top of page

సుధాకరా.. నీతో వేగలేమురా..!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • గూగుల్‌మీట్‌లో డబుల్‌మీనింగ్‌ మాటలు

  • సమావేశానికి ఆలస్యమైతే ఎక్కడ పడుకున్నావంటూ ప్రశ్నలు

  • సమయపాలన లేకుండా సమావేశాలు

  • కొద్ది రోజుల్లోనే 103 మంది సిబ్బందికి మెమోలు

  • మంత్రి ముందుకు డ్వామా పంచాయితీ

  • వారంతా దొంగలని కలెక్టర్‌కు ముక్తాయించిన పీడీ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)


జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సంస్థ పీడీ ప్రదర్శిస్తున్న తీరు ఉపాధి హామీ పథకంలో 20 ఏళ్లగా వివిధ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి రోజురోజుకు సమస్యలు తెచ్చిపెడుతుంది. డ్వామాలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది లింగభేదం చూడడం లేదని వాపోతున్నారు. టార్గెట్‌లు ఫిక్స్‌ చేసి పనులు పూర్తి కావాలని వేపుకు తింటున్నారని ఉద్యోగులు గత కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో చేయాల్సిన పని కేవలం గంటల వ్యవధిలో పూర్తి చేయాలని ఒత్తిడి పెంచి మెమోలు జారీ చేస్తున్నారు. మూడు నెలల్లో సుమారు 103 మంది ఉపాధి ఉద్యోగులకు మెమోలు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పీడీపై విమర్శలు ఉన్నాయి. గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో ఇటీవల 25 మందికి ఒకే రోజు మెమోలు జారీ చేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు కార్యాలయంలోనే సిబ్బందిని ఉంచి రాత్రి 8 తర్వాత జిల్లాలోని సిబ్బందితో గూగుల్‌ మీట్‌ నిర్వహిస్తూ ఆడ, మగ తేడా లేకుండా బండబూతులు తిట్టడం పీడీకి సర్వసాధరణమైపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గూగుల్‌ మీట్‌లో ఎవరైనా ఉద్యోగులు పీడీ వాడే భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. బెదిరించి పనిష్మెంట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఉదయం టెలీకాన్ఫిరెన్స్‌, మధ్యాహ్నం వీడీయో కాన్ఫరెన్స్‌, రాత్రి గూగుల్‌మీట్‌ నిర్వహించి ఉద్యోగులు, సిబ్బందిని తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశిస్తున్నారు. ‘మీరంతా తాత్కాలిక ఉద్యోగులు, మిమ్మల్ని తొలగించే అధికారం నా చేతిలోనే ఉంది’ అంటూ బెదిరించడం పీడీకి పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ‘ఏ చెట్టు కింద పడుకున్నావు’

ఫీల్డ్‌లో ఉండే మహిళా ఉద్యోగులు కాన్ఫరెన్స్‌లకు ఆలస్యంగా హాజరైతే ‘ఏ చెట్టు కింద పడుకున్నావు’ అంటూ పీడీ దుర్భాషలాడుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఒక మహిళా పీవోకు రాత్రి 9 గంటలకు ఫోన్‌ చేసి గూగుల్‌ మీట్‌కు హాజరు కావాలని చెప్పాల్సిన పీడీ ‘మొగుడు పక్కన పడుకున్నట్టు ఉన్నావు.. 10 నిమిషాల సమయం కేటాయించు.. అర్జెంట్‌ పని ఉంది’ అంటూ మాట్లాడినట్టు ఉద్యోగుల్లోనే చర్చ సాగింది. ఉద్యోగులెవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఆ సిబ్బందిని టార్గెట్‌ చేసి వేరే మండలాలకు పంపించి ఇబ్బంది పెడుతున్నారని పీడీపై ఆరోపణలు ఉన్నాయి. పీడీ మాటకు ఎవరైనా ఎదురు సమాధానం చెప్పినా, ఆలస్యంగా స్పందించినా మహిళలని కూడా చూడకుండా పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడుతుండడం ఉద్యోగులకు మనస్థాపానికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, సిబ్బంది మత విశ్వాసాలను దెబ్బతీసేలా తరచూ మాట్లాడుతుంటారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయన ఏది చెబితే కలెక్టర్‌ అదే చేస్తారని, తన మాటకు తిరుగులేదని సమావేశాలు, కాన్ఫరెన్స్‌ల్లో పీడీ బహిరంగంగానే చెబుతుంటారని విమర్శలున్నాయి. పీడీ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న అభ్యంతరకరమైన తీరుపై జిల్లాకు చెందిన మంత్రులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి మొరపెట్టుకున్నా సమస్యకు పరిష్కారం చూపించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో వివిధ హోదాల్లో పని చేసిన ప్రతి చోట ఇదే పద్ధతిలో వ్యవహరించేవారని పీడీపై ఆరోపణలున్నాయి.

ఒత్తిడి పెంచి మెమోలు జారీ

పీడీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏపీవో స్థాయి నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లు సుమారు 400 మంది కలిసి మానసికంగా, శారీరకంగా వేధించడం తగదని డ్వామా కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పీడీని కలిసి టార్గెట్స్‌ పేరుతో ఒత్తిడి పెంచి మెమోలు జారీ చేయడం, వీసీ, టీసీ, గూగుల్‌ మీట్‌లో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకమైన భాషను వినియోగించడం మానుకోవాలని వినతి పత్రం అందించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌వో వెంకటేశ్వరావును కలిసి పీడీపై ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వరకు సిబ్బందిని కార్యాలయంలో ఉంచి ఇంటికి వెళ్లి కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్వామా కార్యాలయంలో సుమారుగా 56 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 26 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. 14 మంది ఉద్యోగులు వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. కార్యాలయ సిబ్బందితో పాటు మండల స్థాయిలో ఉన్న టెక్నికల్‌ అసిస్టెంట్‌లో ఏపీవోలు ఇతర సిబ్బంది కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సొంత అవసరాల కోసం, ఇంట్లో నిర్వహించే శుభకార్యాలకు సెలవు కావాలని కోరినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

గంట పర్మిషన్‌ అడిగితే ..

ఇటీవల ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా నుంచి జనాలను బస్సుల్లో తరలించడానికి, వారిని ఇంటికి తిరిగి తీసుకురావడానికి వీలుగా డ్వామా కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. అందులో రాత్రి మూడు గంటల వరకు సిబ్బంది పని చేశారు. తర్వాత రోజు గంట పర్మిషన్‌ అడిగితే ఇచ్చేందుకు నిరాకరించిన పీడీ 10 గంటలకు కార్యాలయంలో ఉండాలని హుకుం జారీచేశారు. పీడీ తీరుపై టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగామ మండలాలకు చెందిన ఉపాధి అధికారులు, సిబ్బంది మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు. మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినందుకు పీడీ సదరు ఉద్యోగులను బెదిరించినట్టు తెలిసింది. డ్వామా జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఉద్యోగి కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఈ`మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు వెళ్లి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తున్నారని, దీనివల్ల ఫ్యామిలీ లైఫ్‌, ఆరోగ్యం పాడవుతుందని మొర పెట్టుకున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించలేదని బాధిత ఉద్యోగి పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.

కించపరిచేలా మాట్లాడుతూ..

ఉపాధి హామీ పథకం అమల్లో కీలక భూమిక పోషిస్తున్న సిబ్బందిని కించపరిచేలా మాట్లాడుతూ బెదిరింపులకు దిగడమే కాకుండా దొంగలంటూ అభివర్ణించడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. రోజుకు ఎనిమిది పనిగంటలు వర్తింపజేయాలని, ఉపాధి చట్టంలో చెప్పబడిన రాజీలేని అంశాల ప్రాప్తికి మాత్రమే విధులను అప్పగించాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఉద్యోగులు కోరారు. పని ఒత్తిడి పెంచి తీవ్రస్థాయి వేధింపులు మానుకోవాలని ఉద్యోగులు విన్నవించారు. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో వేతనాలు కల్పించి జిల్లాకు రూ.400 కోట్ల మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులను సమకూర్చిన ఘనత జిల్లా ఉపాధిహామీ పథకం సిబ్బందికి దక్కుతుందన్నారు. సంక్రాంతి సమయంలో సెలవులు ఇవ్వకుండా వేధించినా భరించామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా కించపరిచేలా వ్యవహరిస్తే సీఎంవోకు ఫిర్యాదు చేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌ శాఖల సిబ్బంది చేయవలసిన పనులను ఉపాధి సిబ్బందితో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు పని వేళల్లో మాత్రమే చేస్తామని తెలియజేశారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, లేకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఉపాధి సిబ్బందికి జరుగుతున్న అన్యాయంపై మంత్రులకు కలిసి విన్నవిస్తామన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page