులో అక్రమాలకు తెరతీసి ర్యాంపులోకి వెళ్లాలంటే తమ అనుమతి ఉండాలని విలేకరులను సైతం బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్న అభిషేక్ బోరా అనే వ్యక్తికి చెందిన సంస్థ మనుషులు స్థానికంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైంది. ఇప్పుడు ఇదే సంస్థ ఈ నాలుగు ర్యాంపులకు బిడ్‌లు వేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలపెంట ర్యాంపుపై కథనాలు వచ్చిన వెంటనే కలెక్టర్ ఈ ర్యాంపును రద్దు చేయాలని, సంబంధిత కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్‌లో పెట్టాలని మైన్స్ డీడీని ఆదేశించారు. అయినా కూడా మంగళవారం రాత్రి తెరిచిన టెక్నికల్ బిడ్‌లో ఈ సంస్థ ఉండటంతో కలెక్టర్ ఫైనాన్షియల్ బిడ్ ఖరారును నిలుపుదల చేసి వెళ్లిపోయారు. జిల్లాలో తాత్కాలిక పద్ధతిన ఇచ్చిన ర్యాంపుల్లో మాన్యువల్‌గా తవ్వకాలు జరిపి ఇసుకను ఒడ్డుకు చేర్చాలి. కానీ ఎక్కడా ఇది జరగడంలేదు సరికదా.. ప్రొక్లయినర్లు పెట్టి పెద్దఎత్తున తోడేస్తున్నారు. దీన్ని బహిర్గతం చేసేందుకు వెళుతున్న విలేకరులపై దాడులకు సిద్ధమవుతున్నారు. ఎవర్ని అడిగినా తాము అమరావతి వర్గాలమని, పైస్థాయిలో చూసుకుంటామని చెబుతున్నారు. కొత్తగా మంజూరైన అంధవరం, భైరి, దుంపాక, ఉప్పరపేట ర్యాంపులకు మాత్రమే సెమీ మెకానిజం అనుమతులు ఉంటాయి. అంటే.. చిన్నస్థాయి జేసీబీ పెట్టి ఇసుకను తవ్వుకోవచ్చు. ఎందుకంటే ఈ ర్యాంపులు ఐదు హెక్టర్లకు మించి ఉంటాయి. ఇందుకోసం స్థానికంగా ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నదిలోకి ప్రొక్లయినర్ వెళ్లడానికి అనుమతులు లేనిచోటే ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న ఇసుకాసురులు ఇప్పుడు సెమీ మెకానిజం ద్వారా ఐదు హెక్టార్లు ఇస్తే పాతాళాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు. జిల్లాలో తవ్వుతున్న ఇసుకకు, ప్రభుత్వ ఖజానాకు వచ్చిన సొమ్ముకు ఏమాత్రం సంబంధం లేదని గత కథనాల్లో చెప్పుకున్నాం. ఆన్‌లైన్‌లో ఒక్క రశీదు లేకుండా ఇల్లీగల్‌గా రూ.8వేల నుంచి రూ.10వేలకు లారీ లోడును తరలించేస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి కూడా ప్రభుత్వం అప్రతిష్ఠపాలవుతుంది. కొత్తగా రానున్న 4 ర్యాంపుల్లో భైరిని హౌసింగ్ అవసరాల కోసం, దొంపాకను మూలపేట పోర్టు అవసరాల కోసం కేటాయిస్తారని వినికిడి. ఈ రెండు ర్యాంపులు దక్కించుకుంటే పోర్టు, హౌసింగ్ పేరిట యథేచ్ఛగా ఇసుకను రవాణా చేసేయొచ్చని భావిస్తున్నారు. డీషిల్టేషన్ కింద కాఖండ్యాంలో తవ్వుతున్నవారు కూడా అమరావతి పేరే చెబుతున్నారు. జిల్లాలో ఉన్నవారికి అవకాశాలు లేకుండా సొమ్మంతా అమరావతి వెళ్లిపోతున్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి పాలసీకి, కూటమి ప్రభుత్వ పాలసీకి తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పీఎస్‌ఎన్ రెడ్డి అండ్ కో మోడ్రన్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఇసుక రీచ్‌లకు వేసిన టెండర్ల వెనుక అభిషేక్ బోరా ఉన్నారని చెప్పుకుంటున్నారు. బోరా పేరుతో ప్రత్యేకంగా సంస్థలు లేకపోయినా ఈ రెండిరటి వెనుక ఆయనే ఉన్నారని భోగట్టా. కొత్తగా వచ్చిన సెమీ మెకానిజం ర్యాంపులకు పోర్టు అవసరాల కోసం విశ్వసముద్ర టెండర్ మినహా మిగిలిన కంపెనీలన్నీ గుంటూరుకు చెందినవే కావడం గమనార్హం. అలాగే మైన్స్ డీడీగా పని చేస్తున్న అధికారి కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు అనుమానాలు పెరిగాయి.
Comentários