స్ఫూర్తిమంత్రం.. సేవలతో ‘పునీత’ం!
- DV RAMANA
- Mar 18
- 2 min read
ప్రశంసలు అందుకుంటున్న నాగేంద్ర బృందం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
తెలుగు ప్రజలకు సినీ అభిమానం మెండు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు నటీనటులకు వేలసంఖ్యలోనే అభిమాన సంఘాలు ఉన్నాయి. అయితే తెలుగు నటులను తెలుగువారు అభిమానించడం సాధారణమే.కానీ పెద్దగా సంబంధంలేని కన్నడ చిత్రసీమకు చెందిన అగ్రహీరో పేరుతో సంఘం పెట్టడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద విశేషమే. అది కూడా ఆ హీరో అనూహ్య పరిస్థితుల్లో మరణించడం, జీవించి ఉన్నప్పుడు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని వాటినే స్ఫూర్తిమంత్రంగా తీసుకున్న సేవాతత్పరుడు పుక్కళ్ల నాగేంద్ర. సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన నాగేంద్ర స్వతహాగానే వితరణశీలి. ఉద్యోగం చేస్తున్న ఈయన తన సంపాదనలో కొంత వెచ్చించి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో చాలాకాలంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చిరంజీవి అభిమాని అయిన నాగేంద్ర 2021లో జరిగిన ఒక ఘటనతో తన కార్యక్రమాల దశదిశను మార్చారు. ఆ ఏడాది అక్టోబర్ 29న కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. ఆ సమాచారంతోపాటు ఆయన జీవిత విశేషాలు, చేసిన సేవల గురించి తెలుసుకున్న నాగేంద్ర వాటి నుంచి స్ఫూర్తి పొంది.. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను పునీత్ రాజ్‌కుమార్‌కు అంకితం చేశారు. డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అసోసియేషన్‌ను స్థాపించి, దాని గొడుగు కింద సేవా కార్యక్రమాలను విస్తరించారు. ఈ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు ప్రకాష్, తేజ, శేఖర్, ప్రసాద్, రామారావులు సహకరిస్తున్నారు.
ఉదారంగా సేవలు
పోలాకి మబగాం గ్రామానికి చెందిన లావేటి చంద్రశేఖర్ కుమారుడు దేవహర్ష అసెప్టిక్ మెనంజైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలుసుకుని కొందరు దాతల సహకారంతో ఆ బాలుడి చికిత్సకు రూ.20,500 అందజేశారు.
స్వగ్రామమైన జగన్నాథపురం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు స్పోర్ట్స్ దుస్తులు, షూస్ అందించడంతోపాటు పాఠశాలకు వాటర్ క్యాన్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సమకూర్చారు. ఇదే పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విద్యా మెటీరియల్ అందజేశారు.
అదే గ్రామ ఎంపీయూపీ స్కూల్‌లో 70 మంది విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు.
టెక్కలి పట్టణంలో ఆది ఆంధ్ర వీధికి చెందిన నిరుపేద కుటుంబానికి నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు, కొంత నగదు ఇచ్చారు.
జగన్నాథపురం గ్రామదేవత గుడికి అసోసియేషన్ తరఫున రూ.6666 విరాళం ఇచ్చారు.
పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు షీల్డులు, బహుమతులతోపాటు విద్యార్థులకు, క్రీడాకారులకు పునీత్ బొమ్మతో టీషర్టులు, క్యాప్స్ పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.
జగన్నాథపురం క్రికెట్ టీమ్ సభ్యులకు 40 టీషర్టులు అందజేశారు.
గార మండలం సతివాడ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దుమ్ము కారుణ్య అనే చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆర్థిక సహాయం చేశారు.
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకుని ఉపాధి కోల్పోయిన కంబళరాయుడుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చిన్న షాపు పెట్టుకునేందుకు కొంత నగదు సాయం చేశారు.
రెడ్డిక మేఘవరం గ్రామ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందజేశారు.
దండు గోపాలపురానికి చెందిన ఒక విద్యార్థి వాలీబాల్ ఆడుతుండగా సంభవించిన ప్రమాంతో చెయ్యి దెబ్బతింది. అతని ఆపరేషన్‌కు అవసరమైన నగదు సహాయం అందజేశారు.
సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ పంగజగ్గుపేట గ్రామానికి చెందిన నిలువనీడ లేని నీలాపు చిన్నమ్మ అనే ఒంటరి మహిళకు నెలకు సరిపడా రేషన్, రూ.11వేల నగదు అందజేశారు.
ఘనంగా పునీత్‌రాజ్‌కుమార్ జయంతి
తమ స్ఫూర్తిదాత పునీత్ రాజ్‌కుమార్ జయంతి ఉత్సవాలను ఈ సంఘం సభ్యులు నిన్న ఘనంగా నిర్వహించారు. జగన్నాథపురంలో నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 20 అడుగుల పునీత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు. నరసన్నపేట తపోవనం వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, గోవులకు ఆహారం అందజేశారు. ఇక సాయంత్రం శ్రీకాకుళం నగరంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి.. పునీత్ రాజ్‌కుమార్ ఆశీస్సులు, స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో పునీత్‌రాజ్‌కుమార్ ఫ్యాన్స్ అధ్యక్షుడు పుక్కళ్ల నాగేంద్ర, సవర రాజు, నాగార్జున ఫ్యాన్స్ పొట్నూరు సంతోష్, మహేష్‌బాబు ఫ్యాన్స్ షాజు, ఈశ్వర్, ప్రభాస్ ఫ్యాన్స్ గోపాల్, వివిధ హీరోల అభిమానులు పాల్గొన్నారు.
Comments