top of page

‘సంధి’ తాత్కాలికం.. ఏదీ తరుణోపాయం?

  • Guest Writer
  • Apr 8
  • 3 min read

ఇరాన్, అమెరికా చర్చల్లో హర్మూజే కీలకం

ఇప్పుడు ప్రపంచమంతా హర్మూజ్ జలసంధి చుట్టే తిరుగుతున్నది. ఇరుకైన ఈ జలరవాణా మార్గం ఒక భయంకరమైన చమురు బాంబును తలపిస్తున్నది. ఈ జలమార్గానికి అధికారికంగా పూర్తిగా మూసివేయనప్పటికీ దాని ప్రభావం అంతే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ను పూర్తిగా తెరవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అనేక హెచ్చరికలు, పరిణామాల నేపథ్యంలో 14 రోజుల తాత్కాలిక సీజ్‌ఫైర్, హర్మూజ్ తెరవడానికి అంగీకారం కుదిరినా గత నెలరోజులకుపైగా ఎదురైన అనుభవాలు, భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను తలచుకుని నౌకా రవాణా సంస్థలు, జలసంధిపై ఆధారపడిన దేశాలు, బీమా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.. ఆ జలసంధి సంతరించుకున్న భౌగోళిక స్వరూపమే దాన్ని అత్యంత బలహీనంగా మార్చింది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వెళ్లే ఏకైక సముద్ర మార్గం ఇదే. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ సరిహద్దులుగా ఉన్న ఈ జలసంధి 29 నాటికల్ మైళ్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. లోపలికి, బయటికి వెళ్లే నౌకల కోసం రెండు మైళ్ల పొడవైన మార్గాలు ఒక సన్నని రక్షణ పొరతో వేరు చేస్తూ ఉంటాయి.

గల్ఫ్ పోర్టుల నుంచి బయల్దేరే దాదాపు ప్రతి ఇంధన ట్యాంకర్ ఇరాన్ నిఘాలో ఉండే ఈ జలాల గుండా ప్రయాణించాల్సిందే. 2025లో సముద్ర మార్గంలో జరిగిన ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు నాలుగో వంతు.. అంటే రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు వివిధ దేశాలకు రవాణా అయ్యింది. ఇది చిన్న విషయం కాదు. పరిశ్రమలకు శక్తినిస్తుంది, రవాణాకు చోదకశక్తినిస్తుంది. జాతీయ బడ్జెట్‌లకు ఆర్థిక ఊతమిస్తుంది. అందువల్ల హర్మూజ్‌లో చిన్న ప్రకంపన రేగినా ప్రపంచం వణికిపోతుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి అత్యంత అనుసరణీయ మార్గం కాల్పుల విరమణ. అయితే ఇది పరస్పర నమ్మకంతో కాకుండా తీవ్రమైన బేరసారాల వల్ల పుట్టి ఉండవచ్చు. జలసంధి గుండా సురక్షిత రవాణా పునరుద్ధరణకు ఇరాన్ తాత్కాలికంగా అంగీకరించి ఉండవచ్చు. అయితే ప్రధానంగా ఇరాన్ నియంత్రణలోనే ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే ఓడల నుంచి సుంకాలు వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఇది బహుశా యుద్ధకాలపు వ్యూహంగా భావిస్తున్నప్పటికీ యుద్ధానంతర వాస్తవికతకు ఇది ఒక సూచన కూడా కావచ్చు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతికాలంలో అంతర్జాతీయ జలసంధిలో సుంకాలు విధించడం నిషిద్ధం. అయితే వారాల తరబడి క్షిపణులు, వైమానిక దాడులు జరిగిన పరిస్థితుల్లో కాగితంపై ఉన్న చట్టాలు కూడా పెళుసుగా మారిపోవచ్చు. షిప్పింగ్ కంపెనీలు కూడా దీన్ని అంగీకరించి ఆ భారాన్ని నిశ్శబ్దంగా తమ వినియోగదారులపై మోపుతాయి. ఫలితంగా గల్ఫ్ ఎగుమతుల ధరలు పెరుగుతాయి. ఇదే అత్యంత ఆచరణీయమైనది. బహిరంగ శత్రుత్వాన్ని అంతం చేయడానికి జరుగుతున్న దౌత్య యత్నాలకు అనుగుణంగా ఉంది. కానీ ఇరుపక్షాల వాగాడంభరాలను చూస్తే ఇది చాలా కష్టమైన పని. ఇక రెండో మార్గం మరింత ప్రమాదకరమైనది. అమెరికా తన దాడుల విషయంలో భూతల కార్యకలాపాలకు మారి వేలాది సైనికులతో తన ప్రాంతీయ ఉనికిని బలోపేతం చేసిందని, దీంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనికుల సంఖ్య సుమారు 50 వేలకు చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి వైఖరి యుద్ధ సంసిద్ధతను సూచిస్తుంది. ఇరాన్ ముడిచమురు ఉత్పత్తిలో అధిక భాగం జరిగే ఖార్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఖార్గ్ ద్వీపం హర్మూజ్ జలసంధిలో లేదు. అంటే ఆ ఒక్కదాన్నే స్వాధీనం చేసుకోవడం వల్ల హర్మూజ్ తిరిగి తెరుచుకోదు. దాన్ని సురక్షితం చేయడానికి సముద్ర మందుపాతర తొలగింపు, నిరంతర నిఘా, వాణిజ్య నౌకలకు సాయుధరక్షణ వంటి చర్యలు అవసరం. మిత్రదేశాల సహకారం లేకుండా ఒంటరిగా ఈ బాధ్యత తీసుకోవడానికి ట్రంప్ విముఖంగా ఉన్నారు. మరోవైపు ఇరాన్ నిరంతర ప్రతీకార దాడులు, అమెరికా ఆస్తుల విధ్వంసం కొనసాగడంతోపాటు భూతల యుద్ధం మొదలైతే.. అవి అమెరికా ప్రజల సహనాన్ని హరించి ఒత్తిడి పెంచుతాయి.

అమెరికా బలప్రయోగంతో హర్మూజ్‌ను బలవంతంగా తిరిపిస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనంతో పోలిస్తే, చెల్లించే మూల్యమే ఎక్కువగా ఉంటుందని వాషింగ్టన్ నిర్ధారణకు రావచ్చు. మూడో మార్గం మరింత శాశ్వతమైనది. అదే జలసంధి భద్రతను ఒక విస్తృత అంతర్జాతీయ వ్యవస్థకు అప్పగించి యుద్ధాన్ని ముగించడం. మార్చి 11న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గల్ఫ్‌తోపాటు హర్మూజ్ జలసంధి లో నౌకాయాన భద్రత కోసం తీర్మానం 2817వ తీర్మానం ఆమోదించారు. తద్వారా ఐక్యరాజ్యసమితి ఆదేశిత నావికా దళ కూటమికి చట్టపరమైన పునాది ఏర్పడే అవకాశముంది. జలమార్గాల్లో గస్తీ నిర్వహణ, అంతర్జాతీయ జెండా కింద నౌకలకు రక్షణగా నిలవడం వంటివి ఈ కూటమి నిర్వర్తిస్తుంది. అటువంటి ప్రత్యామ్నాయాల కోసం బ్రిటన్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో సహా భాగస్వాములతో చర్చలు జరిపింది. అయితే కాల్పులు పూర్తిగా నిలిచేపోతే తప్ప ఈ చర్యలు ముందుకు సాగే అవకాశం లేదు. ఒకవేళ వాషింగ్టన్ తనకు తానుగా విజయం ప్రకటించుకుని సముద్ర భద్రత ప్రశ్నను పరిష్కరించకుండా వదిలేస్తే ఈ సంకీర్ణ నమూనా తార్కిక ప్రత్యామ్నాయంగా మారుతుంది. కానీ యుద్ధానికి ముందునాటి పరిస్థితి అంత సులభంగా తిరిగి రాదనేది నిస్సందేహం. ప్రపంచ ఇంధనంలో గణనీయమైన వాటా ప్రయాణించాల్సిన ఇరుకైన జలసంధి యొక్క ఉత్తరపు తీరంపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగిస్తున్నది. ఒకవేళ ఒప్పందం కుదిరి ఘర్షణలు ముగిసినప్పటికీ ఆ మార్గంలో అంతరాయం కలిగించే, ఆలస్యం చేసే లేదా దాన్ని వాణిజ్యీకరించే సామర్థ్యాన్ని టెహ్రాన్ కలిగి ఉంటుంది. మిగతా ప్రపంచం ఈ వాస్తవికతను గుర్తించి సర్దుకుపోవాలా.. నిరోధించాలా లేదా సామూహిక పర్యవేక్షణ ద్వారా దాని తీవ్రతను తగ్గించాలా అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రాబోయే వారాల్లో రాజీ చర్చలు, ఒప్పందాలు హర్మూజ్‌పై అధికారం, చట్టం మధ్య సమతుల్యతను కూడా నిర్ధారిస్తాయి.

- నౌపడ సత్యనారాయణ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page