top of page

సెబ్‌తో ఎక్సైజ్‌ మొత్తం గబ్బు!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • దోపిడీ వ్యవస్థకు మంగళం పాడుతున్న కూటమి సర్కార్‌

  • మళ్లీ క్రియాశీలం కానున్న ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ

  • ఇప్పటికీ బదిలీలకు జీవో జారీ చేసిన జీఏడీ

  • కొత్త పాలసీకి ఈ నెలాఖరులో ఆమోదం.. అక్టోబర్‌ నుంచి అమలు

కంచే చేను మేసిన చందంగా అక్రమాలను అరికట్టడానికి గత వైకాపా సర్కారు ఏర్పాటుచేసిన సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) వ్యవస్థ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించేసింది. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వైకాపా ఆపని చేయకపోగా ప్రభుత్వపరంగానే లిక్కర్‌ అమ్మించి ఆదాయం పెంచుకుంటే.. మద్యం అక్రమాలను అరికట్టాల్సిన సెబ్‌ సొంత లాభం చూసుకుంది. అక్రమార్కులతో కుమ్మక్కై దోపిడీపర్వానికి తెరతీసింది. ఈ తరుణంలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం సెబ్‌కు మంగళం పాడేసి, పాత ఎక్సైజ్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నాసిరకం మద్యం బ్రాండ్ల స్థానంలో గతంలో ఉన్న బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా సెబ్‌ వ్యవస్థను రద్దు చేయాలని దాదాపు నిర్ణయించింది. ఈ నెలాఖరులో జరిగే కేబినెట్‌ మీటింగులో దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. దాంతో 2020 మే నెలలో అప్పటి వైకాపా సర్కారు ఏర్పాటు చేసిన సెబ్‌ కాలగర్భంలో కలిసిపోనుంది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) పరిధిలో ఉంటూ జిల్లాస్థాయిలో పోలీసు బాస్‌ల కనుసన్నల్లో పనిచేసేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్‌ శాఖను రెండు ముక్కలు చేసి 70 శాతం మందిని సెబ్‌కు కేటాయించారు. 30 శాతం సిబ్బందినే ఎక్సైజ్‌లో ఉంచారు. ఏఎస్పీల ఆధ్వర్యంలో పనిచేసే సెబ్‌కు నాటుసారా, మద్యంతో పాటు ఇసుక, గుట్కా, గంజాయి, పేకాట, పిక్కాటలను నియంత్రించే బాధ్యతలు కూడా అప్పగించారు. మద్యం అక్రమాల నియంత్రణకు ఏమాత్రం సహకరించకపోగా దోపిడీ వ్యవస్థగా మారిన సెబ్‌ను రద్దు చేయడమే ఉత్తమమని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఈ విభాగంలో పనిచేస్తున్న వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు సాధారణ పరిపాలన శాఖ ఈ నెల 18న జీవో 75 జారీ చేసింది. ఆ మేరకు సెప్టెంబర్‌ ఐదో తేదీ నుంచి పదిరోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దాంతో మళ్లీ ఎక్సైజ్‌ శాఖే మద్యం వ్యవహారాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రతి జిల్లాకు ఒక డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ), ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఉంటారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌, డిస్టిలరీ, ఎక్సైజ్‌ స్టేషన్లు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, టాస్క్‌ఫోర్స్‌, చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు.

ఇన్నాళ్లూ అటు సర్కార్‌.. ఇటు సెబ్‌ దోపిడీ

మద్యనిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైన గత సర్కారు అదే మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంలో మాత్రం సక్సెస్‌ అయ్యింది. 2014`19 మధ్య ఐదేళ్ల కాలంలో ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.75,284 కోట్ల ఆదాయం లభించగా, వైకాపా అధికారంలోకి వచ్చాక 2019`24 మధ్య కాలంలో రూ.1.10 కోట్లకు పెరిగింది. మద్యం వ్యాపారాన్ని స్వయంగా నిర్వహించాలని నిర్ణయించిన వైకాపా సర్కారు మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసి, సొంతంగా వాటిని ఏర్పాటు చేసింది. మరోవైపు బ్రాండెడ్‌ మద్యం స్థానంలో చీప్‌ లిక్కర్‌నే అధిక ధరలకు విక్రయించి ఆదాయం పెంచుకుంది. మద్యం అక్రమాల నియంత్రణ పేరుతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను తెరపైకి తెచ్చింది. ఈ వ్యవస్థ వల్ల అక్రమాలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో సెబ్‌ ఉద్యోగులు తలదూర్చి అక్కడ పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో అక్రమాలు చేయించి విచ్చలవిడిగా అక్రమార్జనకు పాల్పడ్డారు. మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు మద్యం సరఫరా చేయడంలో సెబ్‌ అధికారులే కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం సరఫరా చేసే చీప్‌ లిక్కర్‌ను బ్రాండెడ్‌ మద్యం బాటిల్స్‌లో నింపి విక్రయించిన ఘటనలు అధికారుల తనిఖీల్లో వెలుగుచూశాయి. గత ఏడాది డిసెంబర్‌ 7న పోలాకి మండలం పిన్నింటిపేట ప్రభుత్వ మద్యం దుకాణంలో 44 కల్తీ క్వార్టర్‌ మద్యం బాటిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని సిబ్బందిని అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా వాటిని మేనిప్యులేట్‌ చేసి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇసుక, నాటుసారాల్లోనూ వసూళ్లు

ఇసుక, మట్టి తవ్వకాల నియంత్రణ బాధ్యతను అప్పగించిన తర్వాత సెబ్‌ అధికారులు సహజవనరుల దోపిడీకి కూడా తెర తీశారని, నాటుసారా తయారీదారుల వద్ద మంత్లీలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి తరలించడంలో వైకాపా నాయకులకు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాలో సెబ్‌ అధికారులు తలదూర్చి రూ.లక్షల్లో సంపాదించగా, కొన్నిచోట్ల లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు వీరితో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి సొంత ఆదాయం పెంచుకుంటూ వచ్చారు. సెబ్‌ అధికారులుగా వ్యవహరించిన వారంతా మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం తదితర ప్రాంతాల్లో నాటుసారా తయారీదారులతో చేతులు కలిపి మంత్లీలు వసూలుచేశారు. గత నెలాఖరు వరకు ఇసుక అక్రమ రవాణా చేసే లారీల నుంచి రూ.1500 చొప్పున వసూలు చేశారు. ఉన్నతాధికారులు వారించినా వినకుండా ఇసుక లారీలను జాతీయ రహదారిపై నిలిపి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదీ ప్రాంతాల్లో సెబ్‌ అధికారుల ఇసుక దోపిడీకి అంతు లేకుండా పోయింది.

అక్టోబర్‌ నుంచి కొత్త పాలసీ

అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త ఎక్సైజ్‌ పాలసీ తీసుకురావడానికి ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదాయానికి ఢోకా లేకుండా మద్యం పాలసీ ఉండేలా కసరత్తు చేస్తున్నారు. దీనికోసం రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కేరళ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించి అక్కడి విధానాలను అధ్యయనం చేశాయి. మద్యం ధరలను సగానికి పైగా తగ్గిస్తారని మద్యం ప్రియులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సంపన్నులు ప్రీమియం మద్యం బ్రాండ్‌లు అందుబాటులోకి వస్తే చాలని కోరుకుంటున్నారు. సెబ్‌ రద్దుతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అధికారులంతా ఎక్సైజ్‌ అధికారులుగా మారిపోనున్నారు. నూతన మద్యం పాలసీ అమల్లో వీరే కీలకం కానున్నారు.

కొత్త పాలసీతో బార్లకు ముప్పు

ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీతో ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బార్లకు నష్టం చేకూరుతుందని, మరో ఏడాది వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలే కొనసాగించి బార్ల లైసెన్స్‌లు ముగిసిన తర్వాత కొత్త విధానాన్ని అవలంభించాలంటూ రాష్ట్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సంఘం తరఫున రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు కొద్ది రోజుల క్రితం వినతిపత్రం ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఒక బార్‌కు 7.50 లక్షల నాన్‌ రిఫండ్‌ అప్లికేషన్‌ ఫీజుతో పాటు ఏడాదికి రూ.35 లక్షల బేసిక్‌ ఫీజు, రూ.5 లక్షల లైసెన్స్‌ ఫీజుగా నిర్ధారించి దాని మీద బిడ్డింగ్‌కు పిలవడంతో సగటున రూ.42 లక్షలకు ఒక్కో బార్‌ను సొంతం చేసుకున్నారు. వీటి కాలపరిమితి మూడేళ్లు. అయితే గత ప్రభుత్వం బేసిక్‌ ఫీజు, లైసెన్స్‌ ఫీజు కలిపి రూ.40 లక్షలయితే ప్రతీ ఏడాది దాని రెన్యువల్‌కు 10 శాతం పెంచాలనే నిబంధన విధించింది. ఈ లెక్కన ఒక బార్‌ ఏడాదికి రూ.50 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇప్పుడు ఈ నెల 20 లోపు ఈ సొమ్ములు చెల్లించాల్సి ఉంది. కానీ కొత్త మద్యం పాలసీ వల్ల బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నడవవని భావిస్తున్న ఈ వ్యాపారస్తులు తమ లైసెన్స్‌ గడువు ముగిసేవరకు ప్రభుత్వ షాపులే ఉంచాలని కోరుతున్నారు. అందుకే ఇంతవరకు ఎవరూ రెన్యువల్‌ ఫీజులు కట్టలేదు. కేవలం ఎక్సైజ్‌ సిబ్బంది వద్ద మొహమాటానికో, ఒత్తిడికో నామ్‌ కే వాస్తేగా రూ.5లక్షలు చొప్పున చెల్లించి చేతులెత్తేశారు. విజయనగరం జిల్లాలో 23 బార్లు ఉంటే ఇందులో ఒక్కరు కూడా పైసా కట్టలేదు. మన జిల్లాలో 18 బార్లు ఉంటే, అందులో 10 బార్లు కొద్ది మొత్తం చెల్లించి తమ వల్ల కాదని మొండికేస్తున్నాయి. అక్టోబరులో కొత్త మద్యం పాలసీ వచ్చి నవంబరులో ఆక్షన్లు ముగిస్తే ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం ప్రభుత్వ షాపుల మాదిరిగా 10 గంటలకు తెరవడం, రాత్రి 9 గంటలకు మూసేయడం, అడిగిన బ్రాండు లేదనడం వంటివి కుదరదు. ప్రస్తుతం లైసెన్స్‌ ఫీజులు ఎక్కువైనా సెబ్‌ పరోక్షంగా సహకరిస్తున్నందున బార్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయించగలుగుతున్నారు. బార్లలో అమ్మే మందుకు నిర్ధష్ట ధరంటూ ఏదీ లేదు. కారణం.. ప్రభుత్వ లైసెన్స్‌ ఫీజు ఆ విధంగా ఉండటమే. ఇప్పుడు ప్రైవేటు చేతికి మద్యం షాపులు వస్తే బార్లకు ధీటుగా తయారవుతాయి. దీనికి తోడు పక్కనే తాగడానికి పర్మిట్‌ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అవకాశమిస్తుంది. దీంతో బార్ల వ్యాపారం పూర్తిగా కుదేలైపోతుంది. నిబంధనల మేరకు మరో ఏడాది కూడా వీరు రూ.50 లక్షల వరకు రెన్యువల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొత్త పాలసీలో బార్ల లైసెన్స్‌ ఫీజును తగ్గించే విధంగా నిర్ణయం తీసుకోవాలని, లేదూ అంటే పాలసీని మరో ఏడాదికి గాని అమలుచేయొద్దని కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page