ప్రమాదానికి కర్త, కర్మ, క్రియ ఫైర్ డిపార్ట్‌మెంటే
కళ్లు మూసుకొని అనుమతులిచ్చిన అధికారులు
మంటలు అదుపు చేయడంలో చేతులెత్తేసిన సిబ్బంది
నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం
నష్టనివారణలో అగ్నిమాపక శాఖ విఫలం
‘మాల్స్’లో ప్రమాద ఘంటికలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అంతర్జాతీయ పిచ్‌ల మీద మనోళ్లు క్రికెట్ ఆడాలంటే ముందుగా నెట్‌ప్రాక్టీస్ చేస్తారు. ఎవరి బాలు ఎలా స్వింగ్ అవుతుంది? ఎవరు ఏ సైడ్ రెగ్యులర్‌గా క్యాచ్ ఇచ్చే అవకాశం ఉంది? వంటి విషయాలు తెలుసుకోవడం కోసం నెట్‌ప్రాక్టీస్ చేస్తారు. క్రికెట్‌తో పాటు అన్ని క్రీడల్లోనూ పోటీలకు ముందు నెట్‌ప్రాక్టీస్ కంపల్సరీ. సరిగ్గా ఇటువంటి నెట్‌ప్రాక్టీసే మన జిల్లా అగ్నిమాపక శాఖ సౌతిండియా షాపింగ్‌మాల్ మీద చేసింది. గడ్డికుప్పలు అంటుకుంటే గంటలు వాయించుకుంటూ వెళ్లి ఆర్పేసే ఫైరింజన్లు ఒక నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగితే ఎలా వ్యవహరించాలో తెలుసుకోడానికి సౌతిండియా షాపింగ్‌మాల్ ప్రమాదం ఉపయోగపడిరది తప్ప జరిగిన ఆస్తినష్టంలో పైసాను కూడా తగ్గించలేకపోయింది. ఆక్సిజన్ మాస్క్‌లంటే ఏమిటో తెలీదు. ఫైర్ డిపార్ట్‌మెంట్ యూనిఫామ్ తప్ప ఫైర్ రెసిస్టెన్స్ కోసం వాడే ఒక్క పరికరమూ లేదు. కానీ మంటలార్పుతామమ్మా అంటూ జిల్లా నలుమూలల నుంచి ఫైరింజన్లు ప్రమాదం జరిగిన రోజున వచ్చేశాయి. వాస్తవానికి ఈ సౌతిండియా షాపింగ్‌మాల్ అగ్నిప్రమాదం యాదృచ్ఛికం కావచ్చు కానీ, అంత పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించడానికి, ఆస్తినష్టం జరగడానికి కర్త, కర్మ, క్రియ ఫైర్ డిపార్ట్‌మెంటే. కళ్లు మూసుకొని ఫైర్ ఎన్‌వోసీ ఇచ్చిన అధికారులు కనీసం ఫైర్ అయిన తర్వాతైనా ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. ఇందుకు కారణం గడ్డికుప్పలు ఆర్పేవారు తప్ప మంటల్లోకి, పొగల్లోకి చొచ్చుకునిపోయే సిబ్బంది, వారికి అవసరమైన శిక్షణ లేమి ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓ నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగితే తామేమీ చేయలేమనుకున్నప్పుడు ఆ భవనానికి అనుమతులు ఇచ్చినప్పుడైనా అన్నీ సవ్యంగా ఉన్నాయో, లేవో చూసుకోవాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖదే. అటు ఎన్‌వోసీలు జారీ చేసిన దగ్గర్నుంచి ఇటు మంటలు ఆర్పేవరకు ప్రతీచోట ఆ శాఖ వైఫల్యం కనిపిస్తుంది. కేవలం చీరలు మాత్రమే కాలిపోవడంతో ఆస్తినష్టంతో ఆగింది. అదే స్థానంలో కస్టమర్లు, షాపింగ్‌మాల్ సిబ్బంది ఉండివుంటే వారి ప్రాణాలకు ఎవరు దిక్కు? ఇప్పుడు అంతటా ఇదే ప్రశ్న. శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం మీదకు వెళ్లడానికి అవసరమైన పరికరాలు లేనప్పుడు ఆ మేరకు అనుమతులు ఎందుకిచ్చినట్టు? దేశవ్యాప్తంగా బట్టల షాపులున్న సౌతిండియా షాపింగ్‌మాల్‌కు ఇది పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ ప్రాణనష్టం జరిగితే ఎవరిమీద చర్యలు తీసుకుంటారు?
నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదంలో కాలి బూడిద కావడానికి షాపింగ్ యాజమాన్యంతో పాటు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు బాధ్యులే. అగ్నిప్రమాదం జరిగి రూ.కోట్లలో ఆస్తినష్టం వాటిల్లితే కానీ అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లు తెరవలేదు. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఎన్‌వోసీ రద్దు చేస్తున్నట్టు యాజమాన్యానికి నోటీసులు పంపించారు. 2022 జనవరి 11న ఆక్యుపెన్సీ కోసం అగ్నిమాపకశాఖ కార్యాలయం ద్వారా జారీచేసిన ఎన్‌వోసీని మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా రద్దు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 తెల్లవారుజామున సంభవించిన సంఘటనను సమీక్షించిన తర్వాత అగ్నిప్రమాదానికి రెండు ప్రధాన అంశాలు కారణమయ్యాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ భద్రతా చర్యలను పాటించకపోవడం, స్మోక్ ఎక్స్‌ట్రాక్షన్ సిస్టమ్ లేకపోవడం ప్రమాదానికి కారణమని తేల్చారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు. షాపింగ్ మాల్‌కు 2022 జనవరి 11న ఎన్‌వోసీని జారీచేసిన అగ్నిమాపక శాఖ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన కనీస సౌకర్యాలు, పరికరాలు లేవని గుర్తించకుండా ఎలా ఆక్యుపెన్సీ కోసం ఎన్‌వోసీ ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మాక్ డ్రిల్ ఒక ఫోటో సెషన్
ప్రమాదం జరిగితే ఒకలా.. లేకుంటే మరోలా అగ్నిమాపక శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్మోక్ ఎక్స్‌ట్రాక్షన్ సిస్టమ్ లేకపోవడం ప్రమాదానికి కారణమని చెబుతున్న ఫైర్ అధికారులు ఎన్‌వోసీ సమయంలో కళ్లు మూసుకున్నారా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడాది విపత్తు నిర్వహణ సిబ్బంది జరిపే మాక్‌డ్రిల్ కేవలం అగ్నిమాపక శాఖ అధికారుల ఫోటో సెషన్‌గా మారిపోయిందని విమర్శలున్నాయి. మాల్స్, ఆసుపత్రులు, పాఠశాలు, బహుళ అంతస్థుల భవనాల వద్ద విపత్తు సంభవిస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ప్రతి ఏడాది అగ్నిమాపక సిబ్బంది అక్కడ పనిచేసే సిబ్బందితో కలిసి మాక్‌డ్రిల్ నిర్వహిస్తుంటారు. దీన్ని ఒక ఫోటో సెషన్‌గా అగ్నిమాపక శాఖ అధికారులు చూస్తుంటారు. తప్పదు కాబట్టి నిబంధనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పకోవడానికి ఏడాదికి ఒకసారి మమ అనిపిస్తుంటారు. సౌతిండియా షాపింగ్ మాల్‌కు ఎన్‌వోసీ జారీ చేసిన తర్వాత మాల్ ప్రాంగణంలో ఒక్కసారీ మాక్ డ్రిల్ నిర్వహించలేదు. ప్రమాదం జరిగిన తర్వాత షాపింగ్ మాల్ యాజమాన్యం ఎన్‌వోసీ జారీచేసిన తర్వాత మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు ధ్రువీకరణ, ఫోటోగ్రాఫ్‌లను సమర్పించడంలో యాజమాన్యం విఫలమైందని నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవంగా మాక్ డ్రిల్ నిర్వహించాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖ అధికారులదే. మాక్‌డ్రిల్ ఎందుకు నిర్వహించలేదని, మూడేళ్లు యాజమాన్యానికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదో అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పాలి. ప్రతి ఏడాది ఉగాది, దసరా, సంక్రాంతి సమయంలో ఇంటిల్లిపాది బిల్లులు కట్టకుండా షాపింగ్, మంత్లీలు, ప్రోటోకాల్ కోసం డబ్బులు డిమాండ్ చేసే అగ్నిమాపక శాఖ అధికారులు నిబంధనలు, ఫైర్ సేఫ్టీ పాటించని మాల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు సాహసిస్తారనే ప్రశ్న సామాన్యులు లేవనెత్తుతున్నారు.
బాధ్యత ఎవరిది?
తెల్లవారు జామున షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం సంక్రాంతి సమయంలో, లేదంటే వ్యాపార సమయంలో జరిగివుంటే బాధ్యత వహించేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతుంది. మాల్‌లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులు, వినియోగదారుల ప్రాణాలకు ప్రమాదం జరిగివుంటే బాధ్యత ఎవరు వహించేవారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన ప్రమాదం ఇదే చివరిదన్న భరోసాను అగ్నిమాపక శాఖ అధికారులు ఇవ్వలేరు. నగరంలో షాపింగ్ మాల్స్ లెక్కకు మించి ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరిగితే బయటకు వచ్చే దారి లేని మాల్సే నగరంలో ఉన్నాయి. మాల్స్‌లోకి వెళ్లే మార్గం, వచ్చే మార్గం ఒక్కటే. ఇదే మాదిరిగా నగరంలో మాల్స్ అన్నీ నిర్మాణాలు చేశారు. నగరంలో మాల్స్ పెట్టి వ్యాపారం చేస్తున్న బహుళ అంతస్తుల భవనాలన్నీంటికీ అనుమతులున్నా, వీటి నిర్మాణం ప్లాన్ ప్రకారం జరగడం లేదని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదం వెలుగులోకి తీసుకువచ్చింది. నగరంలో మాల్‌లో ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదు. వెళ్లిన మార్గంలోనే బయటకు రావాలి. నగరంలోని కార్పొరేట్ షాపింగ్ మాల్స్ అన్నీ ఐదంతస్తుల భవనాల్లోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరికి నిబంధనలు పట్టవు. ప్లాన్ డీవియేషన్ చేయడానికి నగరపాలక సంస్థ ప్లానింగ్ అధికారులకు లంచాలు మట్టజెప్పుతున్నారు. ఫైర్ సెఫ్టీ మెజర్ లేకుండా వ్యాపారం చేయడానికి అగ్నిమాపక శాఖ అధికారులకు, మాల్‌లో వాహనాల పార్కింగ్ లేకుండా వ్యాపారం చేయడానికి పోలీసులకు మంత్లీలు ఇస్తున్నారు. ప్రమాదం జరిగినా, జరగకపోయినా ఎవరి వాటా వారికి అందిపోతుంది.
అన్ని మాల్స్‌లో ఇదే పరిస్థితి
అగ్గిపెట్టిల్లా అన్నివైపులా మూసేసి ఎలివేషన్ కోసం మాల్ యాజమాన్యం తాపత్రయపడుతుంటారు. అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోకుండా వినియోగదారుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్‌వోసీలు జారీ చేస్తుంటారు. నగరంలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్‌కి ఇది వర్తిస్తుంది. ఐదంతస్తులు భవనాన్ని నిర్మించాలంటే సవాలక్ష నిబంధనలు తెరపైకి తేచ్చే ఆయా శాఖల అధికారులు షాపింగ్ మాల్స్ విషయంలో మాత్రం పట్టించుకోరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాదాన్ని నియంత్రించడానికి ముందు భాగం నుంచి మాత్రమే ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. మాల్‌కు వెనుక భాగం నుంచి గానీ, ఇరువైపులు నుంచి వెళ్లడానికి మార్గం లేదు. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం బహుళ అంతస్థుల భవనానికి ఇరువైపులా అగ్నిమాపక శకటం వెళ్లేందుకు వీలుగా సెట్‌బ్యాక్ విడిచిపెట్టాలి. నగరంలో ఉన్న షాపింగ్ మాల్స్‌లో అటువంటి నిర్మాణమే లేదు. అలా విడిచిపెట్టకపోయినా అగ్నిమాపక శాఖ అధికారులు వ్యాపారం చేసుకోవడానికి ఎన్‌వోసీ ఇచ్చేస్తున్నారు. నగరంలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్నింటిలోనూ ఫైర్ సెఫ్టీ లేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో ప్రమాదం జరిగి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అన్ని మాల్స్‌లో హడావుడి చేశారు. ప్రమాదం జరిగితే తప్పా అగ్నిమాపక శాఖ అధికారులకు నిబంధనలు గుర్తుకురావని నగర ప్రజలు దుయ్యబడుతున్నారు. సౌత్ ఇండియాలో జరిగిన ప్రమాదం వేరే మాల్ జరిగి ఉంటే దాని తీవ్రత మరో విధంగా ఉండేది. ఇప్పటికైనా మాల్స్‌లో పనిచేసే కార్మికులు, వినియోగదారులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ ఉండేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Comments