top of page

సోంపేట సెబ్‌లో వసూల్‌రాజా!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `ఎన్నికల బదిలీల్లో వచ్చి బెదిరింపుల పర్వం

  • `దారి కాసి మరీ ఇసుక వాహనాల నుంచి వసూళ్లు

  • `సారా, మద్యం అక్రమార్కుల నుంచీ విచ్చలవిడి దోపిడీ

  • `మంత్లీలు ఇస్తే అక్రమ రవాణాకు రాచబాట

  • `ఆలస్యమైనా, ఇవ్వకపోయినా సబ్‌ సీఐ పంట పండినట్లే

రాష్ట్రంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అనే వ్యవస్థను ప్రవేశపెట్టిందే మద్యం, ఇసుక, గంజాయి అక్రమ దందాలు జరగకుండా.. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా అడ్డుకోవడానికి. అయితే ఎక్సైజ్‌, పోలీసు శాఖల్లో లంచాలు మింగడానికి బాగా అలవాటుపడిపోయిన ఉద్యోగులనే సెబ్‌కు పంపడం, దానికి అధికారాల పేరుతో పెద్ద కోరలు ఇవ్వడంతో మరింతగా రెచ్చిపోయి విచ్చలవిడిగా కాసులు దండేస్తున్నారు. సెబ్‌ కేసు బుక్‌ చేస్తే మామూలు కంటే ఎక్కువ అపరాధ రుసుము పడుతుందని భయపెట్టి అక్రమాల పంట పండిరచుకుంటున్నారు. ముఖ్యంగా ఒడిశా బోర్డర్‌లో ఉన్న నియోజకవర్గాల్లో ఈ దోపిడీ మరింత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సోంపేటలో ఇటీవల జరిగిన ఓ సంఘటననే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

గంటల వ్యవధిలోనే వసూళ్ల మీద వసూళ్లు

డబ్బులు ఇస్తే ఒకలా.. ఇవ్వకుంటే ఇంకోలా సెబ్‌ సీఐ, సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ సభ్యుడు వైకుంఠరావు విమర్శించారు. స్వయంగా తానే పది ట్రాక్టర్లకు రూ.50 వేలు సెబ్‌ సీఐకి ఇచ్చానని, కానీ కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ తన ట్రాక్టర్‌ను అడ్డుకొని రూ.50వేలు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. గత నెల మందస స్టేషన్‌లో ట్రాక్టర్‌ ఉండిపోవడంతో మంత్లీ రూ.5వేలు ఇవ్వలేకపోయానని తెలిపారు. మంత్లీ ఇచ్చిన వాహనాలను విడిచిపెట్టి మంత్లీ ఇవ్వనందుకు దారికాసి తన ట్రాక్టర్‌ పట్టుకొని రూ.50వేలు డిమాండ్‌ చేశారని ఆయన ఆరోపించారు. సోంపేట సెబ్‌ పరిధిలో నాటుసారా తయారు చేస్తున్నారని, వారి నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకొని సారా ఎగుమతిని ప్రోత్సహిస్తున్నారని వైకుంఠరావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో నాటుసారా, ఒడిశా నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేయడానికి సెబ్‌ సీఐ రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్రస్తుత సెబ్‌ సీఐ, ఎస్‌ఐలు వచ్చిన తర్వాత నాటుసారా తయారీ, అక్రమ రవాణా ఎక్కువైందన్నారు. ఒడిశా నుంచి మద్యం దిగుమతి కూడా పెరిగిందన్నారు. ఎంత దిగుమతి చేసుకుంటే అంత ఆదాయాన్ని సెబ్‌ సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఆర్జిస్తున్నారని ఎంపీటీసీ వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతాన్ని వింటే సెబ్‌ అధికారులు దారి దోపిడీకి పాల్పడుతున్నారని అనిపించకమానదు. ఒక్క సోంపేటలోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను దారిలోనే అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి సెబ్‌ అధికారుల డిమాండ్‌ మేరకు వాహన యజమానులు డబ్బులిచ్చి విడిపించుకొని వెళ్లిపోతున్నారు. శ్రీకాకుళం పరిధిలో రూరల్‌ పోలీసులే టోల్‌గేట్‌ పెట్టి మరీ లారీకి రోజుకు రూ.2వేలు, ట్రాక్టర్‌కు నెలకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు. నరసన్నపేట పరిధిలో ఇసుక తవ్వకాలు జరపుతున్నందుకు శ్రీకాకుళం రూరల్‌ స్టేషన్‌కు రోజువారీ మామూళ్లు ఇస్తున్నారు. లేదంటే జాతీయ రహదారిపై పోలీసులు అడ్డగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. హిరమండలం పరిధిలో టైరుబళ్లకు ఓ రేటు, ట్రాక్టర్లకు మరో రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సెబ్‌ అధికారులు స్థానిక పోలీసులతో చేతులు కలిపి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు.

మంత్లీ ఇవ్వకపోతే అంతే సంగతులు

ప్రభుత్వం మారినా సెబ్‌, పోలీసు అధికారుల్లో మార్పు రాలేదు. ఎన్నికల బదిలీల్లో వచ్చినందున తిరిగి వెనక్కి వెళ్లిపోతామన్న ధీమాతో సెబ్‌లో కొందరు అధికారులు, పోలీసులతో కలిసి దోచుకుంటున్నారు. విశాఖపట్నం రూరల్‌ నుంచి బదిలీపై సోంపేట సెబ్‌ సీఐగా బాధ్యతలు చేపట్టిన అధికారి సొంతకారులో వచ్చి కంచిలి, మందస, బారువ, సోంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తెల్లవారుజామున నాలుగు గంటలకే సిబ్బందితో కలిసి మూడు నెలలుగా దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో అత్యధికంగా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కంచిలి, సోంపేట, మందస ముందువరుసలో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో నాటుసారీ తయారీదారుల నుంచి నెలకు రూ.5 లక్షల వరకు సెబ్‌ సిబ్బంది వసూలు చేస్తున్నారని తెలిసింది. నాటుసారాతో చిక్కేవారి నుంచి రూ.10వేలు చొప్పున వసూలు చేస్తున్నారట. ఈ దందా ఒకవైపు సాగిస్తూనే మహేంద్రతనయ నుంచి అక్రమంగా ఇసుక తరలించే నాటుబండికి రూ.వెయ్యి, ట్రాక్టర్‌కు రూ.5వేలు చొప్పున మంత్లీలు వసూలు చేస్తున్నారనేది తాజా ఉదంతంతో స్పష్టమైంది. మంత్లీలు ఇవ్వడంలో ఒక్క రోజు ఆలస్యమైతే చాలు రోడ్డపై అడ్డగించి వాహనాన్ని సీజ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. అదే డబ్బులు ఇస్తే గౌరవప్రదంగా దగ్గరుండి గమ్యస్థానానికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకుంటున్నారు. లేదంటే పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి కేసు నమోదు చేస్తున్నారు. సోంపేట సెబ్‌ అధికారుల వేధింపులు పడలేక గడవుకు ముందే మంత్లీలు ఇచ్చేస్తున్నారని తెలిసింది. పన్నులు గడువులోగా కట్టకపోతే ప్రభుత్వమైనా కొంత వెసులుబాటు ఇస్తుంది. కానీ సోంపేట సెబ్‌ సీఐకి మాత్రం మంత్లీని గడువు దాటకుండానే ఇచ్చేయాలి, లేదంటే మందీమార్బలంతో దారికాచి వాహనాలు నిలిపి వడ్డీతో సహ మామూళ్లు గుంజుకుంటున్నారనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page