top of page

సోమనాథ్ నుంచి సిందూరం వరకు.. పునరుజ్జీవిస్తున్న భారతదేశ స్ఫూర్తి

  • Guest Writer
  • May 11
  • 3 min read

75 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతమైన సోమనాథ్ పవిత్ర పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం, ప్రతిష్ఠాపన, భారతదేశ నాగరిక వైభవాన్ని పునజీవింప చేయడంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇంకా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీకారం చుట్టిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి మూలస్తంభాలైన భారతదేశ స్థైర్యాన్ని, సంకల్పబలాన్ని ఇది మరోసారి దృఢపరిచింది.

ఈ పవిత్రమైన కీలక ఘట్టం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ తరుణం, గత వెయ్యిళ్లుగా మతోన్మాదులు ఈ ఆలయంపై జరిపిన దాడులను తట్టుకుని మరింత బలంగా నిలిచిన భారతీయ నాగరికత దృఢమైన పునాదిపైనా, శక్తిపైనా దేశానికి అపారమైన విశ్వాసాన్ని ఇస్తుంది.

ప్రతి దాడి అనంతరం, గుజరాత్ ప్రశాంత సముద్ర తీరంలోని ఈ ఆలయం శిథిలాల నుంచి తన పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకుంది. ఈ ఆలయం అనేక విధాలుగా దేశ చరిత్రను ప్రతిబింబిస్తుంది. శాంతియుతమైన, ప్రియమైన మన ప్రజలు వారి విశ్వాస వ్యవస్థలు, సంస్కృతి, వారసత్వంపై జరిగిన క్రూరమైన దాడుల నుంచి తిరిగి పుంజుకున్నారు.

ప్రధాని మోదీ చెప్పినట్లుగా, సోమనాథ్‌ను నాశనం చేసేందుకు పదేపదే ప్రయత్నాలు, కుట్రలు జరిగినట్లే, విదేశీ దురాక్రమణదారులు శతాబ్దాలుగా భారతదేశాన్ని తుడిచిపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, ఈ పుణ్యక్షేత్రం గానీ, దేశం గానీ నాశనం చేయలేకపోయారు.

సోమనాథునిపై జరిగిన దాడుల వెనుక ఉన్న ఉద్దేశం కేవలం దోపిడీ చేయడం కంటే ఎంతో దుర్మార్గమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘ఒకవేళ ఈ దాడులు కేవలం దోపిడీ కోసమే జరిగినట్లయితే, వెయ్యి ఏళ్ల క్రితం చేసిన తొలి భారీ దోపిడీతోనే అవి ఆగిపోయి ఉండేవి. కానీ నిజం అది కాదు. సోమనాథుని పవిత్ర విగ్రహాన్ని అపవిత్రం చేసి, ఆలయ స్వరూపాన్ని పలుమార్లు మార్చారు. అయినా సరే, సోమనాథ ఆలయాన్ని కేవలం దోపిడీ కోసమే ధ్వంసం చేయలేదని మనకు బోధిస్తుంది.’

‘ద్వేషం, అణచివేత, భీభత్సంతో కూడిన క్రూరమైన చరిత్రను మన నుంచి దాచిపెట్టారు’ అని ఆయన అన్నారు. నెహ్రూ ప్రతిఘటన - స్వాతంత్య్రం తర్వాత, సర్దార్ పటేల్ సోమనాథ్ పునర్నిర్మాణ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇది స్వాతంత్య్ర భారతదేశంలో జాతీయ ఆత్మవిశ్వాసానికి తొలి నిదర్శనం. కానీ ఇది కూడా అడ్డంకులను ఎదుర్కొంది.

భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఆ చారిత్రక ప్రారంభోత్సవానికి హాజరవ్వాలన్న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నిర్ణయాన్ని అధికారికంగా వ్యతిరేకించారు. కానీ రాష్ట్రపతి 1951 మే 11న ఆ ఆలయాన్ని ప్రారంభించారు.

శతాబ్దాల క్రూరమైన అణచివేత తర్వాత, ఈ పునర్నిర్మాణం భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, నాగరికతకు బీజాలు వేసింది. ఉజ్జయిన్‌లోని కాశీ విశ్వనాథ, మహాకాలేశ్వర ఆలయాల పునరుద్ధరణ నుంచి అయోధ్యలోని భవ్యమైన రామ మందిరం వరకు, కేదార్‌నాథ్ పునరుజ్జీవనం నుంచి లెక్కలేనన్ని వారసత్వ ప్రదేశాల పరిరక్షణ వరకు, భారతదేశం తన నాగరికతా కథనాన్ని గౌరవంగా, సార్థకంగా తిరిగి పొందుతోంది. ఈ ప్రయత్నాలు సందర్శకులను పెంచుతున్నాయి. స్థానిక ప్రజలకు అనేక ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త ప్రభావం - సోమనాథ్ వలె, భారతదేశం మరింత బలంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, గొప్ప వారసత్వంతో ఆధునికతను విలక్షణంగా మేళవించే దేశంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

2014లో దేశం మోదీ ప్రభుత్వాన్ని ఘనంగా ఎన్నుకున్న తర్వాత, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించాలని రికార్డు స్థాయిలో 175 దేశాల ఆమోదంతో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన ఒక ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మారింది.

ఒక దశాబ్దం తర్వాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన మధ్యప్రాచ్య భూమిలో ప్రధాని మోదీ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు, బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతన ఆలయ పునరుద్ధరణను ప్రధాని ప్రారంభించారు. ఆయన ప్రవాస భారతీయులతో కూడా క్రమం తప్పకుండా సంభాషిస్తూ, వారిని భారతీయ సాంస్కృతిక వారసత్వానికి గర్వించదగిన రాయబారులుగా తీర్చిదిద్దుతున్నారు.

ఆయుష్ Ê యోగాను ప్రపంచీకరించడం, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, మన సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల నిపుణులకు ప్రపంచవ్యాప్త అవకాశాలను సృష్టించడం అనేది, ఇటీవలి కాలంలో భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పరంపరలో ఒక కీలక అంశంగా ఉంది. మన కళాకారులు, కార్మికులు, రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు లాభదాయకమైన ప్రపంచవ్యాప్త అవకాశాలను సృష్టించడమే కాకుండా, ఈ వాణిజ్య ఒప్పందాలు ‘వికాస్ భీ, విరాసత్ భీ’ అనే ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ సంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అంశంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది ఆయుష్ వైద్యులు, యోగా శిక్షకులతో పాటు ఇతర భారతీయ సాంస్కృతిక, విజ్ఞాన నిపుణులు న్యూజిలాండ్‌లో పని చేయడానికి వీలుగా వీసాలను అందిస్తుంది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆయుర్వేదం, యోగా, ఇతర సంప్రదాయ వైద్య సేవల వాణిజ్యానికి అధికారికంగా అనుకూలమైన వ్యవస్థను కల్పిస్తుంది, ఆయుష్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒక సమకాలీన ఆరోగ్య సంరక్షణ పరిష్కారంగా నిలుపుతుంది. యూకే, ఈయూ, ఆస్ట్రేలియాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలలో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఆయుష్ వైద్యులు భారతదేశంలో పొందిన వృత్తిపరమైన అర్హతలను ఉపయోగించి వారి సేవలను అక్కడ అందించేందుకు అనుమతిస్తుంది. ఇది ఈయూ సభ్య దేశాలలో ఆయుష్ వెల్నెస్ సెంటర్లు, క్లినిక్‌ల స్థాపనకు కూడా సౌకర్యం కల్పిస్తుంది.

కొత్త ముప్పులను నిర్మూలిస్తూ విజయాన్ని సాధించడం భారతదేశ సాంస్కృతిక వారసత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ.. ఉగ్రవాదం, చొరబాట్లను ఉపయోగించి భారతదేశ సామరస్య వారసత్వానికి భంగం కలిగిస్తున్న మతోన్మాదులకు ఈ దేశం ఇంకా లక్ష్యంగానే ఉంది.

ప్రధాని మోదీ నాయకత్వంలోని నూతన భారతదేశం ఇటువంటి ముప్పులకు శక్తివంతంగా ప్రతిస్పందిస్తుంది. ఆపరేషన్ సింధూర్‌తో, భారతదేశం సీమాంతర ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు గుణపాఠం చెప్పింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో, చొరబాటుదారులకు మద్దతు ఇస్తూ, ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీస్తున్న పార్టీలను పశ్చిమ బెంగాల్ ఓటర్లు తిరస్కరించారు.

ముఖ్యంగా, ఆపరేషన్ సింధూర్, సోమనాథ ఆలయ పునర్నిర్మాణ వార్షికోత్సవాలు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఉన్నాయి. ఈ రెండూ భారతదేశపు స్థితిస్థాపకతను, బలాన్ని చాటుతున్నాయి. సోమనాథ్ కథ చివరికి రాజకీయాలకు అతీతమైనది. ఇది లొంగుబాటుకు నిరాకరించిన ఒక నాగరికత కథ. పునర్నిర్మాణం జరిగిన 75 సంవత్సరాల తర్వాత, సోమనాథ్ కేవలం ఒక ఆలయంగానే కాకుండా, భారతదేశపు స్థితిస్థాపకత, కొనసాగింపు, జాతీయ విశ్వాసానికి ఒక శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.

- పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page