సంప్రదాయ క్రికెట్‌కు ఐపీఎల్ సమాధి!
- DV RAMANA

- Jul 14
- 3 min read

క్రికెట్‌లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందాలంటే టెస్ట్ మ్యాచుల్లో రాణించాల్సిందేనని గతంలో చెప్పేవారు. కానీ కాలచక్రం వేగం పుంజుకున్న క్రమంలో దాంతోపాటే క్రికెట్ మ్యాచ్‌ల స్వరూపం మారిపోయింది. గతంలో ఉన్న ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఐదు రోజులకు తగ్గిపోయింది. కాలక్రమంలో అదీ ఆకర్షణ కోల్పోయి దాని స్థానాన్ని వన్డే క్రికెట్ ఆక్రమించింది. కొన్నేళ్లకు దాని క్రేజ్‌ను పొట్టి క్రికెట్ కబళించింది. ఒకరోజంతా క్రీడాకారులు ఆడటం, దాన్ని పనులన్నీ మానుకుని ప్రేక్షకులు చూడటం ఉత్త వేస్ట్ అని భావించారేమో గానీ ప్రపంచ క్రికెట్ వ్యూహకర్తలు, నిర్వాహకులు తమ బుర్రలకు పదనుపెట్టి కేవలం కొన్ని గంటల్లోనే ఫలితం తేల్చేసే రీతిలో ధనాధన్ క్రికెట్‌ను క్రీడాప్రపంచానికి పరిచయం చేశారు. అదే టీ20 క్రికెట్. ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు పోటీలు, ప్రపంచ కప్ టోర్నీ వంటి ఈ ఫార్మట్‌నూ నిర్వహించడం తప్పు కాదు. కానీ చిక్కంతా ఈ ధనాధన్ క్రికెట్‌ను కేవలం ఆటగానే చూడకుండా క్యాష్‌రిచ్ లీగ్‌గా మార్చేశారు. దీన్నో వ్యాపారంగా, సంపాదన మార్గంగా మార్చేసి జట్ల పేరుతో ఫ్రాంచైజీలకు, లీగ్‌ల నిర్వాహక సంస్థలకు వందలు, వేల కోట్లు కుమ్మరించే కామధేనువులుగా తీర్చిదిద్దారు. బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా లీగ్, శ్రీలంక, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లు ఈ కోవలో ఏర్పాటైనవే. అయితే వీటన్నింటినీ తలదన్నే లీగ్ ఐపీఎల్. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఇదే అత్యంత క్యాష్‌రిచ్ లీగ్‌గా రూపాంతరం చెందింది. టీ20 అంటేనే ధనాధన్ క్రికెట్‌గా అందరూ అభివర్ణిస్తుంటారు. అందుకు తగినట్లే ఈ మ్యాచ్‌లను ఇటు స్టేడియంలలో కూర్చొని.. అటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను చూసేవారందరూ బ్యాటర్ల వీరబాదుడును, సూపర్ షాట్లనే ఆస్వాదిస్తున్నారు. అలా రెచ్చిపోయే క్రికెటర్లనే చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహిస్తున్నారు. ఆట చూసే ఆ మÖడు నాలుగు గంటల సేపు పూర్తిస్థాయి ఎంజాయ్‌మెంట్‌నే కోరుకుంటున్నారు. అదే టీ20 లీగ్‌ల నిర్వాహకులకు వ్యాపార ప్రయోజనంగా మారింది. ప్రేక్షకులను గరిష్టంగా స్టేడియంలకు, టీవీల ముందుకు రప్పించే క్రమంలో సంప్రదాయ క్రికెట్‌ను దాదాపు చంపేసి.. కృత్రిమ క్రికెట్‌కు ప్రాణం పోస్తున్నారు. దీనివల్ల ఆటగాళ్లలోని అసలైన టెక్నిక్, ప్రతిభ సమాధి అయిపోతున్నాయి. ఐపీఎల్ పిచ్‌లకు భిన్నంగా ఉండే ఇతర పిచ్‌లపై ఆడలేక, తడబడుతూ ఆటగాళ్లుగా కుప్పకూలుతున్నారు. దీనికి తాజా ఉదాహరణే నేటి భారత టీ20 పురుషుల జట్టు దుస్థితి. టీ20 ఫార్మట్ పురుడుపోసుకున్నప్పటి నుంచి ఈ రంగంలో భారత్ ప్రతిభ చూపుతూ ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా నిన్నటి ఐపీఎల్ ముందువరకు వెలుగొందింది. కానీ ఇప్పుడు కో స్పాన్సర్ జట్టుగా మాత్రమే ఉన్న ఐర్లాండ్ చేతిలోనూ సిరీస్ ఓటమిని కూడగట్టుకుని.. అక్కడితో ఆగకుండా ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్‌ను 0`5 తేడాతో కోల్పోవడంతో పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మÖటగట్టుకుంది. ఈ పరాజయాలకు కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు, పక్షపాత ధోరణితో పాటు ఆటగాళ్ల నిర్లక్ష్య ధోరణి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే భారత టీ20 జట్టు పతనానికి ఇవి కూడా కారణాలు కావచ్చేమో గానీ.. ఇవే మాత్రమే పూర్తిగా కారణం కాదని చాలామంది మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. భారత జట్టు మాజీ సభ్యుడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ మాటల్లో చెప్పాలంటే.. విదేశాల్లో భారత ప్రస్తుత పరాజయ పరంపరకు ఆటగాళ్లు, కోచింగ్ విభాగాన్ని బాధ్యులను చేయడం చాలా సులభం. కానీ అసలు దోషులుగా ఐపీఎల్ నిర్వాహకుýను నిలబెట్టాలి. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సిద్ధం చేసిన మైదానాలు, పిచ్‌లు షాట్లతో కాసులు కురిపించడానికే తప్ప ప్రతిభను ప్రదర్శించడానికి అనుకూలంగా ఉండటంలేదు. ఈ ఆరోపణలు చాలాకాలం నుంచీ ఉన్నాయి. ఐపీఎల్ టోర్నీలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, వాణిజ్య ప్రయోజనాలు సాధించేందుకు వీలుగా పిచ్‌లను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారు. చదునైన ఫ్లాట్ పిచ్‌లు (వీటినే కొందరు విశ్లేషకులు రోడ్లను తలపించే పిచ్‌లుగా అభివర్ణిస్తున్నారు), చిన్న బౌండరీ లైన్లు ఏర్పాటు చేయడంతో బ్యాటర్లు సహజసిద్ధమైన టెక్నిక్‌ను వదిలేసి బంతి వేగాన్నే వాడుకుంటూ బలంగా బాదుతూ బంతిని బౌండరీ లైను అవతలికి పంపిస్తూ భారీ స్కోర్లు చేస్తున్నారు. ఈ విధానం ఐపీఎల్, అదే తరహా ఇతర క్రికెట్ లీగ్‌ల వరకు పనికొస్తుందేమోగానీ.. అసలు సిసలు క్రికెట్ గ్రౌండ్లలో అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ వంటి శీతల దేశాల్లో ఈ బాదుడు ఎందుకూ కొరగాదు. ఈ దేశాల్లోని మైదానాలు, పిచ్‌లు స్వింగ్, బౌన్స్‌లకు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి పిచ్‌లపై టెక్నిక్‌ను వదిలేసి చేసే వీరబాదుడు అసలుకే మోసం తెస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో మన యువ బ్యాటర్లు ఈ విషయంలోనే విఫలమయ్యారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి ఇంగ్లిష్ పేసర్లు సంధించిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రీజులో పాతుకుపోయేలా సహనంతో వ్యవహరించి ఇన్నింగ్స్‌ను నిర్మించడం కాకుండా పవర్ హిట్టింగ్ ద్వారా భారీ స్కోర్లు చేసేయాలన్న తాపత్రయంతో బోల్తాపడ్డారు. ఇదే మొత్తంగా భారత జట్టు కొంప ముంచింది. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్‌ల వల్ల వాటిల్లుతున్న మరో నష్టం ఏమిటంటే బౌలర్ల ప్రాధాన్యత తగ్గిపోతున్నది. భారీ పరుగులు చేసే బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లకు అంత ఆదరణ లభించడంలేదు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విధానం ఆల్‌రౌండర్ల కొరతకు కారణమవుతున్నదని మాజీ క్రికెటర్లు వాదిస్తున్నారు. ఈ నిబంధన వల్ల జట్లు ఆల్‌రౌండర్లకు బదులు స్పెషలిస్టు బ్యాటర్ల స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత క్రికెట్‌లోని సంప్రదాయ సత్తాను సమాధి చేసి సత్తువ లేని జట్టుగా నిýబెట్టాయి. దీనిపై బీసీసీఐ పెద్దలు ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిది.






Comments