top of page

స్థాయిని తగ్గించకుండా వుంటే చాలు!!

Writer: ADMINADMIN


చిరంజీవి సినిమాలలో సినిమా బాగుండి ఫెయిల్‌ అయిన సినిమాలలో ‘‘అందరివాడు’’ ఒకటి. అది కేవలం శ్రీను వైట్ల దురదృష్టం, కొంచెం క్యాచీగా వుండే హీరోయిన్‌నీ పెడితే హిట్‌ అయిపోయి వుండేది. లేదా చిన్న చిరంజీవి పాత్ర ఒక కుర్ర హీరోతో చేయించినా ఇంకాస్త బాగుండేది.

విషయానికి వస్తే అలా హిట్‌ అయిన సినిమాలన్నీ గొప్పవీ కావు,ఫ్లాపయిన సినిమాలన్నీ చెత్తవీ కావు.మొన్నీమధ్య మేకింగ్‌ మీద కంటే ప్రమోషన్‌ల మీద ఎక్కువ దృష్టి పెట్టి కోట్లు కొల్లగొట్టేసిన వెంకటేష్‌ సినిమాలోని వెకిలి కామెడీ వెంకటేష్‌ స్టార్‌ స్టేటస్‌ కే మ్యాచ్‌ కాలేదు. ఆ డైరెక్టర్‌ ఇపుడు చిరంజీవితో తీస్తున్నాడు అంటే,ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వచ్చు కాక చిరంజీవి లెవెల్‌ రాజేంద్రప్రసాద్‌ లెవెల్‌కి దిగిపోవడం ఖాయం. పైగా డైరెక్టర్లను కూడా అలుపెరుగని వీరులు, ఫ్లాప్‌ ఎరుగని శూరులు అని పొగడడాలు తగ్గిస్తే తప్ప వాళ్లు మంచి సినిమాలు తీయలేరు. హిట్‌ అవ్వడం ఒకటే సినిమాకి కొలబద్ద కాదు, అందరివాడు సినిమాలోని గోవిందరాజులు పాత్ర టీవీలో కనపడితే కనీసం ఒక సీన్‌ అయినా చూడకుండా ఛానల్‌ మార్చలేడు ఎవడూ కూడా.

చిరంజీవి రావిపూడి సినిమా హిట్‌ అవ్వకపోయినా ఏమీ ఫర్వాలేదు కానీ అతనిస్థాయిని తగ్గించకుండా వుంటే అదే పదివేలు, అసలే చిరంజీవి ఈ మధ్య బైబిల్‌నీ బాగా ఫాలో అయ్యేవాడిలా హెచ్చింపబడడానికి తనకు తాను తగ్గించుకోవాలనుకుని రోజురోజుకూ కాస్త కాస్త తగ్గించుకుంటూపోతున్నాడు తన ‘‘అందరివాడు’’ ఇమేజ్‌ నీ.!!!

రఘు శ్రీమంతుల

ఆమె మెడ వంచి, తాళికి మూడు ముళ్లు వేసేస్తే.. ఇది పెళ్లంటారా..?

ఏది పెళ్ళి ? కేవలం మూడు ముళ్ళు వేయటమేనా ? లేక కడదాకా భార్యను ప్రేమగా చూసుకోవటమా ? అనాదిగా వస్తున్న ప్రశ్నలే ఇవి.

భర్త మగాడు ఇద్దరు పెళ్ళాలతో ఊరేగేటప్పుడు, భార్య ఆడది ఇద్దరు మొగుళ్ళతో ఎందుకు ఊరేగకూడదు? ఈ ప్రశ్ననే ఈ సినిమాలో రెండు పాత్రలు ప్రశ్నిస్తాయి. ఉండేది కాసేపే అయినా ఈ రెండు పాత్రల్లో నటించిన సువర్ణను, రaాన్సీని ప్రేక్షకుడు మరవలేడు.

సప్తపది సినిమాలో విశ్వనాధ్‌ ఒక రకమైన ముగింపు ఇస్తే, రాధాకల్యాణం సినిమాలో బాపు/భాగ్యరాజ్‌ మరో రకమైన ముగింపు ఇచ్చారు. ఆ రెండు సినిమాలు పెళ్లి, తాళిబొట్టు చుట్టూనే తిరుగుతాయి. ఈ ఇది పెళ్ళంటారా సినిమా కూడా పెళ్లి, తాళిబొట్టు చుట్టూనే తిరుగుతుంది. సంచలనాత్మక కధతో వచ్చిన మంచి సినిమా. కానీ బొబ్బిలి పులి ప్రభంజనంలో తట్టుకోలేక పోయింది.

న్యాయం కావాలి సినిమాలో నిరసనగా పెళ్లి అక్కరలేదు పొమ్మని చెపుతుంది హీరోయిన్‌ రాధిక. ఈ సినిమాలో సేడిస్ట్‌ మొగుడు మొహాన తాళిబొట్టు విసిరేసి వెళ్ళిపోయి, విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది హీరోయిన్‌.

సేడిస్ట్‌ మొగుడుగా వికెడ్‌ సాఫ్ట్‌ విలన్‌ పాత్రలో గొల్లపూడి మారుతీరావు బాగా నటించారు. ప్రేక్షకులకు లేచి తన్ని వద్దామని అనిపిస్తుంది. అంత క్రూరంగా నటించారు. కధానాయకి రాధిక చాలా బాగా నటించింది. చిరంజీవి చాలా హుషారుగా, ఆదర్శవంతుడైన భర్తగా, భర్తంటే ఎలా ఉండాలో అలాగా బాగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకరరెడ్డి, వుయ్యూరు రామకృష్ణ, మల్లికార్జునరావు, పి జె శర్మ ప్రభృతులు నటించారు.

సాధారణంగా మన సినిమాలు 1ం2. ఈ సినిమా 2ం1. అంటే ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లను చూపే మన సినిమాలలో ఈ సినిమా ఒక హీరోయిన్‌ ఇద్దరు భర్తలు. పెళ్ళి ఎలా ఆవిర్భవించిందో చెప్పటంతో టైటిల్స్‌ ప్రారంభం అవుతాయి. ముగింపు కూడా వాయిస్‌ ఓవర్‌ తోనే ముగిస్తుంది.

ఈ సినిమాకు గుండెకాయ కోర్ట్‌ సీన్‌. ఎందుకనో పేలవంగా ఉందని అనిపిస్తుంది. న్యాయం కావాలి సినిమా లాగా సూపర్‌ హిట్‌ కాకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు. క్రాంతికుమార్‌ నిర్మాత. విజయభాస్కర్‌ దర్శకుడు. సత్యానంద్‌ డైలాగులు సినిమా అంతా పదునుగా ఉన్నా కోర్ట్‌ సీన్లో పస లేకుండాపోయాయి.

చక్రవర్తి సంగీతం శ్రావ్యంగా ఉంటుంది. పాటలు బయట హిట్‌ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నా ఊపిరికే పరిమళమా నా పూజకు తులసీదళమా, వసంతం శరత్తు హేమంతం పాటలు చాలా శ్రావ్యంగా, అందంగా ఉంటాయి. పాటల్ని అన్నీ వేటూరే వ్రాసారు.

హరినారాయణా హరినారాయణా అనుకోరాదా మనసా అనే పాట అనంత శ్రీరాంకు గుర్తు లేకపోవటం వలన బతికిపోయింది కానీ లేకపోతే హైందవ శంఖారావం మీటింగులో కడిగి పారేసేవాడు.

1982 జూలై 16న వచ్చిన ఈ సినిమా చూడబుల్‌ సినిమాయే. చక్కని, శుభ్రమైన సంచలనాత్మక సందేశాత్మక ఈ సినిమా యూట్యూబులో ఉంది. ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక ట్రై చేయవచ్చు. చిరంజీవి అభిమానులు అయితే తప్పక చూడాల్సిందే.

దోగిపర్తి సుబ్రమణ్యం

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page