ధర్మానవారి ఫీల్‌గుడ్ తంత్రం!
టీడీపీ కొత్త అభ్యర్థిని పలుచన చేసే ఎత్తుగడలు
విజయం ఏకపక్షమన్న ఫీలర్లతో ఓటర్లతో మైండ్‌గేమ్
కానీ గొండు శంకర్ కమ్ముకొస్తున్న విషయం మంత్రికి తెలుసు
అందుకే ఈజీ అని చెప్పుకొంటున్నా చెమటోడుస్తున్న ఆ కుటుంబం
సొంత ఛరిష్మాను చెరిపేసుకున్న ఫలితమే ప్రస్తుత ఇరకాట పరిస్థితి

‘శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా గుండ కుటుంబానికి చెందిన వ్యక్తులు బరిలో లేరు కాబట్టి మనం సునాయాసంగా గెలుస్తాం.. కచ్చితంగా 15వేలకు తక్కువ మెజార్టీ రాదు.. ప్రశాంతంగా పని చేసుకోండి.. ఆ గుంటడు మనకు అసలు పోటీయే కాదు’.. ఇవీ వైకాపా అభ్యర్థి ధర్మాన సహా ఆయన శిబిరంలోని ఆంతరంగికులు చెబుతున్న మాటలు. వాస్తవానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగమే ఇది. ఈ విషయం పత్రికలో, ప్రతిపక్షాలో చెప్పక్కర్లేదు. ధర్మాన స్టేట్‌మెంట్లు విని స్వయంగా ఆయన కోసం ప్రచారంలో తిరుగుతున్న నాయకులే చెబుతున్న మాటలివి. వాస్తవానికి వైకాపా అభ్యర్థి శ్రీకాకుళంలో అడకత్తెరలో పోకచెక్కలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఓసారి తంగి సత్యనారాయణ, మరోసారి పసగాడ నారాయణ, ఇంకోసారి చల్లా లక్ష్మీనారాయణ తప్ప మిగిలిన కాలమంతా అటు గుండ, ఇటు ధర్మాన కుటుంబాలే పరిపాలించాయి. అందుకే ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా పెద్ద అవమానంగా ఎవరూ భావించలేదు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. 1985 తర్వాత తొలిసారి టీడీపీ టికెట్ గుండ కుటుంబాన్ని కాదని బయటి నేతకు దక్కింది. అది కూడా ఒక యువకుడికి. అదే ఇప్పుడు సమస్యగా, అర్థంకాని విధంగా తయారైంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నియోజకవర్గంలో ధర్మాన లేదా గుండ కుటుంబీకులు పోటీ చేస్తే పెద్ద సమస్య ఉండేదికాదు. అప్పలసూర్యనారాయణ లేదా లక్ష్మీదేవి చేతిలో ధర్మాన ఓడిపోతే ఒక లెక్క. ఎందుకంటే.. వీరిద్దరూ కూడా గాలికి అనుగుణంగా రాజకీయాలు చేస్తారు. ప్రజలు కూడా ధర్మాన ప్రసాదరావు మీద విరక్తి ఉంటే గుండ కుటుంబాన్ని గెలిపిస్తారు. గుండ కుటుంబం మీద కోపమొస్తే ధర్మాన ప్రసాదరావును అందలమెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరి మీదా వైరం పెంచుకోరు, విమర్శించుకోరు. కానీ మొదటిసారి ధర్మానను టీడీపీ కొత్త అభ్యర్థిని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి ఎదురైంది. రెవెన్యూ శాఖతో ఎవరికైనా అవసరం పడి తహసీల్దార్‌కు ఓ మాట చెప్పండి అంటే.. ‘రెవెన్యూ మంత్రి స్థాయిలో ఉన్న తాను తహసీల్దార్‌కు ఏమని ఫోన్ చేయగలను అని, పోనీ కలెక్టర్‌కు ఫోన్ చేయండి అంటే.. ఐఏఎస్ స్థాయి అధికారులకు ఫోనెలా చేస్తాం’ అని తెలివిగా తప్పించుకునే ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు తనకన్నా చాలా జూనియర్ అయిన ప్రత్యర్థిని విమర్శించలేక.. అలా అని ఇన్నాళ్లూ తనకు ప్రత్యర్థిగా ఉన్న గుండ కుటుంబాన్ని రోడ్డున పెట్టలేక సతమతమైపోతున్నారు. గుండ లక్ష్మీదేవికి టికెటివ్వనందున ఆమెతో ఉన్న టీడీపీ క్యాడర్ తనకోసమే పని చేస్తుందని ధర్మాన భావిస్తున్నారు. అదే సమయంలో తన క్యాడర్‌లో జోష్ నింపేందుకు శంకర్ అసలు తనకు పోటీయే కాదని చెప్పుకొస్తున్నారు.
అటువంటి వారితో ఒరిగేది శూన్యం
కానీ క్షేత్రస్థాయిలో అటువంటి వాతావరణం కనిపించడంలేదు. ఆ విషయం ధర్మానకూ తెలుసు. కానీ తన గెలుపు సునాయాసమన్న పాజిటివ్ ఫీలర్‌ను జనాల్లోకి వదిలి తద్వారా ఓటు లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చాప కింద నీరులా తన చుట్టూ ఇప్పటికే అల్లుకుపోయారన్న విషయం ఒక్క ధర్మానకే తెలుసు. శంకర్ బలాన్ని పసిగట్టలేని కొందరు మాత్రం ధర్మాన వైపు మొగ్గు చూపుతున్న మాట వాస్తవం. ధర్మాన నచ్చకో, ఆయన పార్టీ నచ్చకో తెలియదు గానీ గత కొన్నేళ్లుగా ఆయనకు దూరంగా ఉన్న కస్పా శ్యామలరావు, బుర్రా వెంకటరావు వంటి మాజీ కౌన్సిలర్లు గొండు శంకర్‌కు టీడీపీ టికెటిచ్చిన తర్వాత మళ్లీ ధర్మాన గూటికే చేరారు. అలాగే మాజీ కౌన్సిలర్ బస్వా లక్ష్మి తనయుడు, పొందూరు రమణ లాంటి వారు కూడా ధర్మాన దగ్గర కండువా కప్పుకున్నారు. అయితే ధర్మాన గూటికి వెళ్లినవారి గురించి ప్రచారం జరుగుతోందే తప్ప వైకాపా గూటి నుంచి శంకర్‌కు జై కొట్టినవారి కోసం ఎక్కడా ఆ వర్గం చెప్పుకోవడంలేదు. సింగుపురం సర్పంచ్ ఆదిత్యనాయుడు, మాజీ సర్పంచ్ మోహనరావులు వైకాపాను వీడి శంకర్ వెనుక ఇప్పటికే తిరుగుతున్నారు. సాధారణంగా అర్బన్‌లో ఉండే మాజీ కౌన్సిలర్ల కంటే గ్రామాల్లో మాజీ సర్పంచులకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది. అసలు విషయం చెప్పాలంటే.. గతంలో ధర్మానకు దూరం జరిగి మళ్లీ ఇప్పుడు ఆయన వెనుక చేరినవారు ఇన్నాళ్లూ భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప వారి మనసు పెద్దపాడు బంగ్లాలోనే ఉంది. అందువల్ల వారి రాకతో కొత్తగా ధర్మానకు వచ్చే ఓట్లు ఉండకపోవచ్చు.
చాప కింద నీరులా ప్రత్యర్థి
2010లోనే శ్రీకాకుళం కౌన్సిల్ పదవీ కాలం ముగియడంతో 14 ఏళ్ల పాటు పదవులకు దూరంగా ఉన్న ఈ నాయకుల స్థానంలో ఆయా ప్రాంతాల్లో కొత్త తరం వచ్చింది. ఇప్పుడు ఓటున్నవారు కొత్త నాయకులతో అడుగులు వేస్తుండటం వల్ల తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది మళ్లీ ధర్మాన గూటికి చేరారు. 14 ఏళ్లపాటు జనానికి మొహం చూపించకుండా సొంత వ్యాపారాలు చేసుకున్న వీరిలో ఎంతమందికి ఇప్పుడు డివిజన్లలో పట్టుందో వైకాపా నాయకులకు తెలుసు. సహజంగానే ధర్మాన ప్రసాదరావుకు నగరం మీద పట్టుంది. ఎందుకంటే.. ఇక్కడ టీడీపీ నాయకుల కంటే వైకాపా నాయకులు బలమైనవారు. దీనికి తోడు గత రెండున్నరేళ్లుగా శంకర్ రూరల్, గార మండలాల్లోనే విస్తరించారు. నగరంలో సత్తా చాటడానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనే ఒక పదవి లేకపోవడం వల్ల లక్ష్మీదేవి నివాసముంటున్న ప్రాంతంలో రాజకీయాలు చేయలేకపోయారు. అందువల్ల ఆయన నగరంలో బలహీనంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీదేవి వెనుక ఉన్న క్యాడర్‌లో ఎక్కువ మంది నగరానికి చెందినవారే. కానీ శంకర్ తెలివిగా నగర మధ్యభాగాన్ని వదిలేసి, నగరం చుట్టుపక్కల ప్రాంతాలను శంకర్ ఎప్పుడో కమ్మేశారు. అటు బలగ, పీఎన్ కాలనీ ప్రాంతాలతో పాటు ఇటు కలెక్టరేట్, మరోవైపు పెద్దపాడుల్లో ఆయన ఎప్పుడో జెండా ఎగరేశారు. దీనికి తోడు అర్బన్ ఓటరు ప్రస్తుత ప్రభుత్వ పాలనపై పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. తమకు అండగా నిలబడగలడు అన్న భరోసా ఇవ్వగలిగితే అర్బన్ ఓటును కూడా టీడీపీ అభ్యర్థి సంపాదించుకోగలరన్న విషయం ధర్మానకు తెలుసు. ఉద్యోగులు, వ్యాపారులు, టాక్స్ పేయర్లు, నిరుద్యోగులు ఎక్కువగా ఉండే నగరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అన్న ప్రశ్నే ఈసారి తలెత్తదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామా లేదా అన్నదే లెక్క.
సొంత ముద్ర చెరిపేసుకుని ఆపసోపాలు
అధికార పార్టీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా ధర్మాన తన సొంత ఛరిష్మాతో అటువంటి ఓట్లు జారిపోకుండా పట్టుకునేవారు. కానీ 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ధర్మాన తన క్యాంప్ కార్యాలయానికి అంటించిన నోటీసును ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. వ్యక్తిగత పనుల కోసం, బదిలీల కోసం, సిఫార్సు లేఖల కోసం తన వద్దకు రావద్దంటూ తాటికాయంత అక్షరాలతో ఆ నోటీసు పెట్టారు. ఆ తర్వాత రెండున్నరేళ్లకు మంత్రి పదవి చేపట్టిన తర్వాత గన్‌మెన్లను ముందుంచి గేటును క్లోజ్ చేసేశారు. తనతో వ్యాపారాలు చేసేవారు, ఆర్థిక వ్యవహారాలు నడిపేవారు మాత్రమే లోనికి వచ్చేలా అనుమతులిచ్చారు. ఇటువంటి చర్యల వల్లే ధర్మాన తన సొంత మార్కును చెరిపేసుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జనం కోరుకుంటున్నది ధర్మాన లాంటి దూరదృష్టి, గుండ అప్పలసూర్యనారాయణ లాంటి గ్రౌండ్ టు ఎర్త్ యాక్సెస్ కలగలిసిన నాయకుడ్ని. ఈ రెండూ శంకర్‌లో ఉన్నాయని మొదటిగా గుర్తించింది ధర్మానేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అందుకే గెలుపు కోసం పెద్దగా కష్టపడక్కర్లేదంటూనే ఆయన కుటుంబం మొత్తం చెమటోడుస్తోంది. ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు తనకు రాగలవో బంగ్లాలో కూర్చుని చెప్పగల ధర్మాన ఇప్పుడు పేరుపేరునా ఫోన్లు చేసి అందరినీ పలకరిస్తున్నారు. అన్ని కులాలతోనూ సమావేశమవుతున్నారు. ధర్మానకు ఎక్కడ పట్టుందో అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ధర్మానకు ఎక్కడ తక్కువ ఓట్లు వస్తాయో అక్కడే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు. అయితే శ్రీకాకుళం ఓటర్లు ఎప్పుడూ సైకిల్ సింబల్‌తోనే ఉన్నారు. లక్ష్మీదేవికి తప్ప టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేది లేదని చెప్పుకొచ్చిన అనేకమంది ఆమె అభిమానులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ నిర్ణయానికి తలవంచుతున్నారు. మహా అయితే ఓటును ప్రభావితం చేయగల ఓ ఇద్దరు ముగ్గురు మిగిలిపోతారు. నిన్నటి వరకు టికెట్ మారుస్తారు, లక్ష్మీదేవికే మళ్లీ బి`ఫారమ్ ఇస్తారన్న ప్రచారాల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైకాపా బలాబలాలను ఎవరూ సరిగా లెక్కించలేకపోయారు. కొత్త ఏడాది నుంచి నియోజకవర్గంలో ప్రతిరోజూ మారుతున్న పరిణామాలు మరో కొత్త లెవెల్‌లో ఉంటాయనడంలో సందేహం లేదు.
Comments