సిఫార్సులు లేవని పోస్టులు లేపేశారు
- BAGADI NARAYANARAO

- Jul 3
- 2 min read
కిడ్నీ ఆసుపత్రి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు
13 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ చేసింది నలుగురికే
మెరిట్‌ను పక్కనబెట్టి 16వ ర్యాంకర్‌కు ఉద్యోగం
రాజకీయ సిఫార్సుల కోసమే 9 పోస్టుల రద్దు అంటూ ఆగ్రహం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రతిష్టాత్మక కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న ఈ నియామకాల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కి, మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారు మెరిట్ లిస్టులో లేకపోవడం వల్లే అధికారులు ఏకంగా 9 పోస్టులను రద్దు చేశారంటూ దరఖాస్తుదారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఫీజులు వసూలు చేసి.. 8 నెలలు తిప్పి..
గత ఏడాది (2025) మార్చి 22న పలాస కిడ్నీ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 13 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ (నెం: 01/2025) విడుదల చేశారు. రిసెప్షన్ కం రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలిసిస్ టెక్నీషియన్స్, సీ-ఆర్మ్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల కోసం మొత్తం 289 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.500ల చొప్పున ఫీజు వసూలు చేసిన అధికారులు, ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేయడానికి ఏకంగా 8 నెలల సమయం తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 28న మెరిట్ లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టి, డిసెంబర్ 2న 1:3 నిష్పత్తిలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
13 పోస్టులకు కేవలం 4 మాత్రమే భర్తీ
తీరా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత అధికారులు విడుదల చేసిన తుది జాబితా చూసి అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. మొత్తం 13 పోస్టులకు గాను కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేసి, మిగిలిన 9 పోస్టులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
డయాలిసిస్ టెక్నీషియన్: 6 పోస్టులు ఉంటే కేవలం ఒక్క పోస్టు మాత్రమే భర్తీ చేసి 5 రద్దు చేశారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 3 పోస్టులకు గాను ఒక్కరినే ఎంపిక చేసి 2 పోస్టులు రద్దు చేశారు. సీ-ఆర్మ్ టెక్నీషియన్ 2 పోస్టులను పూర్తిగా రద్దు చేశారు. రిసెప్షన్ క్లర్క్ (1), సెక్యూరిటీ గార్డ్ పోస్టును మాత్రమే భర్తీ చేశారు.
16వ నెంబర్ వ్యక్తికి అడ్డగోలుగా ఉద్యోగం!
ఈ నియామకాల్లో జరిగిన అక్రమాలకు డయాలిసిస్ టెక్నీషియన్ పోస్టు భర్తీనే నిదర్శనమని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ పోస్టుకు సంబంధించి ఓసీ జనరల్ పురుషుల కోటాలో 46.62 మార్కులతో మెరిట్ లిస్టులో 16వ స్థానంలో ఉన్న వ్యక్తికి అడ్డగోలుగా ఉద్యోగం కట్టబెట్టారు. ఒకటి, ఆరు స్థానాల్లో ఉన్న టాప్ మెరిట్ అభ్యర్థులు ఇప్పటికే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారనే సాకుతో వారిని పక్కన పెట్టడం గమనార్హం. అలాగే, ఓసీ జనరల్ మహిళా కేటగిరీలో అర్హులు లేరని అధికారులు చెబుతున్నప్పటికీ, అక్కడ ఐదుగురు మహిళలు రేసులో ఉన్నారు. అందులో నలుగురికి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ లేదని రిమార్క్స్ రాసిన అధికారులు, 23వ స్థానంలో ఉన్న తదుపరి మహిళకు అవకాశం ఇవ్వకుండా ఏకంగా పోస్టునే రద్దు చేశారు. ఇదే తరహాలో ఎస్టీ, వీహెచ్, బీసీ-ఏ, ఎస్సీ మహిళా పోస్టులన్నింటినీ రద్దు చేయడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రీవెన్స్‌కు వెళ్లకుండా అధికారుల మాయమాటలు
రోస్టర్ విధానం, అర్హత లేకపోవడం వల్లే పోస్టులు రద్దయ్యాయని అధికారులు సమర్థించుకుంటున్నా, దరఖాస్తుదారులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ‘కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయవద్దు, అర్హతను బట్టి మీకే ఉద్యోగం ఇస్తాం’ అని మాయమాటలు చెప్పి పంపించేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దయిన 9 పోస్టులకు ఈ ఏడాది జనవరిలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో ‘డిప్యూటీ డైరెక్టర’ పోస్టు ఖాళీగా ఉందనే సాకుతో కాలయాపన చేస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని బాధితులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






Comments