రెండు నెలలుగా రోదసీలో చిక్కుకున్న ఇద్దరు ఆస్ట్రోనాట్లు
వారి ప్రయాణాన్ని ఆరు నెలలు వాయిదా వేసిన నాసా
ఫిబ్రవరిలోనే వారిని తీసుకురానున్నట్లు ప్రకటన
శాస్త్రవేత్తలను వెంటాడుతున్న కల్పనాచావ్లా దారుణ ఉదంతం
అందుకే రిస్క్ తీసుకోవడానికి వెనకాడుతున్న ఆమెరికా

అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా రాటుదేలిపోయింది. అసలు ఆ ప్రయోగాలు, పరిశోధనలకు ప్రపంచంలో తొట్టతొలిసారి శ్రీకారం చుట్టినవే అమెరికా, అవిభక్త రష్యా(యూఎస్‌ఎస్‌ఆర్) దేశాలు. అంతటి ఘనచరిత్ర కలిగిన అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాకే ప్రస్తుతం ఒక అంశం ముప్పుతిప్పలు పెట్టి చెమటలు పట్టిస్తోంది. రెండు నెలల క్రితం నాసా ఆధ్వర్యంలో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల్లో అక్కడ పరిశోధనలు పూర్తి చేసి భూమికి తిరిగి చేరుకోవాల్సిన వారు అనుకోని రీతిలో తలెత్తిన సమస్యలతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వారిని వెనక్కి తీసుకురావడానికి నాసా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఫలితంగా వారి తిరిగి రాక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ రెండు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడది ఏకంగా మరో ఆరు నెలలకు వాయిదా పడిరది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు ఆస్ట్రోనాట్లను భూమిపైకి తీసుకొస్తామని నాసా ప్రకటించింది. దాంతో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కాస్త ఎనిమిది నెలల యాత్రగా మారిపోయింది. అస్ట్రోనాట్లను తీసుకురావడానికి అమెరికా ఇంతగా ఇబ్బందిపడటానికి, వెనుకాముంటు ఆలోచించడానికి ఒక కారణం ఉంది. గతంలో అమెరికన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే అంతరిక్ష యాత్ర చేసిన కల్పనాచావ్లా తిరుగు ప్రయాణంలో దారుణ మరణానికి గురి అయిన చేదు అనుభవం అమెరికన్ శాస్త్రవేత్తలను ఊగిసలాటకు, ఆందోళనకు గురిచేస్తోంది. ఎట్టకేలకు సునీతా విలియమ్స్‌ను ఫిబ్రవరిలో తీసుకురావడానికి నాసా ఫిక్స్ అయినా ఇంత సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల ఆస్ట్రోనాట్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వారి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
నిధులు, అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానం విషయంలో ఎదురులేని స్థితిలో ఉన్న అమెరికాకు చెందిన నాసా సంస్థ రెండు నెలల క్రితం అంతరిక్షంలోకి పంపిన సునీతా విలయమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమిపైకి తీసుకురావడానికి నానాపాట్లు పడుతోంది. తీవ్రంగా తటపటాయిస్తోంది. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించినా తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇంకోమాటలో చెప్పాలంటే సాహసం చేయలేకపోయింది. చివరికి ఆరు నెలల తర్వాత అంటే వచ్చే ఫిబ్రవరిలో మరో స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపి సునీతా, విల్మోర్‌లను భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనివల్ల ఆస్ట్రోనాట్లు ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుంటారని తెలిసినా వేరే గత్యంతరం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. నాసా ఇంతగా సతమతం కావడానికి గతంలో ఎదురైన ఒక చేదు అనుభవం భయపెడుతుండటమే కారణమని అంతరిక్ష రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో అమెరికా ప్రయోగించిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో పరిశోధనలు ముగించుకుని భూమిపైకి వస్తుండగా పేలిపోయి అందులో ఉన్న కల్పనా చావ్లా సహా వ్యోమగాములందరూ చనిపోయిన ఉదంతం నాసా శాస్త్రవేత్తలను భయపెడుతోంది. ధైర్యంగా ముందడుగు వేయకుండా వెనక్కి లాగుతోంది. ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలయమ్స్ మాదిరిగానే కల్పనాచావ్లా కూడా భారత మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనాట్. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘోర ప్రమాదం పునరావృతం అవుతందేమోనన్న భయంతోనే నాసా ఒకటికి వెయ్యిసార్లు ఆలోచిస్తోంది.
కల్పనా చావ్లా దారుణ మరణం
కల్పనాచావ్లా.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. లేదంటే పోటీ పరీక్షల ప్రశ్నల్లో ఒక ప్రశ్నగా ఎవరికైనా ఎదురై ఉండవచ్చు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ మాదిరిగానే కల్పన కూడా భారత సంతతికి చెందిన మహిళ. పంజాబ్‌లోని కర్నాల్‌కు చెందిన ఆమె అక్కడే ఇంజినీరింగ్ చదివిన అనంతరం టెక్సాస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, కొలరాడో యూనివర్సిటీ నుంచి అదే కోర్సులో పీహెచ్‌డీ చేసింది. 1994లో నాసాలో అస్ట్రోనాట్‌గా ఎదిగింది. పలు అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొంది. అదే క్రమంలో 2003లో ఆమెరికా ప్రయోగించిన రోదసీ నౌక కొలంబియాలో మరికొందరు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లింది. అక్కడి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)లో కొన్ని రోజులు పరిశోధనలు చేసిన అనంతరం వ్యోమగాములు కొలంబియా స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. 2003 ఫిబ్రవరి ఒకటో తేదీన మరో 16 నిమిషాల్లో భూమిపై ల్యాండ్ కావాల్సిన కొలంబియా స్పెస్ షటిల్‌లో హఠాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తి మొత్తం పేలిపోయింది. దీంతో కల్పనా చావ్లా సహా ఆరుగురు ఆస్ట్రోనాట్స్ దుర్మరణం పాలయ్యారు. అంతుకుముందు 1986 జనవరిలో కూడా ఛాలెంజర్ స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయి అందులో ఉన్న అస్ట్రోనాట్స్ చనిపోయారు. నాసా చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ ఈ రెండు ప్రయోగాలు. వీటిని దృష్టిలో ఉంచుకునే సునీతా విలియమ్స్ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి నాసా సుముఖత చూపడంలేదు.
సునీత తిరిగి రావడంలో ఇబ్బందులు
కల్పనా చావ్లా మాదిరిగానే సునీతా విలియమ్స్ కూడా ఇండో అమెరికన్ అస్ట్రోనాట్. అంతరిక్షయానం చేసిన తొలి భారత సంతతి మహిళగా కల్పనా రికార్డు సృష్టిస్తే.. సునీతా విలియమ్స్(58) రెండో భారత సంతతి మహిళగా ఖ్యాతి గాంచారు. నాసా తరఫున అమె పలుమార్లు అంతరిక్ష యాత్ర చేశారు. అదేవిధంగా జూన్ ఐదో తేదీన కమాండర్ బ్యారీ విల్మోర్(61) అనే మరో ఆస్ట్రోనాట్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఎనిమిది రోజుల అధ్యయనానికి వెళ్లారు. ప్రముఖ విమానాల తయారీ సంస్థ అయిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ వారిని ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లింది. స్టార్ లైనర్ రోదసీలో ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయినా విజయవంతంగా ఆస్ట్రోనాట్లను ఐఎస్‌ఎస్‌కు చేర్చింది. అయితే ఆ తర్వాత స్టార్‌లైనర్‌లో సమస్యలు మొదలయ్యాయి. స్పేస్‌క్రాఫ్ట్‌కు ఇంధనంగా వినియోగించి హీలియమ్ లీక్ కావడంతోపాటు స్పేస్‌క్రాఫ్ట్ ఎగరడానికి ఉపకరించే థ్రస్టర్స్, ప్రొపెల్ వాల్వ్స్ కూడా పనిచేయడం మానేశాయి. వాటికి నాసాలోని కంట్రోల్ రూము నుంచే బాగు చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మరో స్పేస్ షటిల్‌ను పంపి సునీత, విల్మోర్‌లను తీసుకురావాలని నాసా నిర్ణయం తీసుకుంది. అయితే ఫిబ్రవరిలో గానీ ఇది జరిగే అవకాశంలేదు.
ఇద్దరి కోసం కోట్లు ఖర్చు
ప్రత్యామ్నాయ స్పేస్ షటిల్ కోసం నాసా కోట్ల ఖర్చుకు సైతం సిద్ధమవుతోంది. ఆ మేరకు స్పేస్ ఎక్స్ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఆ సంస్థకు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ-9 రాకెట్‌ను పంపనున్నారు. ఇది 2025 ఫిబ్రవరిలో రోదసీలోకి వెళ్లనుంది. నిజానికి ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో స్పెస్ ఎక్స్‌కు చెందిన ఒక వ్యోమనౌక ఐఎస్‌ఎస్ వద్ద పార్క్ చేసి ఉంది. అది ఈ నెలలోనే భూమికి తిరిగి రానుంది. కానీ అందులో వెళ్లినవారే తిరిగి రానుండటంతో సునీతా, విల్మోర్‌కు చోటు దక్కలేదు. అలాగే మరో స్పెస్ షటిల్ సూయాజ్ కూడా అక్కడే ఉంది. అందులో కూడా రష్యన్ ఆస్ట్రోనాట్స్ తిరిగి రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ప్లాన్ చేసిన ఫిబ్రవరిలో పంపే వ్యోమనౌకే గత్యంతరంగా మారింది. వాస్తవానికి ఇందులో నలుగురు అస్ట్రోనాట్స్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ సునీతా, విల్మోర్‌ల కోసం ఇద్దరిని మాత్రమే పంపుతున్నారు. తిరుగు ప్రయాణంలో నలుగురు వస్తారు. అలాంటప్పుడు సునీత, విల్మోర్‌లను తీసుకెళ్లి రోదసీలోనే రిపేర్‌కు వచ్చిన స్టార్‌లైనర్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తవచ్చు. దానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను నాసా సిద్ధం చేసింది. దాన్ని ఈ నెల ఆరో తేదీనే ఆస్ట్రోనాట్లు లేకుండా ఖాళీగానే భూమి మీదకు తీసుకురానున్నారు. ఆరుగంటల ప్రయాణం తర్వాత అది న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో ల్యాండ్ కానుంది. ఈ ప్రక్రియ మొత్తం రిమోట్‌తోనే జరగనుంది.
ఆస్ట్రోనాట్ల ఆరోగ్యంపై ప్రభావం
ఈ పరిస్థితుల్లో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత, విల్మోర్‌ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అక్కడి వాతావరణానికి, భూమిపై ఉండే వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అందుకే వ్యోమగాములను నిర్ణీత కాలపరిమితితోనే, తగిన ఆరోగ్య ఏర్పాట్లతో అంతరిక్షంలోకి పంపిస్తుంటారు. కానీ ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు ఏర్పడి ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన సునీత, విల్మోర్‌లో ఇప్పటికే రెండు నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు. దాంతో సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆమెకు కంటి చూపు క్షీణిస్తోంది. అంతరిక్ష ప్రయాణాలు చేసేవారికి ఎక్కువగా న్యూరో ఒకులార్ సిండ్రోమ్ అనే సమస్య ఎదురవుతుంది. దీని వల్ల కంటిచూపు క్షీణిస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు మైక్రోగ్రావిటీ వల్ల ఈ సమస్య ఎదురవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అలాగే సునీతా విలియమ్స్ శరీర ఎముకల బలం కూడా తగ్గిపోతోందని తెలిసింది. ఆమె ఎముకల్లో సాంధ్రత తగ్గిపోయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏకంగా మరో ఆరు నెలలు అంతరిక్షంలో ఉండిపోతే సునీత, విల్మోర్‌ల ఆరోగ్యంపై ఇంకెటువంటి ప్రభావం పడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు వారిద్దరూ క్షేమంగా భూమికి తిరిగి రాగలరా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Hozzászólások