సినిమా పాలిట వారే ‘పెద్ద’ విలన్లు!
- DV RAMANA
- May 24, 2024
- 4 min read
`అమాంతం పెరుగుతున్న నిర్మాణ బడ్జెట్
`స్టార్ హీరోలు, డైరెక్టర్ల పారితోషికాలకే సింహభాగం
`రకరకాల రైట్స్ పేరుతో ముందే ఖర్చులు రాబట్టుకుంటున్న నిర్మాతలు
`సినిమా ఆడకపోతే నష్టపోతున్నది హాళ్ల యజమానులే
`నిర్వహణ భారమూ తడిసిమోపెడే
`పతనావస్థలో తెలుగు చిత్రరంగం
రెండు దశాబ్దాల క్రితం.. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఇంట్లో పెద్దవారు వెళ్లి టికెట్లు తీసుకొచ్చేవారు.. ఇంటిలిపాదీ, వీలైతే స్నేహితులు, బంధువులతో కూడా కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తూ సరదాగా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా..?
విదేశాల్లో.. ఉదాహరణకు అమెరికాలో స్పైడర్‌మాన్ సినిమా చూడటానికి ఏడు డాలర్లు పెట్టి టికెట్ కొంటే.. దాని పక్కనే ఆడుతున్న అగ్రహీరో నటించిన తెలుగు సినిమా చూడటానికి 22 డాలర్లు పెట్టి టికెట్ కొనాల్సి వచ్చింది. అంటే తెలుగు సినిమా చూడటానికి చేసిన ఖర్చుతో స్పైడర్‌మాన్ లాంటి మూడు బ్రహ్మాండమైన హాలీవుడ్ సినిమాలు చూడవచ్చన్నమాట!
ఈ రెండు ఉదంతాలు చూస్తే రేంజ్ ఉచ్చులో చిక్కుకుని తెలుగు సినిమా చచ్చిపోతోందని ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. టీవీలు, ఇంటర్నెట్ రాకముందు సగటు జీవికి సినిమాయే అందుబాటులో ఉన్న ఏకైక వినోదంగా ఉండేది. ఇప్పుడు ఆ సినిమాయే అత్యాశకుపోయి తన విషాదాంతానికి తానే ఉరితాడు బిగించుకుంటోంది. కాదు కాదు.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న కొద్దిమంది సినీపెద్దలే తెలుగు సినిమాకు పాడె కడుతున్నారు. దాని ఫలితంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది థియేటర్లు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. వీటిలో చాలావరకు గొడౌన్లుగా, ఫంక్షన్ హాళ్లుగా మారిపోతున్నాయి.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇటీవల పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ సినిమాహాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. అదేంటి.. విద్యాసంస్థలకు రెండు నెలలపాటు సెలవులు ఇచ్చే వేసవి కాలం సినిమాలకు బిజీ సీజన్ కదా! ఈ సమయంలో హాళ్లను మూసివేయడం ఏమిటి? అని సగటు సినీ ప్రేక్షకుడు ఆశ్చర్యపోవచ్చు. ఈ పరిస్థితికి ఎన్నికలు, ఐపీఎల్ క్రికెట్ సీజన్ వల్ల ప్రేక్షకులు సినిమా హాళ్లకు వచ్చే పరిస్థితి లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని సినీరంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ రెండిరటి వల్లే పెద్ద హీరోల సినిమాల రిలీజ్‌లను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆ పెద్దలు చెబుతున్నారు. కానీ ఆలోచిస్తే.. వారు చెబుతున్నదాంట్లో లాజిక్ లేదని కచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే.. ఐపీఎల్ క్రికెట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత 15 ఏళ్లుగా ప్రతి ఏటా వేసవిలోనే ఆ టోర్నీ జరుగుతోంది. మరి ఇన్నేళ్లు లేనిది ఈ ఏడాదే అది సమస్యగా ఎందుకు కనిపిస్తోంది? అలాగే సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే ఐదేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికలు గత మూడు నాలుగు పర్యాయాలుగా చూస్తే వేసవి కాలంలోనే జరుగుతున్నాయి. 2014, 2019 ఎన్నికలు కూడా ఇంచుమించుగా వేసవి సీజనులోనే జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రమే ఎన్నికలను సినీపెద్దలు సినిమా పాలిట బూచిగా చూపిస్తున్నారు. వారు చెబుతున్న మరో కారణం ఓటీటీ ప్లాట్‌ఫారం. లెక్కలేనని ఓటీటీ ప్లాట్‌ఫారాలు రావడం వల్ల సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకులు గణనీయంగా తగ్గిపోయారంటున్నారు. ఇది కూడా అర్ధసత్యమే. ఈ సాకులు చూపిస్తూ తాము చేస్తున్న తప్పిదాలను, తమ లాభాపేక్షను సినీపెద్దలు మరుగుపరిచేస్తున్నారు.
40 ఏళ్లలో చూడని దుస్థితి
గతంలో వేసవి సీజనులో థియేటర్లు కిటకిటలాడుతుంటాయి. గతంలో క్యూలైన్లు హాలు బయటవరకు కనిపించేవి. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ వచ్చాక మూడు నాలుగు రోజుల ముందే హౌస్‌ఫుల్ అయిపోయేవి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని పండుగల సీజన్ మాదిరిగానే వేసవిలోనూ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ వేసవిలో ఆ పరిస్థితి లేకుండాపోయింది. ఎన్నికలు, ఐపీఎల్ పేరుతో పెద్ద హీరో సినిమాల రిలీజ్‌లను వాయిదా వేసేశారు. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా భారీగా ఖర్చు చేసి థియేటర్లకు వెళ్లి చూడటానికి ప్రేక్షకులు సుముఖంగా లేరు. ఫలితంగా చాలా థియేటర్లలో కనీసం ఐదు శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. సినిమా చాలా బాగుంది అనే టాక్ వస్తేనే కొందరు హాళ్లకు వెళ్లి చూస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు హిట్ అయ్యి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. టికెట్ల ధరలు, థియేటర్లలో తినుబండారాల పేరుతో జరుగుతున్న దోపిడీ కూడా ప్రేక్షకులను సినిమా హాళ్లకు రాకుండా చేస్తున్నాయి. ఓటీటీ ప్రభావం కూడా కొంత ఉంది. ఒక కుటుంబం సినిమా హాలుకు వెళితే టికెట్లకే వెయ్యి రూపాయలు అవుతున్నాయి. దాంతో సగటు ప్రేక్షకులు భయపడిపోతున్నారు. అదే సమయంలో హోం థియేటర్లు, ఓటీటీలో వచ్చే సినిమాలను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి టీవీ స్క్రీన్‌పై చూడటానికే అధిక శాతం మొగ్గు చూపుతున్నారు.
వేలాది హాళ్లు మూత
సినిమా హాళ్ల నిర్వహణ కూడా రాను రాను భారంగా మారుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే సింగిల్ థియేటర్స్‌కు కరెంటు ఛార్జీల భారం ఎక్కువగా ఉందంటున్నారు. థియేటర్‌లో షో వేసినా, వేయకపోయినా నిర్ణీత కిలోవాట్ల లోడ్‌కు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఇక థియేటర్ సిబ్బంది జీతభత్యాలు, హాలు మెయింటెనెన్స్ వంటి ఖర్చులను జనం వచ్చినా రాకపోయినా కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా సినిమా డిజిటల్ ప్రింట్ పేరుతో క్యూబ్ సంస్థకు అద్దె కట్టాల్సి ఉంటుందని, అది చాలా ఎక్కువగా ఉందని హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్లే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజులపాటు మూసివేశారు. ఆంధ్రలో అయితే మల్టీ స్క్రీన్ థియేటర్లలోనూ ప్రేక్షకులను ఆకర్షించడానికి లాటరీ ద్వారా బహుమతులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంత భారాన్ని తట్టుకోలేక మన రాష్ట్రంలో చాలా సినిమా హాల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. తెలంగాణలో గత పదేళ్లలో రెండువేల స్క్రీన్స్ మూతపడ్డాయని, మరో 450 సింగిల్ థియేటర్లు త్వరలో మూతపడనున్నాయని ఎగ్జిబిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్మాతలు తమ లాభాల్లో ఎగ్జిబిటర్స్‌కు వాటాలు ఇవ్వాలని ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనిపై నిర్ణయం ప్రకటించేందుకు జూలై ఒకటో తేదీ వరకు నిర్మాతల మండలికి గడువు ఇచ్చింది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారని, బెనిఫిట్ షోలు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారని సంఘం ఆరోపించింది. అందువల్ల ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించబోమని స్పష్టం చేసింది.
ఈ దుస్థితికి కారకులెవరు?
సినిమా హాళ్ల దుస్థితికి ఇవన్నీ పైకి కనిపించే కారణాలే. కానీ అసలు కారకులు తెరమరుగైపోతున్నారు. దీనికి అసలు విలన్లు నిర్మాతలు, పెద్ద హీరోలు, డిస్ట్రిబ్యూటర్లే అని చెప్పాలి. సినిమా ప్రదర్శించినందుకు హాలు అద్దె మాత్రమే ఇచ్చి మిగతా లాభాలన్నీ వారే జేబులో వేసుకుంటున్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్నామని చెబుతూ సినిమా నిర్మాణ బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆ ఖర్చులో సింహభాగం స్టార్ క్యాస్ట్‌కే పోతోంది. పెద్ద హీరోలుగా చెలామణీ అవుతున్నవారికే పారితోషికం పేరుతో రూ.100 కోట్లు, రూ.150 కోట్లు సమర్పిస్తున్నారు. మిగతా పది ఇరవై కోట్లతో సినిమా తీసి.. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నామని చెబుతున్నారు. కొందరు అగ్రహీరోలైతే సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లు కూడా తక్కువేమీ తీసుకోవడం లేదు. ఇంతకుముందులా మెజారిటీ సినిమాల్లో భారీ సెట్టింగులేమీ ఉండటం లేదు. అయినా వందల కోట్ల బడ్జెట్ కరిగిపోవడానికి కారణం ఈ స్టార్ హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లే. ఇక నిర్మాతలు కూడా తమ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. సినిమా ఆడినా ఆడకపోయినా ముందే ఖర్చుపెట్టిన రాబట్టుకునేందుకు పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తున్నారు. థియేట్రికల్ హక్కులు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ రకరకాల పేర్లతో ముందే భారీ మొత్తాలకు అమ్మేసుకుని బయటపడిపోతున్నారు. తీరా సినిమా హాళ్లలోకి వచ్చిన తర్వాత ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులే మునిగిపోతున్నారు. సినిమా నిర్మాణంలో జాప్యం కూడా హాళ్ల దుస్థితికి ఒక కారణం. గతంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు వంటి అగ్రహీరోల సినిమాలు వారానికికొకటి రిలీజ్ అయ్యేవి. నెల రెండు నెలలకో సినిమా వచ్చేలా వీరు చూసుకునేవారు. కానీ ఇప్పుడి పెద్ద హీరోలు, దర్శకులు ఒక్కో సినిమా తీయడానికి నెలలు, సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా పెద్ద సినిమాలు తగ్గిపోయి సినిమాహాళ్లు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితులో సినిమా చచ్చిపోతోంది. సినిమా వ్యాపారం బతకాలి అంటే ఎక్కువ మంది హాల్స్‌కు రావాలి. అది జరగాలంటే సినిమా ఖర్చు తగ్గాలి. అంటే హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. సినిమా నిర్మాణ సమయం తగ్గాలి. కానీ ఇవన్నీ జరిగేవేనా?!
Comments