యానిమల్ కొవ్వులో కాలిపోతున్న వైకాపా
జగన్‌ను మీడియా ముందుకు తెచ్చిన లడ్డూ
భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం
డిఫెన్స్‌లో పడిపోయిన ప్రతిపక్షం
సత్యంన్యూస్, శ్రీకాకుళం

98 రన్స్ వద్ద డిఫెన్స్ బదులు బాబు కొట్టిన షాట్‌కు బంతి కనిపించడం లేదు కూటమి ఎమ్మెల్యేలతో 98వ రోజు మీటింగ్ పెట్టారు. వందరోజుల మైలు రాయిని చేరుకోబోతున్న తమ పాలనపై ప్రజల వద్దకు పండగలా ఎలా తీసుకువెళ్లాలనే చర్చ జరిగింది. చంద్రబాబు పడుతున్న కష్టం, పనిలో ఆయన వేగం, చేసిన మంచిపనులపై పవన్ కల్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. చివర్లో చంద్రబాబునాయుడు ఆవేదనతో శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో యానిమల్ ప్యాట్ కూడా వుందని బాధపడుతూ చెప్పారు. క్షణాల్లో అణుబాంబు పొగలా వ్యాపించింది. ఇది నిజమా? అసలు ఆ మాట ఆయన అన్నారా? సంచలనం కోసం ఏదో ఫేక్ వార్త అయ్యుంటుందని అనుకొన్నారు అంతా. కాసేపటికి ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. కానీ ఆలోపే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. చంద్రబాబు మహాపాపం చేశారు. దేవుడి ప్రసాదంపై దారుణమైన మాటలు మాట్లాడారంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇటు టిడిపిలో నాయకులు కూడా వారి విమర్శలకు వెంటనే ఎవరూ స్పందించలేదు. అప్పటికి 98 పరుగులు పూర్తి చేసిన బాబు క్రీజు వదిలి ముందుకు వచ్చారు. వైకాపా భలే విసిరింది బంతి అనుకొన్నారు అంతా. తెల్లారింది. మీడియాలో వచ్చిన ఆ వార్తలను జనం చదువుకొన్నారు. చర్చ మొదలైంది. కాస్తా పొద్దెక్కింది, ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం పెట్టారు. నెయ్యి శాంపిల్స్ మీద చేయించిన ల్యాబ్ రిపోర్టులు బహిర్గతం చేశారు. 98వ పరుగు వద్ద బాబు కొట్టిన బంతి కనిపించక బైర్లు కమ్మినట్లుగా.. వైకాపా మొహాల్లో నెత్తు చుక్క లేదు. ఎలా తలెత్తుకోవాలో కూడా తెలియలేదు. కోట్లాది భక్తుల శతాబ్దాల నమ్మకం మీద వైకాపా చేసిన వికృత అపచారంగా దేశం మొత్తం చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో దేశం మొత్తం మీద జగన్మోహన్‌రెడ్డి ఒంటరైపోయారు. అధికార ప్రభుత్వం వందరోజుల పాలన వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్షం ఇప్పుడు తన పార్టీ ప్రతిష్టను నిలుపుకోవడం, తన మీద వస్తున్న ఆరోపణలను డిఫెన్స్ చేసుకోవడంతోనే సమయం సరిపోతుంది. చంద్రబాబు రాజకీయమంటే ఇలానే ఉంటుంది. కేవలం వ్యక్తిని నిర్మూలించడం కాకుండా మొత్తం ఆ వ్యవస్థనే లేపేయడంలో చంద్రబాబు దిట్ట. ఆయన కేపబిలిటీని తక్కువ అంచనా వేసి కేవలం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు, తనకు మధ్య మరెవరూ ఉండక్కర్లేదని జగన్మోహన్‌రెడ్డి నమ్మడం వల్ల ఇప్పుడు వైకాపా తరఫున తిరుపతి లడ్డూ కేసును భుజానికెత్తుకునే బలమైన నాయకత్వం కూడా కనిపించడంలేదు. తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే ఎక్కువ మంది భక్తులు నమ్ముతున్నారు. అందుకు కారణం.. ల్యాబ్ రిపోర్టును బహిర్గతం చేయడమే. నెయ్యి సప్లై చేసిన కంపెనీ కాదని చెబుతున్నా, గుజరాత్‌లో ఉన్న ల్యాబ్ కాకుండా దేశంలో మరేదైనా పెద్ద ల్యాబ్ రిపోర్టు కావాలని డిమాండ్ చేయాలన్నా వైకాపాకు ఇప్పుడు జనం మద్దతు అవసరం. వీలైనంత వరకు గుజరాత్ ల్యాబ్ రిపోర్టుపైనే టీడీపీ ఈ వ్యవహారాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తుంది. జగన్మోహన్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. పార్టీ వీడి వెళ్లిపోతున్నారని ప్రశ్నిస్తే నాయకులు జనం నుంచి పుడతారని, వారు పోతే వేరొకరు వస్తారని జగన్ పేర్కొనడం ఆయన వ్యవహార శైలికి నిదర్శనం. వంద రోజుల కూటమి పాలనలో వైఫల్యాలు లేవా అంటే.. ఉన్నాయి. కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్లే పరిస్థితి ఇప్పుడు తిరుపతి లడ్డూ పుణ్యమాని జగన్‌కు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలసిన అంశం ఏమంటే.. పని చేయకున్న పర్వాలేదు పబ్లిసిటీ పెంచుకోమని ఏ సలహాదారుడు సలహా ఇవ్వలేదు. చంద్రబాబు 100రోజుల పాలన పైన క్రికెటర్ మిథాలి రాజ్, బుల్లితెర నటి ఉదయభాను ప్రచారం చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు భజనపరులను కాకుండా న్యూట్రల్ మేధావులను, రాజకీయాలకు సంబంధం లేని సెలబ్రిటీలను నిలుపుకోవాలి. ఎన్నికల సమయంలో పనికి వస్తారు. జగన్ ఒక్కరే యుద్ధం చేయలేరు. యుద్ధం చేయడానికి కత్తిలాంటి సర్వ సైన్యాధ్యక్షుడు, సైన్యం, వ్యూహకర్తలు, భటులు,బుర్ర ఉన్న ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు ఉండాలి. అంతా నేనే, అంతా నాదే అనే సిద్ధాంతం రాజకీయాల్లో పనికిరాదని ఇప్పటికైనా తెలుసుకోవాలి.
ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడుగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం నభూతో నభవిష్యత్. జగన్‌ను ఎవరూ మార్చలేరు. ఇంత దారుణమైన ఓటమి వచ్చిన ఒక జిల్లాలో ఇంకో జిల్లావారి పెత్తనం సహించరని తెలిసి కూడా నెత్తిన పెట్టుకోవడం చూస్తే ఈయనకు ఎవరైనా హాట్సప్ చెబుతారు. ఆయన పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు. ఇలాగే ఉంటే ఒంగోలులో వైకాపా ఖాతా కూడా తెరవదు. భజన బృందం మీద ఆయనకు ప్రేమ తగ్గదు. ప్రస్తుతం రాష్ట్రంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ పెట్టుబడులు వంటి అంశాలు ప్రతిపక్షానికి బలంగా ఉపయోగపడేవే. వంద రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్యూర్స్ జనంలోకి పట్టుకెళ్లడం అటుంచి ఇప్పుడు తమ ప్రభుత్వంలో జరిగిన ఫెయిల్యూర్‌ను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ తెలంగాణలోని షామీర్‌పేటలో రూ.204 కోట్ల పెట్టుబడితో కొత్త ఐస్‌క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, కొత్త ఐస్ క్రీం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ. 204 కోట్ల పెట్టుబడిని ఆమోదించడం ద్వారా ఐస్ క్రీం మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునే దిశగా ఒక ప్రధాన అడుగు వేసింది. తెలంగాణలోని షామీర్‌పేటలో కొత్త ఐస్‌క్రీం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనను ఆమోదించిందని కంపెనీ ఎక్చ్సేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాల్సిన చంద్రబాబు తెలంగాణలో పెడుతున్నారని ఈపాటికే వైకాపా రచ్చ చేయాలి. కానీ అటువంటి నాయకులు ఏరి? అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రెస్‌మీట్ పెట్టడానికి ముందుకు రాని జగన్మోహన్‌రెడ్డి తిరుమల నెయ్యి వ్యవహారంలో స్వయంగా ఆయనే మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంటే ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ లేడనే అర్థమవుతుంది. టీటీడీకి చైర్మన్లుగా పని చేసిన సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు వాస్తవానికి ప్రెస్‌మీట్ పెట్టాలి. కానీ ఈ అపచారం క్రిస్టియన్ అయిన జగన్మోహన్‌రెడ్డే చేయించారన్న ఆలోచనతో చంద్రబాబు ఓ రాయి విసిరారు. దీంతో జగన్ బయటకు రావాల్సి వచ్చింది. ఆరోపణల పవర్ ఏమిటి? మీడియా కవరేజ్ ఏ స్థాయిలో ఉంటుందనేది మొదటిసారిగా జగన్మోహన్‌రెడ్డికి అర్థమైంది. ఐదేళ్లు పరదాల మాటున సలహాల్రావుల సూచనలతో నెట్టుకొచ్చేసిన జగన్మోహన్‌రెడ్డి నెయ్యి విషయంలో తమ ప్రభుత్వం ఎటువంటి పాపాన్ని మూటకట్టుకోలేదని చెప్పుకోడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దేశమంతటా యానిమల్ కొవ్వు మంటలు చెలరేగిపోయాయి. ఇది ప్రతిపక్షానికి చిన్న డ్యామేజీ కాదు. మరోపక్క ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత జగన్మోహన్‌రెడ్డి వ్యవహార శైలి నచ్చట్లేదంటూ ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు జగన్మోహన్‌రెడ్డి పార్టీ మూలాల పైనే దెబ్బ కొట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు మొదటిసారిగా మతపరమైన వివాదాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారంలో ఇప్పుడిప్పుడే జగన్‌కు దగ్గరవ్వాలన్ని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కూడా దూరం జరిగిపోయింది. బీజేపీతో ఎన్నికలకు ముందే తెగతెంపులైపోయింది. కోట్లాది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా దేశంలో మరో పార్టీ జగన్మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతుందని భావించక్కర్లేదు. ఇప్పుడు ఈ ఆపద నుంచి జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే పార్టీని ఒడ్డెక్కించలేరు. నెయ్యిలో కల్తీ జరగలేదని మరో ప్రసిద్ధ ల్యాబ్ రిపోర్టు ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే టీటీడీయే తమకు సరఫరా అవతున్న నెయ్యిని ఆ ల్యాబ్‌కు పంపాలి. చచ్చినా ప్రభుత్వం ఆ పని చేయదు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన శ్యామలరావును తీసుకువెళ్లి ఎకాఎకిన టీటీడీ ఈవోగా కూటమి పదవి కట్టబెట్టింది. వాస్తవానికి వైకాపా హయాంలో ఉన్నత విద్యాశాఖ భ్రష్టుపట్టిపోయింది. హైకోర్టు నుంచి అక్షింతలు, కోర్టు ధిక్కరణలు ఎక్కువగా ఎదుర్కొన్న శాఖ ఉన్నత విద్యే. ఒక సందర్భంలో శ్యామలరావు తీరు వల్ల నేరగా హైకోర్టు అప్పటి ప్రభుత్వాన్నే ఆక్షేపించింది. అటువంటి శ్యామలరావును తీసుకువెళ్లి టీటీడీ ఈవోను చేశారంటే తిరుమలలో ఏదో జరగబోతుందని జగన్మోహన్‌రెడ్డికి అర్థమైవుండాలి. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని చెప్పిన శ్యామలరావు మరుసటి రోజే యానిమల్ ఫ్యాట్ ఉందనే నివేదికను అందించడం కొసమెరుపు.
Comments